
మాజీ సైనికుల ‘మెడల్స్ నిరసన’
♦ తిరిగిచ్చేసిన 2 వేల మంది
♦ ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్‌పై నిరసన
చండీగఢ్/వాస్కోడాగామా: ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ (ఓఆర్‌ఓపీ)పై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను నిరసిస్తూ చాలామంది మాజీ సైనికులు మంగళవారం తమ మెడల్స్‌ను తిరిగి ఇచ్చేశారు. దేశానికి తాము అందించిన వీరోచిత సేవలకు గుర్తుగా ఇచ్చిన మెడల్స్‌ను ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌లలో మాజీ సైనికులు తిరిగి ఇచ్చేశారు. ఓఆర్‌ఓపీ పథకంపై ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ ‘బ్లాక్ దివాళీ’ని పాటిస్తామని మాజీ సైనికులు చెప్పారు. గతవారం ఓఆర్‌ఓపీపై ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అంబాలా, మోగ, జలంధర్, గురుదాస్‌పూర్‌లలో మాజీ సైనికులు మెడల్స్‌ను ఇచ్చేశారని, తదుపరి ముంబై, పుణే, బెంగళూరు, వడోదరాలలో ఇచ్చేస్తారని నిరసనకారుల ప్రతినిధి కల్నల్ అనిల్ కౌల్ ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెడల్స్‌ను వాపస్ చేశారు.
మెడల్స్‌ను వెనక్కితీసుకోకుంటే రోడ్డుపైనే వదిలేస్తామని చెప్పారని, అందుకే వాటిని తీసుకోవాల్సి వచ్చిందని కలెక్టర్ సంజయ్ కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ వ్యవహారంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తీవ్రంగా స్పందించారు. వీరి చర్య సైనికుల మాదిరి లేదని మండిపడ్డారు. మాజీ సైనికులు ఇలాంటి చర్యలకు దిగడం కలచివేసిందన్నారు. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్థికపరమైన డిమాండ్లకు మెడల్స్‌కు ముడిపెట్టవద్దని వాస్కోడాగామాలో సూచించారు. సైనికుల మాదిరి ప్రవర్తించలేదన్న పరీకర్ వ్యాఖ్యలపై కల్నల్ అనిల్ కౌల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శైలి రక్షణ మంత్రి మాదిరి లేదని నిప్పులు చెరిగారు. ఓఆర్‌ఓపీపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది.