Pakistan high commissioner
-
విచారణ వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: ముంబైపై 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల గాయాలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వీడి విచారణను వేగవంతం చేయాలన్నారు. 26/11 దాడులు జరిగి శుక్రవారానికి 13 ఏళ్లు పూర్తికావడంతో అందులో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ దౌత్యవేత్తని పిలిచి గట్టి హెచ్చరికలే జారీ చేసింది. ముంబై దాడులపై విచారణను త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ‘26/11 బాధితులు 13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ భూభాగం నుంచే ఈ దాడులకు కుట్ర జరిగింది. అక్కడ్నుంచే దాడులకు తెగబడ్డారు. 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ కాస్తయినా నిజాయితీగా వ్యవహరించి కుట్రదారులను శిక్షించాలి’ అని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగే వరకు పాక్‌పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భూ భాగం నుంచే దాడులకు కుట్ర జరిగినట్టు అంగీకరించిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. -
పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!
-
పాకిస్తాన్‌కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్‌ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
ఆ సీనియర్ లీడర్ ను వీఐపీలా చూడలేదు
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్కిన ఎయిరిండియా విమానం 14 గంటలు ఆలస్యంగా బయలుదేరినా.. ఎయిరిండియా అధికారులు ఆయనను కనీసం పట్టించుకోలేదు. ఆయనను వీఐపీలా పరిగణించి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనిపై ఏచూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా తనకు కనీసం ఆతిథ్య మర్యాదలు ఇవ్వలేదని, విమానాల్లో ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో ఇప్పటికీ ఆ సంస్థ తెలుసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిరిండియా 701 విమానంలో ఆదివారం రాత్రి ఏచూరి ఎక్కారు. అయితే ఈ విమానం 14 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరింది. ఎయిరిండియా విమానం జాప్యంతో తనకు ఎదురైన అనుభవాన్ని ఏచూరి వివరిస్తూ.. 'నేను మళ్లీ పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ డిన్నర్ చేయాల్సి వచ్చింది. మా పార్టీ కారు వచ్చేవరకు నేను ఎయిర్ పోర్టులోనే వేచి చూసాను. మరో అంతర్జాతీయ విమానంలో నాలుగు సీట్లు ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ ప్రయాణికులు కనెక్టింగ్ విమానం ద్వారా అంతర్జాతీయ ఫ్లయిట్ ను అందుకోవాల్సి ఉండటంతో వారికోసం స్వచ్ఛదంగా ఆ సీట్లను వదులుకున్నాను. ఎట్టకేలకు సోమవారం ఉదయం టికెట్ బుక్కయింది. ఇది జరిగింది' అని ఏచూరి వివరించారు. గతంలోనూ వీఐపీల పట్ల ఎయిరిండియా ఇలాగే వ్యవహరించిందని, తనను, పాకిస్థాన్ హైకమిషనర్ ను, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పాక్ ఆతిథులను ఇలాగే అవమానించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సాంకేతికలోపంతోనే ఈ విమాన ప్రయాణంలో జాప్యం తలెత్తిందని ఎయిరిండియా చెప్తోంది. -
ఆ మ్యాచ్ పై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చోపచర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి. తమ జట్టు భద్రతకు భారత ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్ పట్టుబడుతుండగా, లిఖిత పూర్వక హామీ ఇచ్చేది లేదని ఇండియా అంటోంది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బాసిత్ విలేకరులతో మాట్లాడుతూ... తమ జట్టు భద్రతకు హోంశాఖ కార్యదర్శి హామీయిచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని తమదేశ ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. ఇంతకుమించి వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా, తమ దేశానికి ఎవరు వచ్చినా భద్రత కల్పిస్తామని అంతకుముందు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-పాక్ మ్యాచ్ ధర్మశాల నుంచి కోల్ కతాకు తరలిస్తామని బీసీసీఐ తనను అడగ్గా భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను భద్రత కారణాలతో కోల్‌కతాకు మార్చిన సంగతి తెలిసిందే. -
పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు
శ్రీనగర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్ కు ఆదివారం భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది... ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...తీవ్రగాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. -
పాక్ టూర్ వీసాలు భారత్ కు ఇవ్వరట!
కోల్ కతా: పాకిస్తాన్లో పర్యటించాలనుకుంటున్నారా? ఇక మీకు కష్టమే. ఎందుకంటారా, అయితే ఇది చదవండి. పాకిస్తాన్ లో పర్యటించాలనుకునే భారతీయులకు సమీప భవిష్యత్తులో ఆ ఆశ తీరేలాలేదు. ఇరుదేశాలు వీసాల ప్రక్రియకు ఇరుదేశాల నిబంధనలే కారణమని ఈ విషయాన్ని స్వయంగా భారత్ లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసితే తెలియజేశారు. ఇరుదేశాల ప్రజలు పర్యటనలపై ఆసక్తిచూపుతున్నారని ఆయన తెలియజేశారు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. సిక్కులు పాకిస్తాన్ ను సందర్శిస్తుంటారు. అలాగే హిందూ పర్యాటకులు పాకిస్తాన్ లో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వీసాల విషయంలో ఇబ్బందులు తొలగించుకోవచ్చని బాసిత్ తెలిపారు. దీనికి ఇరుదేశాలు ఒకరిపై ఒకరికి నమ్మకమే ప్రధాన విషయమని ఆయన పేర్కొన్నారు. వీసాల నిబంధనల్లో పారదర్శకతపై ఆయన మాట్లాడుతూ...మొదట ఇరుదేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్లను అమలుచేయాలనుకుంటున్నాం. అప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. దానిద్వారా ఈ పరిణామాలను ఇతర ప్రాంతాలకూ వ్యాప్తిచేయవచ్చు అని బాసిత్ తెలిపారు. -
భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సయ్యద్ అబ్బాస్
భారత్‌లో పాకిస్థాన్ కొత్త హైకమిషనర్‌గా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు. సల్మాన్ బషీర్ స్థానంలో ఆయనను నియమిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అబ్బాస్ ప్రస్తుతం ఢిల్లీలోని హైకమిషన్ కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో కాశ్మీర్ వ్యవహారాల డైరక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాక్ ప్రభుత్వం అబ్బాస్‌తో పాటు పలు దేశాలకు తమ రాయబారులను నియమించింది.