వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌కు కట్టుబడి ఉన్నాం
రక్షణ మంత్రి మనోహర్ పారికర్
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సందర్భంలో బీజేపీ ఇచ్చిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ హామీకి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్‌లో ఏడాదికి రూ.7,483 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకానికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వం 21 శాతం ఎక్కువ కేటాయించిందని వివరించారు. ఇదే కాకుండా రూ.10,500 కోట్ల బకాయిలను నాలుగు విడతల్లో అందజేస్తామని తెలిపారు.
పాకిస్తాన్‌ను ఐఎఫ్‌ఆర్‌కు ఆహ్వానించామని, ఎందుకు రాలేదో తెలియదని ఆయన చెప్పారు. సర్‌క్రీక్ వివాదం మినహా పాకిస్తాన్‌తో ఎలాంటి సమస్యలు ప్రస్తుతానికి లేవన్నారు. సియాచిన్ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఇంతవరకూ అక్కడ వెయ్యిమంది సైనికుల్ని కోల్పోయామన్నారు. ఇకమీదట ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సముద్ర వివాదాల పరిష్కారానికి ఓ ఏజెన్సీ ఉండాలన్నారు. ఐఎఫ్‌ఆర్‌కు బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, కంగనా రనౌత్‌లను ఆహ్వానించడం నేవీ తీసుకున్న నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానంగా పారికర్ చెప్పారు. ఐఎఫ్‌ఆర్‌కు వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తూ రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. వారు కేవలం నేవీ ఆహ్వానం మేరకు అతిథులుగానే వచ్చినట్లు భావిస్తున్నానన్నారు.
సముద్ర వివాదాలు సమసిపోవాలి
ప్రపంచ దేశాల మధ్య సముద్ర వివాదాలు సమసిపోవాలని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆకాంక్షించారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ మారిటైమ్ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన పారికర్ దేశ, విదేశ నేవీ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. సముద్ర సరిహద్దులు మనుషులు పెట్టుకున్నవేనని, గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి, సరిహద్దులు మారుతున్నాయని అన్నారు. ఆర్థిక ముఖచిత్రం కూడా మారుతోందన్నారు.
ఈ నేపథ్యంలో సముద్ర వనరుల్ని సమగ్రంగా వినియోగించుకోవాలని, వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పెరిగిపోతున్న సముద్ర దొంగల బెడద, ఉగ్రవాదాన్ని నౌకాదళాలు ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని నేవీ చీఫ్ ఆర్‌కే ధోవన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నౌకాదళాలన్నీ సమష్టిగా వాటిని ఎదుర్కోవాలన్నారు. ఇందులో భాగంగా నౌకాదళాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. భారత్ ఇప్పటికే అనేక దేశాలతో సమాచార మార్పిడి ప్రక్రియ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో మరిన్ని దేశాలతో సమాచార మార్పిడి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.