ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే.
ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు.
పిల్లలు తింటేనే నాకు బలం
నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం.
– అంజనాదేవి
మా కోడలు నన్ను మార్చేసింది
గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్‌డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్.
భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్‌స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్‌ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి.
రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్‌ఫుడ్‌తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది.
– సురేఖ
అత్తమ్మ నా రోల్‌మోడల్
మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్‌డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్‌లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం.
ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్‌లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్‌స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది.
– ఉపాసన
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment