mrudula sinha
-
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
ఇద్దరు సీఎంలకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నా
తిరుమల : వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా వారికి జ్ఞానం ప్రసాదించాలని స్వామివారికి కోరినట్లు ఆయన చెప్పారు. కాగా గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా వెంకన్నను ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. -
ప్రధాని స్ఫూర్తితో ముందుకు
బోడుప్పల్: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్దామని గోవాగర్నర్ మృదుల సిన్హా పేర్కొన్నారు. మేడిపల్లిలోని మేకల బాల్‌రెడ్డి పంక్షన్ హాల్లో గురువారం జరిగిన సాధీ సౌత్ రీజనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రం, ఆరోగ్యం, అభివృద్ధిలో మిగతా దేశాలకు దీటుగా నిలవాలన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సాధీ నెట్ వర్క్ సేవలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు. చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ కోఆర్డినేటర్ శాడకొండ శ్రీకాంత్‌రెడ్డి, జహీదబేగంతో పాలు పలువురికి సాధీ సేవా పురస్కార అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధీ సౌత్ ఇన్చార్జ్ మంకన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆర్బి సిన్హా, సాధీ నెట్ వర్క్ స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మోహినిగార్గ్, ఏపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, కర్ణాటక ఇన్చార్జ్ కరుణాకర్, సింగరేస్ కాలరీస్ డెరైక్టర్ విజయకుమార్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.