అది ఉగ్రవాద కుట్రే!
- పాక్ మరపడవ పేలుడుపై రక్షణ మంత్రి పారికర్
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా సముద్రంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి అడ్డుకున్నారని వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ రాత్రి తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్‌లో పడవతో పాటు మునిగిన నలుగురు వ్యక్తులను అక్రమ సరుకు రవాణాదారులుగా పేర్కొనడాన్ని తోసిపుచ్చారు. ఘటన జరిగిన చోటు చేపలు పట్టే ప్రాంతం కాదని, అలాగే సులభంగా తప్పించుకునేందుకు స్మగ్లర్లు సాధారణంగా వినియోగించే రద్దీ జలమార్గం కూడా కాదన్నారు. దుండగులు తమ పడవను తామే తగులబెట్టుకొని ఆత్మాహుతికి పాల్పడడాన్ని బట్టి వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పవచ్చన్నారు.
వారికి పాక్ నేవీ, సైన్యంతో పాటు ఇతర అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. మామూలు స్మగ్లర్లయితే లొంగిపోతారని, తమ ప్రాణాలను తీసుకోరని చెప్పారు. ఆ పడవలో పేలుడు పదార్థాలు ఉన్న విషయాన్ని ఊహించి చెప్పలేమని, అయితే వారి ఉద్దేశం మరేదో ఉందని అర్థమవుతోందన్నారు. ఈ పడవ కు సంబంధించిన పూర్తి విశ్లేషణలను మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. పాక్ కాల్పుల ఉల్లంఘనలపై స్పందిస్తూ చొరబాటుదారులకు అండగా నిలిచేందుకే పాక్ ఈ పని చేస్తోందన్నారు.
రక్షణ మంత్రి పీఎస్‌గా కృష్ణమూర్తి
పారికర్ ప్రైవేట్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి పి.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం గోవా సదన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలోనూ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు.