the Arabian Sea
-
కేరళను ముంచెత్తనున్న భారీ వర్షాలు!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టులో సంభవించిన వరద విషాదం నుంచి ప్రజలు తేరుకోకమునుపే ఈ నెల 7న మరోసారి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత వాతావరణ విభాగం బులెటిన్ ప్రకారం..‘ఈనెల 6 కల్లా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది మరింతగా బలపడి తుఫానుగా మారి ఒమన్ తీరం వైపుగా సాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కేరళలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ, తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయి. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలోనూ వానలు కురుస్తాయి’. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. త్రిస్సూర్, పలక్కడ్ జిల్లాల్లోని జలాశయాల్లో అదనంగా చేరిన నీటిని కిందికి వదిలేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో చెన్నై, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలోని 12 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. -
నా తీరాన... తొలి తెలుగు రాజ్యం...
గమనం నదుల స్వగత కథనం అవి పశ్చిమ కనుమలలో మహేబలేశ్వర్ పర్వత శ్రేణులు. కనుచూపు మేరలో అరేబియా సముద్రం మంద్రమైన చిరు అలలతో పలకరిస్తోంది. ఆ వైపుగా ప్రయాణిస్తే ఒక్క ఘడియలో సాగరాన్ని చేరుతాను. కానీ, ఉరకలెత్తే నా ప్రయాణానికి... నిలువెత్తు అలలతో తీరాన్ని కల్లోలపరిచే బంగాళాఖాతమే బావుంటుందనిపించింది. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరి ఇంద్రకీలాద్రి మీదున్న కనకదుర్గమ్మను చూస్తూ హంసలదీవి దగ్గర సాగరంలో కలుస్తాను. నా లక్ష్యం, గమ్యం తూర్పుగా ఉండడంతో పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రాన్ని పలకరింపుగా ఓ చూపు చూసి ప్రయాణ దిశను మార్చుకున్నాను. నేను పుట్టిన ప్రదేశం మీద నాకున్నంత మక్కువ దేవగిరి రాజు సింఘన్కి కూడా ఉండేది. అందుకే ఇక్కడ 13వ శతాబ్దంలో నాకు ‘కృష్ణబాయి’ ఆలయాన్ని కట్టాడు. పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ప్రతాప్‌ఘడ్ కోటను కట్టాడు. బ్రిటిష్ పాలకులు (బాంబే ప్రావిన్స్) వేసవి రాజధానిగా చేసుకున్నారు. నాతోపాటు ‘కొయ్నా, వెన్నా (వేణి), సావిత్రి, గాయత్రి అనే మరో నాలుగు నదులకు కూడా మహాబలేశ్వర్ పర్వతాలే పుట్టిల్లు. మా అయిదుగురం కలిసే ప్రదేశాన్ని పంచగంగ అంటారు. అక్కడ నన్ను కృష్ణమాత అని కొలుస్తారు. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.‘ఛత్రపతి శివాజీ మీద విజయం సాధించడానికి అఫ్జల్ ఖాన్ ‘వాయి’ దగ్గర వ్యూహాన్ని పన్నాడట. దాన్ని తిప్పికొట్టే శక్తినిమ్మని శివాజీ అనుచరుడు నన్ను మొక్కాడు. ఆ పోరులో శివాజీ విజయం సాధించాడు. అందుకు నా ఆశీస్సులే కారణమని నమ్ముతూ కృతజ్ఞతగా ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో నా ప్రవాహానికి అనుగుణంగా ఓ తటాకాన్ని తవ్వి ఆవు ముఖాకృతిని చెక్కారు. అలా నేను గోముఖం నుంచి బయటపడతానన్నమాట. వారణ, భీమ, దిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర నదులు నాలో కలుస్తూ నన్ను జీవనదిని చేస్తున్నాయి. సారవంతమైన నేలలున్న నా తీరంలో ఎందరు నివాసం ఏర్పరుచుకున్నారో లెక్కేలేదు. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పుడు తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసినందుకు నేనే అందలమెక్కినంత పులకింత. నా తీరాన దినదినాభివృద్ధి సాధించిన నగరాలు మహారాష్ట్రలో సంగ్లీ, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలే. సంగ్లీ దగ్గరున్న ఇర్విన్ బ్రిడ్జి మనదేశంలో వలసపాలకులు కట్టిన పురాతన వంతెన. ఎర్ర రాతితో బ్రిటిష్ నిర్మాణాలను పోలిన ఈ బ్రిడ్జి మధ్యలో రెండు దారులున్నాయి. నా ప్రవాహాన్ని ఏదో ఒక తీరం నుంచి కాకుండా మధ్యలో చూడాలంటే ఆ దారుల నుంచి నన్ను దగ్గర నుంచి చూడవచ్చు. మరో సంగతి... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ పశ్చిమ మహారాష్ట్రలో స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించాడు. ఒకసారి బ్రిటీష్ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక్కసారిగా నా ఒడిలో దూకేశాడు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి రక్షించే ప్రయత్నంలో ఉన్న ఒక మిత్రుడిని ఆపత్కాలంలో నా కొంగు చాటున దాచేసి రక్షించానన్న తృప్తి ఇప్పటికీ ఈ వంతెన కింద నుంచి వెళ్లేటప్పుడు గుర్తొస్తుంటుంది. సంగ్లీ మీదనే ‘అంకాలి’ అని మరో వంతెన... హైదరాబాద్- సికింద్రాబాద్ నగరాలను కలిపే ట్యాంక్‌బండ్‌లాగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కలుపుతుంది. నాపై కర్నాటకలో బసవ సాగర్, ఆలమట్టి, నారాయణపూర్ ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టారు. బీజాపూర్- భాగల్‌కోట్ జిల్లాల మధ్య కట్టిన ఆలమట్టి సృష్టించిన వివాదం చిన్నది కాదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినప్పుడూ నా నీటి పంపకం ప్రధానమైన అంశంగా మారింది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ మీదుగా తెలంగాణలో అడుగుపెడితే అక్కడ నిజాం ప్రతిపాదించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పలకరిస్తుంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్లు వివాదాలను తీర్చడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చింది. నల్గొండ -గుంటూరు జిల్లాల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రధాని నెహ్రూ అంకితభావంతో కట్టిన దేవాలయం. నెహ్రూ పునాది వేస్తే ఇందిరా గాంధీ నీటిని విడుదల చేసిన ఈ ఆనకట్టకు అతిపెద్ద మానవ నిర్మిత రాతి ఆనకట్ట అనే బిరుదును ప్రదానం చేసి మరీ ప్రాధాన్యం కల్పించారు. హరిత విప్లవంలో నేను సైతం నా వంతు నీటిచుక్కనందించాననే సంతృప్తితో కర్నూలులో సంగమేశ్వరుడిని పలకరించి నల్లమల అడవులలో పులిని సగౌరవంగా ప్రణమిల్లి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుని నాకు మోక్షం సిద్ధింస్తుందని సంతోషిస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాక తుంగభద్ర, భావనాసి నదులు కర్నూలు జిల్లాలో నాకు తోడవుతున్నాయి. నాకు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు సంగమేశ్వరునికి అభిషేకం చేస్తున్నా. నా తీరాన్ని ఆసరా చేసుకుని పరిఢవిల్లిన బౌద్ధానికి ఆనవాళ్లుగా స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు వెలిశాయి. కానీ రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి. మౌనంగా అమరావతి స్తూపాన్ని చూస్తూ సాగిపోతుంటే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఇక్కడే కృష్ణవేణి కొప్పున పూలు చుట్టుకుని తెలుగింటి విరిబోణిలా నాకు ప్రతీకగా నిలుచుని ఉంటుంది. కృష్ణ, వేణి నదుల కలయిక అని కృష్ణవేణి అన్నారు. ఇంతకీ ‘కృష్ణ’ అనే స్థిరపడడానికి నేను నల్లగా ఉండడమే కారణం. కృష్ణుడికీ, ద్రౌపదికీ అలాగే వచ్చింది ఆ పేరు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నా గమనంలో నాకు తోడయ్యే ఉపనదులకు, వాటి ఉప నదులకు, వాటి మీద కట్టిన ప్రాజెక్టులను లెక్కపెట్టడం, గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే మరి. వీటితోపాటుగా ఆకేరు, పాలేరు, వేదవతి, స్వర్ణముఖి, వేద, అవంతి, వరద, సిన, నిర, ముల, ముథ, చందాని, కామిని, మోషి, బోరి, మన్, భోగవతి, ఇంద్రావతి, కుండలి, కుమండల, ఘోడ్, భామా, పవ్నా వంటి చిన్న చిన్నవి నా ఉపనదుల్లో కలిసేవి, నాలో కలిసేవి కూడా ఉన్నాయి. పుట్టింది: పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ దగ్గర (మహారాష్ట్ర), జోర్ గ్రామంలో, సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో. అరేబియా సముద్రతీరానికి 64 కి.మీల దూరంలో. ప్రవాహదూరం: 1400 కి.మీ.లు సాగరసంగమం: కృష్ణాజిల్లా హంసలదీవికి సమీపంలో పాలకాయి తిప్ప దగ్గర (బంగాళాఖాతంలో) -
అది ఉగ్రవాద కుట్రే!
పాక్ మరపడవ పేలుడుపై రక్షణ మంత్రి పారికర్ న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా సముద్రంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి అడ్డుకున్నారని వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రాత్రి తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్‌లో పడవతో పాటు మునిగిన నలుగురు వ్యక్తులను అక్రమ సరుకు రవాణాదారులుగా పేర్కొనడాన్ని తోసిపుచ్చారు. ఘటన జరిగిన చోటు చేపలు పట్టే ప్రాంతం కాదని, అలాగే సులభంగా తప్పించుకునేందుకు స్మగ్లర్లు సాధారణంగా వినియోగించే రద్దీ జలమార్గం కూడా కాదన్నారు. దుండగులు తమ పడవను తామే తగులబెట్టుకొని ఆత్మాహుతికి పాల్పడడాన్ని బట్టి వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పవచ్చన్నారు. వారికి పాక్ నేవీ, సైన్యంతో పాటు ఇతర అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. మామూలు స్మగ్లర్లయితే లొంగిపోతారని, తమ ప్రాణాలను తీసుకోరని చెప్పారు. ఆ పడవలో పేలుడు పదార్థాలు ఉన్న విషయాన్ని ఊహించి చెప్పలేమని, అయితే వారి ఉద్దేశం మరేదో ఉందని అర్థమవుతోందన్నారు. ఈ పడవ కు సంబంధించిన పూర్తి విశ్లేషణలను మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. పాక్ కాల్పుల ఉల్లంఘనలపై స్పందిస్తూ చొరబాటుదారులకు అండగా నిలిచేందుకే పాక్ ఈ పని చేస్తోందన్నారు. రక్షణ మంత్రి పీఎస్‌గా కృష్ణమూర్తి పారికర్ ప్రైవేట్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి పి.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం గోవా సదన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలోనూ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. -
ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్కల్
మై క్యాంపస్ లైఫ్ అరేబియా సముద్రపు అలల గలగలలతో అలరారే అందమైన చిన్న పట్టణం.. కర్ణాటకలోని సూరత్కల్. చిన్ని కృష్ణుని ముగ్ధమోహన రూపానికి నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపి, శ్రీ మంజునాధుడు కొలువైన ధర్మస్థలకు దగ్గరలో ఉన్న ఈ ఊరు.. అత్యున్నత విద్యకు పెట్టింది పేరు. ఇంజనీరింగ్ విద్యను అందించడంలో దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ).. సూరత్కల్లోనే కొలువుదీరింది. దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు ఎన్ఐటీల్లో వరంగల్ తర్వాత ఎక్కువమంది తెలుగు విద్యార్థులు చేరుతున్న ఎన్ఐటీ ఇదే. సూరత్కల్లోని నిట్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఎంఎస్. మేరీ మనీషా.. తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతో మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అన్నయ్య యూఎస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 94 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 98 శాతం మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో 2000 ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో 7000 ర్యాంకు సాధించాను. మొదటి నుంచి నాకు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్లంటే ఆసక్తి. చాలామంది ‘అవి అబ్బాయిలు తీసుకునే బ్రాంచ్‌లు.. అమ్మాయివి నీకెందుకు’ అనేవారు. అయినా నా ఆసక్తికి తోడు అమ్మానాన్నల ప్రోత్సాహంతో సివిల్ ఇంజనీరింగ్ లో చేరాను. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్‌లో ఎన్ఐటీ - సూరత్కల్ను ఎంచుకున్నాను. దినచర్య ఇలా క్యాంపస్‌లో ప్రతిరోజూ ఉదయం 7.55 గంటలకు దినచర్య మొదలవుతుంది. మొదటి పీరియడ్ 7.55 నుంచి 8.50 వరకు ఉంటుంది. రెండో పీరియడ్ 9.00 గంటలకు ప్రారంభమవుతుంది. పీరియడ్ వ్యవధి 50 నిమిషాలు. ప్రతి పీరియడ్ మధ్యలో 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ చేస్తాం. తర్వాత ఉంటే ఒక పీరియడ్.. లేదంటే సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్నాక్స్, టీ ఇస్తారు. రాత్రి 8 గంటలకు డిన్నర్. అన్ని రకాల టిఫిన్స్ క్యాంటీన్లో దొరుకుతాయి. మన తెలుగు విద్యార్థులు ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ, పూరీ, పరోటా, దోశ, చపాతీ వంటివన్నీ ఉంటాయి. అల్పాహారం బాగుంటుంది కానీ భోజనం కొంచెం చప్పగా ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు.. ఇళ్ల నుంచి పచ్చళ్లు తెచ్చుకుని భోజనాన్ని ఇష్టంగా లాగిస్తుంటారు. నెలకోసారి గ్రాండ్ డిన్నర్ ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఆహార పదార్థాలు (వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్‌క్రీమ్స్) అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు.. ఎంతో ఫ్రెండ్లీ క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. పశ్చిమ కనుమల్లో పడమటి తీరాన.. అరేబియా సముద్రానికి అతిదగ్గరలోనే క్యాంపస్ ఉంది. ఇక్కడ ర్యాగింగ్ అసలు లేదు. ఇన్స్టిట్యూట్కు ‘జీరో ర్యాగింగ్’ అవార్డు కూడా వచ్చింది. నేను మొదటిసారి క్యాంపస్‌లో అడుగుపెట్టాక.. జానియర్స్ అందరికీ సీనియర్స్ వెల్కం పార్టీ ఇచ్చారు. ఇందులో భాగంగా పేరు, ఎక్కడ నుంచి వచ్చారు? ఏ బ్రాంచ్ వంటి వివరాలు అడిగారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. అదృష్టవశాత్తూ ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. వీరు జూనియర్స్‌కు ఎంతో సహాయం చేస్తారు. సబ్జెక్టుల పరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. అధునాతన సదుపాయాలతో క్యాంపస్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే.. మొత్తం 250 ఎకరాల్లో విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, సకల సౌకర్యాలతో లైబ్రరీ, క్రీడా మైదానం, షాపింగ్ కాంప్లెక్స్, ఏటీఎం, విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవడానికి కావాల్సిన చక్కటి వాతావరణం, సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నతవిద్యనభ్యసించిన అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే ఉండటం ఎంతో ఉపయుక్తం. మాకొచ్చే ఎలాంటి సందేహాలనైనా వారు ఇట్టే నివృత్తి చేస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట ఎన్ఐటీలు జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలన్న విషయం తెలిసిందే కదా! కాబట్టి ఆ స్థాయికి తగినట్టు బోధన ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. ప్రపంచంలో, దేశంలో పేరొందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలను క్యాంపస్‌కు తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తారు. ఇటీవల ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ క్యాంపస్‌ను సందర్శించారు. ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇంజనీర్ అని వ్యవహరిస్తారు. అంతేకాకుండా కోర్సులో భాగంగా ప్రతి ఏటా మార్చిలో ఇండస్ట్రియల్ ట్రిప్, జనవరిలో క్లాస్ ట్రిప్‌లు ఉంటాయి. వీటిల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తాం. తద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలను అలవర్చుకుంటాం. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ చదువుతున్న బ్రాంచ్ ఆధారంగా ఏడాదికి పది సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టును బట్టి రెండు లేదా మూడు క్రెడిట్స్ ఉంటాయి. మొత్తం నాలుగేళ్ల కోర్సులో 90 నుంచి 100 వరకు క్రెడిట్స్ ఉంటాయి. నేను ఫస్టియర్‌లో 10 పాయింట్లకు 7.8 సీజీపీఏ సాధించాను. ఇన్స్టిట్యూట్లో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఫస్టియర్‌లో 90 శాతం మార్కులు సాధించినవారికి ప్రతి నెలా రూ.1000 స్కాలర్షిప్ అందిస్తారు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తారు. క్యాంపస్.. మినీ ఇండియా ఎన్ఐటీ - సూరత్కల్ను మినీ ఇండియాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ)లో వచ్చే ర్యాంకు ఆధారంగా బీటెక్‌లో ఉన్న మొత్తం సీట్లలో సగం సీట్లను హోంస్టేటా కోటాలో కర్ణాటక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా సగం సీట్లను ఇతర రాష్ర్ట విద్యార్థులతో భర్తీ చేస్తారు. వీరిలో దాదాపు సగం మంది మన తెలుగువారే. మినీ ఇండియా అని ఎందుకన్నానంటే.. క్యాంపస్‌లో ఉగాది, గణేశ్ చతుర్ధి, హోళీ, దుర్గాపూజ, శ్రీరామ నవమి, దాండియా, జన్మాష్టమి ఇలా అన్ని పండుగలను నిర్వహిస్తారు. అన్నింటిలోకి హోళిని రంగ రంగ వైభవంగా జరుపుకుంటాం. పండుగలే కాకుండా ప్రతి ఏటా మార్చిలో కల్చరల్ ఫెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇన్సిడెంట్ అంటారు. సాధారణంగా ఏ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు.. ఆ రాష్ట్రాల విద్యార్థులతో కలిసి తిరుగుతుంటారు. మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌ను ఉపయోగిస్తాం. సైంటిస్టునవుతా బీటెక్ పూర్తయ్యాక విదేశాల్లో ఎంఎస్ చేస్తాను. తర్వాత పీహెచ్డీ కూడా పూర్తి చేసి సైంటిస్ట్ కావాలనేది నా లక్ష్యం.