న్యూఢిల్లీ: ముంబైపై 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల గాయాలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వీడి విచారణను వేగవంతం చేయాలన్నారు. 26/11 దాడులు జరిగి శుక్రవారానికి 13 ఏళ్లు పూర్తికావడంతో అందులో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ దౌత్యవేత్తని పిలిచి గట్టి హెచ్చరికలే జారీ చేసింది.
ముంబై దాడులపై విచారణను త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ‘26/11 బాధితులు 13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ భూభాగం నుంచే ఈ దాడులకు కుట్ర జరిగింది. అక్కడ్నుంచే దాడులకు తెగబడ్డారు. 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ కాస్తయినా నిజాయితీగా వ్యవహరించి కుట్రదారులను శిక్షించాలి’ అని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగే వరకు పాక్‌పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భూ భాగం నుంచే దాడులకు కుట్ర జరిగినట్టు అంగీకరించిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment