ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్‌కల్ | Practical, the combination of research .. | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్‌కల్

Published Mon, Aug 25 2014 12:24 AM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్‌కల్ - Sakshi

ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్‌కల్

 మై క్యాంపస్ లైఫ్
 
అరేబియా సముద్రపు అలల గలగలలతో అలరారే అందమైన చిన్న పట్టణం.. కర్ణాటకలోని సూరత్‌కల్. చిన్ని కృష్ణుని ముగ్ధమోహన రూపానికి నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపి, శ్రీ మంజునాధుడు కొలువైన ధర్మస్థలకు దగ్గరలో ఉన్న ఈ ఊరు.. అత్యున్నత విద్యకు పెట్టింది పేరు. ఇంజనీరింగ్ విద్యను అందించడంలో దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ).. సూరత్‌కల్‌లోనే కొలువుదీరింది. దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు ఎన్‌ఐటీల్లో వరంగల్ తర్వాత ఎక్కువమంది తెలుగు విద్యార్థులు చేరుతున్న ఎన్‌ఐటీ ఇదే. సూరత్‌కల్‌లోని నిట్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఎంఎస్. మేరీ మనీషా.. తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..
 
అమ్మానాన్నల ప్రోత్సాహంతో

మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అన్నయ్య యూఎస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 94 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 98 శాతం మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో 2000 ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో  7000 ర్యాంకు సాధించాను. మొదటి నుంచి నాకు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లంటే ఆసక్తి. చాలామంది ‘అవి అబ్బాయిలు తీసుకునే బ్రాంచ్‌లు.. అమ్మాయివి నీకెందుకు’ అనేవారు. అయినా నా ఆసక్తికి తోడు అమ్మానాన్నల ప్రోత్సాహంతో సివిల్ ఇంజనీరింగ్ లో చేరాను. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ - సూరత్‌కల్‌ను ఎంచుకున్నాను.
 
దినచర్య ఇలా
 
క్యాంపస్‌లో ప్రతిరోజూ ఉదయం 7.55 గంటలకు దినచర్య మొదలవుతుంది. మొదటి పీరియడ్ 7.55 నుంచి 8.50 వరకు ఉంటుంది. రెండో పీరియడ్ 9.00 గంటలకు ప్రారంభమవుతుంది. పీరియడ్ వ్యవధి 50 నిమిషాలు. ప్రతి పీరియడ్ మధ్యలో 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ చేస్తాం. తర్వాత ఉంటే ఒక పీరియడ్.. లేదంటే సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్నాక్స్, టీ ఇస్తారు. రాత్రి 8 గంటలకు డిన్నర్. అన్ని రకాల టిఫిన్స్ క్యాంటీన్‌లో దొరుకుతాయి. మన తెలుగు విద్యార్థులు ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ, పూరీ, పరోటా, దోశ, చపాతీ వంటివన్నీ ఉంటాయి. అల్పాహారం బాగుంటుంది కానీ భోజనం కొంచెం చప్పగా ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు.. ఇళ్ల నుంచి పచ్చళ్లు తెచ్చుకుని భోజనాన్ని ఇష్టంగా లాగిస్తుంటారు. నెలకోసారి గ్రాండ్ డిన్నర్ ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఆహార పదార్థాలు (వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్‌క్రీమ్స్) అందుబాటులో ఉంచుతారు.
 
విద్యార్థులు.. ఎంతో ఫ్రెండ్లీ
 
క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. పశ్చిమ కనుమల్లో పడమటి తీరాన.. అరేబియా సముద్రానికి అతిదగ్గరలోనే క్యాంపస్ ఉంది. ఇక్కడ ర్యాగింగ్ అసలు లేదు. ఇన్‌స్టిట్యూట్‌కు ‘జీరో ర్యాగింగ్’ అవార్డు కూడా వచ్చింది. నేను మొదటిసారి క్యాంపస్‌లో అడుగుపెట్టాక.. జానియర్స్ అందరికీ సీనియర్స్ వెల్‌కం పార్టీ ఇచ్చారు. ఇందులో భాగంగా పేరు, ఎక్కడ నుంచి వచ్చారు? ఏ బ్రాంచ్ వంటి వివరాలు అడిగారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. అదృష్టవశాత్తూ ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. వీరు జూనియర్స్‌కు ఎంతో సహాయం చేస్తారు. సబ్జెక్టుల పరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు.
 
