తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టులో సంభవించిన వరద విషాదం నుంచి ప్రజలు తేరుకోకమునుపే ఈ నెల 7న మరోసారి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత వాతావరణ విభాగం బులెటిన్ ప్రకారం..‘ఈనెల 6 కల్లా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది మరింతగా బలపడి తుఫానుగా మారి ఒమన్ తీరం వైపుగా సాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కేరళలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ, తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయి. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలోనూ వానలు కురుస్తాయి’.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. త్రిస్సూర్, పలక్కడ్ జిల్లాల్లోని జలాశయాల్లో అదనంగా చేరిన నీటిని కిందికి వదిలేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో చెన్నై, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలోని 12 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment