పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు.
అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు.
కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది.
Comments
Please login to add a commentAdd a comment