అధునాతన సదుపాయాలతో క్యాంపస్
 
ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పాలంటే.. మొత్తం 250 ఎకరాల్లో విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, సకల సౌకర్యాలతో లైబ్రరీ, క్రీడా మైదానం, షాపింగ్ కాంప్లెక్స్, ఏటీఎం, విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవడానికి కావాల్సిన చక్కటి వాతావరణం, సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నతవిద్యనభ్యసించిన అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే ఉండటం ఎంతో ఉపయుక్తం. మాకొచ్చే ఎలాంటి సందేహాలనైనా వారు ఇట్టే నివృత్తి చేస్తారు.
 
ప్రాక్టికల్స్‌కు పెద్దపీట

ఎన్‌ఐటీలు జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలన్న విషయం తెలిసిందే కదా! కాబట్టి ఆ స్థాయికి తగినట్టు బోధన ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. ప్రపంచంలో, దేశంలో పేరొందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలను క్యాంపస్‌కు తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తారు. ఇటీవల ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ క్యాంపస్‌ను సందర్శించారు. ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇంజనీర్ అని వ్యవహరిస్తారు. అంతేకాకుండా కోర్సులో భాగంగా ప్రతి ఏటా మార్చిలో ఇండస్ట్రియల్ ట్రిప్, జనవరిలో క్లాస్ ట్రిప్‌లు ఉంటాయి. వీటిల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తాం. తద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలను అలవర్చుకుంటాం.
 
మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్

 
చదువుతున్న బ్రాంచ్ ఆధారంగా ఏడాదికి పది సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టును బట్టి రెండు లేదా మూడు క్రెడిట్స్ ఉంటాయి. మొత్తం నాలుగేళ్ల కోర్సులో 90 నుంచి 100 వరకు క్రెడిట్స్ ఉంటాయి. నేను ఫస్టియర్‌లో 10 పాయింట్లకు 7.8 సీజీపీఏ సాధించాను. ఇన్‌స్టిట్యూట్‌లో మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి. ఫస్టియర్‌లో 90 శాతం మార్కులు సాధించినవారికి ప్రతి నెలా రూ.1000 స్కాలర్‌షిప్ అందిస్తారు. మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
 
క్యాంపస్.. మినీ ఇండియా
 
ఎన్‌ఐటీ - సూరత్‌కల్‌ను మినీ ఇండియాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ)లో వచ్చే ర్యాంకు ఆధారంగా బీటెక్‌లో ఉన్న మొత్తం సీట్లలో సగం సీట్లను హోంస్టేటా కోటాలో కర్ణాటక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా సగం సీట్లను ఇతర రాష్ర్ట విద్యార్థులతో భర్తీ చేస్తారు. వీరిలో దాదాపు సగం మంది మన తెలుగువారే. మినీ ఇండియా అని ఎందుకన్నానంటే.. క్యాంపస్‌లో ఉగాది, గణేశ్ చతుర్ధి, హోళీ, దుర్గాపూజ, శ్రీరామ నవమి, దాండియా, జన్మాష్టమి ఇలా అన్ని పండుగలను నిర్వహిస్తారు. అన్నింటిలోకి హోళిని రంగ రంగ వైభవంగా జరుపుకుంటాం. పండుగలే కాకుండా ప్రతి ఏటా మార్చిలో కల్చరల్ ఫెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇన్సిడెంట్ అంటారు. సాధారణంగా ఏ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు.. ఆ రాష్ట్రాల విద్యార్థులతో కలిసి తిరుగుతుంటారు. మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌ను ఉపయోగిస్తాం.
 
సైంటిస్టునవుతా

బీటెక్ పూర్తయ్యాక విదేశాల్లో ఎంఎస్ చేస్తాను. తర్వాత పీహెచ్‌డీ కూడా పూర్తి చేసి సైంటిస్ట్ కావాలనేది నా లక్ష్యం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement