పనాజీ : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు సుభాష్ శిరోడ్కర్, దయానంద్ సోప్టే మంగళవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని వారు తెలిపారు. తాము బీజేపీలో చేరుతున్నామని, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారని శిరోడ్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం వారు పార్టీలో చేరికపై ప్రకటన చేశారు.
కాగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అమిత్ షా బెదిరింపులకు గురిచేసి బీజేపీలో చేర్చుకున్నారని గోవాకు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ చెల్లకుమార్ ఆరోపించారు. గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైదొలిగితే సభలో కాంగ్రెస్‌కు సమానంగా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
మొత్తం 38 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో తాజా బలాబలాలను చూస్తే బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలుండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ముగ్గురు, గోవా ఫార్వార్డ్ పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఉన్నారు.
గత కొద్దివారాలుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీఎం మనోహర్ పారికర్ ఆదివారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం గోవాలోని దోనాపౌలాలోని తన ప్రైవేట్ నివాసంలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment