నా తీరాన... తొలి తెలుగు రాజ్యం... | Soliloquy rivers article | Sakshi
Sakshi News home page

నా తీరాన... తొలి తెలుగు రాజ్యం...

Published Mon, Mar 9 2015 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

నా తీరాన...  తొలి తెలుగు రాజ్యం...

నా తీరాన... తొలి తెలుగు రాజ్యం...

గమనం
నదుల స్వగత కథనం
 
అవి పశ్చిమ కనుమలలో మహేబలేశ్వర్ పర్వత శ్రేణులు. కనుచూపు మేరలో అరేబియా సముద్రం మంద్రమైన చిరు అలలతో పలకరిస్తోంది. ఆ వైపుగా ప్రయాణిస్తే ఒక్క ఘడియలో సాగరాన్ని చేరుతాను. కానీ, ఉరకలెత్తే నా ప్రయాణానికి... నిలువెత్తు అలలతో తీరాన్ని కల్లోలపరిచే బంగాళాఖాతమే బావుంటుందనిపించింది. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరి ఇంద్రకీలాద్రి మీదున్న కనకదుర్గమ్మను చూస్తూ హంసలదీవి దగ్గర సాగరంలో కలుస్తాను. నా లక్ష్యం, గమ్యం తూర్పుగా ఉండడంతో పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రాన్ని పలకరింపుగా ఓ చూపు చూసి ప్రయాణ దిశను మార్చుకున్నాను.

నేను పుట్టిన ప్రదేశం మీద నాకున్నంత మక్కువ దేవగిరి రాజు సింఘన్‌కి కూడా ఉండేది. అందుకే ఇక్కడ 13వ శతాబ్దంలో నాకు ‘కృష్ణబాయి’ ఆలయాన్ని కట్టాడు. పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ప్రతాప్‌ఘడ్ కోటను కట్టాడు. బ్రిటిష్ పాలకులు (బాంబే ప్రావిన్స్) వేసవి రాజధానిగా చేసుకున్నారు. నాతోపాటు ‘కొయ్‌నా, వెన్నా (వేణి), సావిత్రి, గాయత్రి అనే మరో నాలుగు నదులకు కూడా మహాబలేశ్వర్ పర్వతాలే పుట్టిల్లు. మా అయిదుగురం కలిసే ప్రదేశాన్ని పంచగంగ అంటారు. అక్కడ నన్ను కృష్ణమాత అని కొలుస్తారు. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.‘ఛత్రపతి శివాజీ మీద విజయం సాధించడానికి అఫ్జల్ ఖాన్ ‘వాయి’ దగ్గర వ్యూహాన్ని పన్నాడట. దాన్ని తిప్పికొట్టే శక్తినిమ్మని శివాజీ అనుచరుడు నన్ను మొక్కాడు. ఆ పోరులో శివాజీ విజయం సాధించాడు. అందుకు నా ఆశీస్సులే కారణమని నమ్ముతూ కృతజ్ఞతగా ఏటా ఉత్సవాలు చేస్తున్నారు.

ఈ ఆలయంలో నా ప్రవాహానికి అనుగుణంగా ఓ తటాకాన్ని తవ్వి ఆవు ముఖాకృతిని చెక్కారు. అలా నేను గోముఖం నుంచి బయటపడతానన్నమాట. వారణ, భీమ, దిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్‌గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర నదులు నాలో కలుస్తూ నన్ను జీవనదిని చేస్తున్నాయి.

సారవంతమైన నేలలున్న నా తీరంలో ఎందరు నివాసం ఏర్పరుచుకున్నారో లెక్కేలేదు. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పుడు తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసినందుకు నేనే అందలమెక్కినంత పులకింత. నా తీరాన దినదినాభివృద్ధి సాధించిన నగరాలు మహారాష్ట్రలో సంగ్లీ, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలే.

సంగ్లీ దగ్గరున్న ఇర్విన్ బ్రిడ్జి మనదేశంలో వలసపాలకులు కట్టిన పురాతన వంతెన. ఎర్ర రాతితో బ్రిటిష్ నిర్మాణాలను పోలిన ఈ బ్రిడ్జి మధ్యలో రెండు దారులున్నాయి. నా ప్రవాహాన్ని ఏదో ఒక తీరం నుంచి కాకుండా మధ్యలో చూడాలంటే ఆ దారుల నుంచి నన్ను దగ్గర నుంచి చూడవచ్చు. మరో సంగతి... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ పశ్చిమ మహారాష్ట్రలో స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించాడు. ఒకసారి బ్రిటీష్ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక్కసారిగా నా ఒడిలో దూకేశాడు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి రక్షించే ప్రయత్నంలో ఉన్న ఒక మిత్రుడిని ఆపత్కాలంలో నా కొంగు చాటున దాచేసి రక్షించానన్న తృప్తి ఇప్పటికీ ఈ వంతెన కింద నుంచి వెళ్లేటప్పుడు గుర్తొస్తుంటుంది. సంగ్లీ మీదనే ‘అంకాలి’ అని మరో వంతెన... హైదరాబాద్- సికింద్రాబాద్ నగరాలను కలిపే ట్యాంక్‌బండ్‌లాగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కలుపుతుంది.  

నాపై కర్నాటకలో బసవ సాగర్, ఆలమట్టి, నారాయణపూర్ ఆనకట్టలు, రిజర్వాయర్‌లు కట్టారు. బీజాపూర్- భాగల్‌కోట్ జిల్లాల మధ్య కట్టిన ఆలమట్టి సృష్టించిన వివాదం చిన్నది కాదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినప్పుడూ నా నీటి పంపకం ప్రధానమైన అంశంగా మారింది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ మీదుగా తెలంగాణలో అడుగుపెడితే అక్కడ నిజాం ప్రతిపాదించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పలకరిస్తుంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్‌లు వివాదాలను తీర్చడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చింది. నల్గొండ -గుంటూరు జిల్లాల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రధాని నెహ్రూ అంకితభావంతో కట్టిన దేవాలయం. నెహ్రూ పునాది వేస్తే ఇందిరా గాంధీ నీటిని విడుదల చేసిన ఈ ఆనకట్టకు అతిపెద్ద మానవ నిర్మిత రాతి ఆనకట్ట అనే బిరుదును ప్రదానం చేసి మరీ ప్రాధాన్యం కల్పించారు. హరిత విప్లవంలో నేను సైతం నా వంతు నీటిచుక్కనందించాననే సంతృప్తితో కర్నూలులో సంగమేశ్వరుడిని పలకరించి నల్లమల అడవులలో పులిని సగౌరవంగా ప్రణమిల్లి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుని నాకు మోక్షం సిద్ధింస్తుందని సంతోషిస్తాను.

ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాక తుంగభద్ర, భావనాసి నదులు కర్నూలు జిల్లాలో నాకు తోడవుతున్నాయి. నాకు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు సంగమేశ్వరునికి అభిషేకం చేస్తున్నా. నా తీరాన్ని ఆసరా చేసుకుని పరిఢవిల్లిన బౌద్ధానికి ఆనవాళ్లుగా స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు వెలిశాయి. కానీ రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి. మౌనంగా అమరావతి స్తూపాన్ని చూస్తూ సాగిపోతుంటే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఇక్కడే కృష్ణవేణి కొప్పున పూలు చుట్టుకుని తెలుగింటి విరిబోణిలా నాకు ప్రతీకగా నిలుచుని ఉంటుంది. కృష్ణ, వేణి నదుల కలయిక అని కృష్ణవేణి అన్నారు. ఇంతకీ ‘కృష్ణ’ అనే స్థిరపడడానికి నేను నల్లగా ఉండడమే కారణం. కృష్ణుడికీ, ద్రౌపదికీ అలాగే వచ్చింది ఆ పేరు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
నా గమనంలో నాకు తోడయ్యే ఉపనదులకు, వాటి ఉప నదులకు, వాటి మీద కట్టిన ప్రాజెక్టులను లెక్కపెట్టడం, గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే మరి. వీటితోపాటుగా ఆకేరు, పాలేరు, వేదవతి, స్వర్ణముఖి, వేద, అవంతి, వరద, సిన, నిర, ముల, ముథ, చందాని, కామిని, మోషి, బోరి, మన్, భోగవతి, ఇంద్రావతి, కుండలి, కుమండల, ఘోడ్, భామా, పవ్నా వంటి చిన్న చిన్నవి నా ఉపనదుల్లో కలిసేవి, నాలో కలిసేవి కూడా ఉన్నాయి.
 
పుట్టింది: పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ దగ్గర (మహారాష్ట్ర), జోర్ గ్రామంలో,
సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో. అరేబియా సముద్రతీరానికి 64 కి.మీల దూరంలో.
ప్రవాహదూరం: 1400 కి.మీ.లు
సాగరసంగమం: కృష్ణాజిల్లా హంసలదీవికి సమీపంలో పాలకాయి తిప్ప దగ్గర (బంగాళాఖాతంలో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement