ఆ అవమానకర ప్రశ్నే ‘సర్జికల్’కు కారణం
పణాజి: మయన్మార్ సరిహద్దు వెంట ఉగ్రవాదులను ఏరివేసిన తరువాత ఎదురైన ఓ అవమానకరమైన ప్రశ్నే సర్జికల్ దాడులకు దారితీసిందని మాజీ రక్షణ మంత్రి , గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం తెలిపారు. 2015, జూన్ 4న ఈశాన్య ప్రాంత మిలిటెంట్ గ్రూప్ ఎన్‌ఎస్‌సీఎన్–కే మణిపూర్‌లో భారత ఆర్మీ వాహనంపై మెరుపుదాడికి దిగి 18 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి నాలుగు రోజుల తరువాత అంటే జూన్ 8న మయన్మార్ సరిహద్దులో ఆర్మీ జరిపిన దాడిలో సుమారు 80 మంది మిలిటెంట్లు మరణించారు.
ఆ తరువాత జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో... పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా అలాంటి ఆపరేషన్ నిర్వహించే సత్తా భారత ఆర్మీకి ఉందా? అని యాంకర్ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను అడగడం తనలో ఆలోచనలు రేకెత్తించిందని పరీకర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 29న పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులకు 15 నెలల ముందు అంటే 2015 జూన్ 9 నుంచే ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన అధునాతన రాడార్‌తో పాక్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించి ధ్వంసం చేశామని తెలిపారు.