three generations
-
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్‌భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్‌లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్‌వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్‌కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్‌ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్‌కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్‌కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
ఆ సమయంలో అలర్ట్‌గా లేకుంటే ఇక అంతే!
వాషింగ్టన్: గర్భిణీ స్త్రీలు సరైన అహారం తీసుకోనట్లయితే పుట్టబోయే పిల్లలు అనారోగ్యానికి గురవుతారన్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం పుట్టబోయే పిల్లలకు మాత్రమే పరిమితం కాదు.. రాబోయే మూడు తరాలకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫాస్ట్‌ఫుడ్, ఎక్కువ కొలెస్ట్రాల్‌తో కూడిన అహారాన్ని అధికంగా తీసుకున్న వారి సంతానంలో మూడు తరాల పాటు స్థూలకాయత్వం ముప్పు ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అందుకే గర్భిణీ స్త్రీలు అహారం విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అహారపు అలవాట్లు పిల్లల్లో డయబెటిస్, హృదయ సంబంధ సమస్యలపై అత్యధికంగా ప్రభావం చూపుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కెల్లీ మోలీ తెలిపారు. ఇక ప్రెగ్నెన్సీకి ముందు మహిళల శరీర బరువు కూడా జన్యుపరంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు.