నేడే పరీకర్ ప్రమాణం
⇒ రక్షణ మంత్రి పదవికి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
⇒ జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు
పణజి, సాక్షి, న్యూఢిల్లీ: గోవా సీఎంగా మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో సోమవారం ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని సలహా మేరకు పరీకర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీకర్‌తో పాటు 8 లేదా 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవాలో మెజార్టీ రాకపోయిన ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేబినెట్‌లో గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి రెండు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి.
కాంగ్రెస్ లెక్కకు గడ్కరీ చెక్...
గోవాలో బీజేపీ 13 స్థానాలే సాధించినా... జీఎఫ్‌పీ, ఎంజీపీ, ఇద్దరు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది అవసరం. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైంది. అదే సమయంలో బీజేపీ తరఫున సీనియర్ నేత గడ్కరీ రంగంలోకి పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చేశారు. పరీకరే సీఎం అభ్యర్థి అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం సాగింది.
జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు
పరీకర్ రాజీనామాతో రక్షణ శాఖ బాధ్యతల్ని ఆర్ధిక మంత్రి జైట్లీకి అదనంగా అప్పగించారు. ప్రధాని సలహా మేరకు రక్షణ శాఖను జైట్లీకి కేటాయించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రక్షణ శాఖ బాధ్యతల్ని జైట్లీ చేపట్టడం ఇది రెండోసారి. సీఎంగా పరీకర్ వెళ్తుండడంతో ... శాసనసభకు పోటీ చేసేందుకు వీలుగా మాపుసా స్థానానికి డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ రాజీనామా చేశారు.
త్వరలో కేబినెట్‌లో మార్పులు
రెండో విడత బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల్లో ఒకరిని కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకునే అవకాశాలున్నాయని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని ఆ రాష్ట్రానికి సీఎంగా చేయవచ్చని చెబుతున్నారు.
మమ్మల్ని ఆహ్వానించండి..: కాంగ్రెస్
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీకి తగినంత మద్దతు ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్‌కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొంది.
సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్
మనోహర్ పరీకర్‌ను గోవా సీఎంగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సోమవారం రాత్రి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఖేహర్ నివాసంలో పిటిషన్ దాఖలుచేసింది. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వారం రోజులు సెలవు కావడంతో కేసును ప్రత్యేక బెంచ్ విచారించనుంది. గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.