
కొన్ని తీర్పులు అర్థరహితం
రక్షణ మంత్రి మనోహర్ పరీకర్
పణజి: న్యాయవ్యవస్థ ఇచ్చిన కొన్ని ఆదేశాలు అర్థరహితమైనవని.. వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీ లేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ విమర్శించారు. ఆయన సోమవారం పణజిలో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. ‘‘ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదికా లేకుండా అర్థరహిత ఆదేశాలు ఇవ్వటం జరుగుతోంది. శాస్త్రాన్ని అర్థం చేసుకోని కొందరు మనుషులు దానికి భాష్యం చెప్పటం మొదలుపెట్టారు.
భారత్‌లో కొందరు పెట్టుబడులు పెట్టడం ఆపివేశారు.. ఎందుకంటే కోర్టు నిర్ణయాలు తాము అర్థం చేసుకోగల పరిధిని దాటిపోయి ఉన్నాయని అంటున్నారు. ‘‘కాలుష్యం కలిగిస్తున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చని మేం అర్థం చేసుకోగలం. కానీ.. కాలుష్యం కలిగించని లేదా పెట్రోల్ వాహనం కన్నా తక్కువ కాలుష్యకారకమైన వాహనాలను నిషేధించటంలో అర్థం ఏమిటి?’’ అని వ్యాఖ్యానించారు.