వారికీ ఆ నొప్పి చూపించాలి..
దేశానికి హాని చేసే వ్యక్తులు, సంస్థలకు ఆ భాషలోనే బదులివ్వాలి: పరీకర్
♦ అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది భారతదేశం నిర్ణయించుకోవాలి
♦ ఇతరులను బాధించే వారు ఆ బాధను అనుభవించే వరకూ మారరు
న్యూఢిల్లీ: హాని చేసే వారికి అదే భాష అర్థమవుతుందని.. భారతదేశాన్ని ఏ వ్యక్తి లేదా సంస్థ గాయపరచినా వారికి అదే బాధను రుచిచూపించాలని, అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలనేది భారత్ నిర్ణయించుకోవాలని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. ఇతరులను బాధించే వారు.. ఆ బాధను స్వయంగా అనుభవించే వరకూ మారరని చరిత్ర చెప్తోందని పఠాన్‌కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో అన్నారు. పరీకర్ సోమవారం ఢిల్లీలో సైనిక దళాధిపతి జనరల్ దల్బీర్‌సింగ్‌సుహాగ్ సహా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న సైనిక సదస్సులో మాట్లాడారు. ‘‘ఇది నా అభిప్రాయం.. ప్రభుత్వ ఆలోచనగా తీసుకోరాదు. ఎవరైనా మనకు హాని చేస్తే.. వారికి అదే భాష అర్థమవుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను.
అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాగే ఎవరైనా దేశానికి హాని చేస్తున్నపుడు.. ఆ నిర్దిష్ట వ్యక్తి లేదా సంస్థలకు కూడా - నేను కావాలనే వ్యక్తి లేదా సంస్థ అనే పదాలు వాడాను - అటువంటి చర్యల నొప్పిని ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు వివరణ అడగగా.. ‘‘మనం వారికి బాధ కలిగించే వరకూ - వారు ఎవరైనా సరే - ఇటువంటి చర్యలు తగ్గవు’’ అని స్పందించారు. ఉగ్రదాడిలో తమ ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల పట్ల దేశం గర్విస్తోందన్నారు. అయితే.. తమ ప్రాణాలను త్యాగం చేయటానికి బదులుగా.. మన శత్రువు, దేశానికి శత్రువుల ప్రాణాలను తీసుకునే కోణంలో ఆలోచించాలని మన సైనికులకు చెప్పాలని పేర్కొన్నారు.
హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సుష్మా భేటీ
భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై అనిశ్చితి నేపథ్యంలో.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారన్న దానిపై ఇద్దరి కార్యాలయాలూ స్పందించలేదు. అయితే పఠాన్‌కోట్ ఉగ్రదాడి అంశంపై చర్చించి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ఎప్పుడు సమావేశం జరిగినా.. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వివరాలను కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖకు అందిస్తుంది. ఇటీవల భారత్ - పాక్‌లు చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ నెల 15వ తేదీన పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశం కావాల్సి ఉంది. అయితే.. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో.. ఈ దాడికి బాధ్యులైన వారిపై తక్షణం నిర్ణయాత్మక చర్యలు చేపట్టటంపై విదేశాంగ కార్యదర్శుల చర్చల భవితవ్యం ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
సరిహద్దులో రక్షణ స్థావరాలన్నిటా హై-అలర్ట్...: ఉగ్రసంస్థలకు సరిహద్దులోని భారత భద్రతా స్థావరాలు లక్ష్యంగా ఉండటంతో స్థావరాల్లో హై-అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. రాజ్‌నాథ్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అంతర్గత భద్రత, దాడులను తిప్పికొట్టే సన్నద్ధత మీద సమీక్ష నిర్వహించారు.
ఎన్‌ఐఏ ముందుకు పంజాబ్ ఎస్‌పీ
పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న పంజాబ్ ఎస్‌పీ సల్వీందర్‌సింగ్ సోమవారం ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో ఆయనను లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న సల్వీందర్ ఈ మేరకు ఢిల్లీలో ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యారు.
వారు ఆయనను 8గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సల్వీందర్ వంటమనిషి మదన్‌గోపాల్‌ను కూడా ప్రశ్నించటానికి ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది. అవసరమైతే.. ఎస్‌పీని, వంట మనిషిని కలిపి ప్రశ్నిస్తామని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. తాము పాక్ సరిహద్దులోని మందిరాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఎస్‌పీ చెప్పటంతో.. ఆ మందిరం బాధ్యుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. కాగా, హతమార్చిన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తించేందుకు భారత్ ఇంటర్‌పోల్ సాయం కోరింది.