Pathankot terror attack
-
'నిఖా' అంటే ఏంటో తెలుసా?
ఉగ్రవాదులు ఒక్కో దానికి ఒక్కో కోడ్ పెట్టుకుంటారు. అసలు భాషలో మాట్లాడుకుంటే మధ్యలో నిఘా వర్గాలు పసిగట్టి తమ కుట్రను భగ్నం చేస్తాయన్న ఉద్దేశంతో.. రహస్యంగా తమకు మాత్రమే అర్థమయ్యేలా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అలాగే.. పఠాన్‌కోట్ ఉగ్రదాడి చేసేటపుడు కూడా వాళ్లు ఒక కోడ్ పెట్టుకున్నారు. ఈ దాడికి వాళ్లు 'నిఖా' అని కోడ్ పెట్టుకున్నారు. ఉగ్రదాడికి వచ్చిన ముష్కరులకు 'బారాతీ' అని కోడ్ పెట్టారు. ఈ విషయం జైషేమహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జిషీట్లో వెల్లడైంది. ఈ చార్జిషీటులో పేర్కొన్న వివరాల ప్రకారం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి కుట్ర పన్నింది కేవలం మసూద్ అజహర్ మాత్రమే కాదని, పాకిస్థానీ అధికారుల హస్తం కూడా అందులో ఉందని తెలిసింది. మసూద్ అజహర్ సోదరుడు, జైషేమహ్మద్ ఉప నేత అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాకు చెందిన షహీద్ లతీఫ్, నలుగురు హంతకులకు ప్రధాన హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కషీఫ్ జైన్ల పేర్లు కూడా చార్జిషీట్లో ఉన్నాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సహా మొత్తం ఏడుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు, మరో 37 మంది గాయపడ్డారు. దాడికి వచ్చిన నలుగురు దుండగులూ హతమయ్యారు. ఇప్పుడు ఎన్ఐఏ దాఖలుచేసిన చార్జిషీటు సాయంతో.. మసూద్ అజహర్ మీద ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించేలా భారతదేశం మరింత ఒత్తిడి తెచ్చేందుకు వీలు కుదురుతుంది. దీనికి చైనా ఇన్నాళ్లూ అడ్డు చెబుతున్న విషయం తెలిసిందే. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి చేసింది జైషే మహ్మదేనని భారత ప్రభుత్వానికి తెలియాలన్నది ఉగ్రవాదుల ఉద్దేశంలా కనిపించింది. వాళ్ల వద్ద చేత్తో రాసిన నోట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లీషులోను, మరొకటి ఉర్దూలోను ఉన్నాయి. అందులో.. 'జైషే మహ్మద్ జిందాబాద్.. తంఘ్‌దర్ నుంచి సాంబా, కతువా, రాజ్‌బాఘ్, ఢిల్లీ వరకు అఫ్జల్‌గురును ఉరి తీసినందుకు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాం.. అల్లా ఏజీఎస్ 25-12-15'' అని రాసి ఉంది. -
చర్చల నుంచి భారత్ పారిపోతోంది: పాక్
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై సంయుక్త దర్యాప్తునకు పాక్ ముందుకొచ్చినప్పటికీ... భారతదేశం మాత్రం చర్చల నుంచి పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన బుధవారం ప్రసంగించారు. భారత్‌తో చర్చలను తిరిగి ఆరంభించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పఠాన్‌కోట్ దాడిపై సంయుక్త దర్యాప్తునకు ముందుకొచ్చినప్పటికీ భారత్ మాత్రం విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను నిలిపివేసిందని పేర్కొన్నారు. ఉప ఖండంలో ఉద్రిక్తతకు ప్రధాన కారణం కశ్మీర్ సమస్యేనని తాము నమ్ముతున్నామని.. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు, ఐరాస తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించనిదే సమస్యలు పరిష్కారం కాబోవని వ్యాఖ్యానించారు. -
‘పఠాన్‌కోట్’లో విఫలమయ్యారు
పంజాబ్ పోలీసుల పాత్ర ప్రశ్నార్థకం: పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడిని అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని, ఉగ్రదాడుల నిరోధక వ్యవస్థలో ఏదో తప్పు జరుగుతోందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో రక్షణ వ్యవస్థ సరిగా లేదని మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. హోం శాఖ వ్యవహారాలపై 197వ నివేదికను సమర్పిస్తూ... పంజాబ్ పోలీసుల పాత్ర కూడా ప్రశ్నార్థకంగా, అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల్ని అర్థంచేసుకోవడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారంది. భారీ భద్రత కలిగిన ఆ స్థావరంలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారో అర్థం కావడం లేదని పేర్కొంది. అపహరణకు గురై విడుదలయ్యాక ఎస్పీ, అతని స్నేహితుడు చెప్పిన నమ్మకమైన నిఘా సమాచారాన్ని పరిశీలించడానికే పోలీసులు పరిమితమయ్యారని, ముప్పును ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందించలేదంటూ అభిప్రాయపడింది. ఎస్పీ, అతని స్నేహితుడ్ని ఉగ్రవాదులు ఎందుకు వదిలేశారో ఎన్ఐఏ విచారణ జరపాలంది. వైమానిక స్థావరంలో ప్రహారీ గోడ చుట్టూ ఎలాంటి రహదార్లు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాక్ టీంను అనుమతించడం సరికాదు పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నప్పుడు విచారణకు ఆ దేశం సాయం ఎందుకు కోరారంటూ కమిటీ ప్రశ్నించింది. పఠాన్‌కోట్ స్థావరంలోకి పాక్ ఉమ్మడి దర్యాప్తు బృందాన్ని(జేఐటీ) అనుమతించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఉగ్రవాదులు చాలా సులువుగా భారత్‌లో ప్రవేశించడం చూస్తుంటే... పాక్ భద్రతా సంస్థలు, నిఘా విభాగాల సాయం లేకుండా దాడి జరిగి ఉండకపోవచ్చని కమిటీ అభిప్రాయపడింది. రక్షణ కంచె, ఫ్లడ్ లైట్లతో పాటు బీఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం పహారా ఉన్నా తీవ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంట వరుస దాడుల నేపథ్యంలో పహారా, రక్షణ కంచె, ఫ్లడ్ లైటింగ్‌లను పటిష్టం చేయాలని, సూచించింది. -
ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్ ఆగ్రహం!
వాషింగ్టన్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో అధికారంతో తిరస్కరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించింది. సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అసమగ్రంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబర్చడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితిలో చైనాతో సహా ఐదు అగ్రరాజ్యాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన తర్వాతే భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. జనవరి 2న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనకు సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రమాదకరమైన ఉగ్రవాది అని, అతన్ని నిషేధించకపోవడం వల్ల భారత్ ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా మాత్రం అజార్ ఉగ్రవాది కాదని, అందుకే తాము వీటో ద్వారా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించామని సమర్థించుకుంటోంది. -
పఠాన్‌కోట్‌లో మరో కారు.. అలాగే దోపిడీ!
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జల్లాలో మళ్లీ కలకలం రేగింది. ఉగ్రదాడి సమయంలో తుపాకి చూపించి ఓ ఎస్పీ కారు ఎత్తుకెళ్లినట్లే.. ఈసారి ఓ పౌరుడిని తుపాకితో బెదిరించి అతడి కారును కొంతమంది సాయుధులు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి పఠాన్‌కోట్ జిల్లాలోని సుజన్పూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈసారి మాత్రం జరిగిన ఘటనలో ఉగ్రకోణం ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా జిల్లాలో హై ఎలర్ట్ ప్రకటించారు. ఫోర్డ్ ఫిగో కారులో వెళ్తున్న వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు ఆపారని, అతడిని తుపాకితో బెదిరించి బలవంతంగా కిందకు దించారని పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వాళ్లలో ఇద్దరు కారులో పారిపోగా మూడో వ్యక్తి మోటారు సైకిల్‌పై వెళ్లాడన్నారు. పఠాన్‌కోట్ - జమ్ము హైవే మీద పఠాన్‌కోట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే సుజన్పూర్ నగరం ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కారు దోపిడీ ఘటనను కూడా భద్రతాదళాలు తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. -
మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చండి: భారత్
న్యూయార్క్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్, పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కుట్రదారు మసూద్ అజార్ పేరును భద్రతా మండలి ఆంక్షల జాబితాలో చేర్చాలని భారత్ ఐరాసను కోరింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, దౌత్యవేత్త సయీద్ అక్బరుద్దీన్ ఈమేరకు న్యూజిలాండ్ రాయబారి, 1267 అల్ కాయిదా ఆంక్షల కమిటీ అధ్యక్షుడు జెరార్డ్ జాకౌబ్స్ వాన్ బోహెమెన్కు ఈమేరకు లేఖరాశారు. జైషే సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు, పఠాన్‌కోట్ దాడి ఘటనకు ఆ సంస్థ చీఫ్ మసూద్ ప్రమేయమున్నట్లు పటిష్ట ఆధారాలు చూపుతూ దీన్ని రాశారు. మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చకుంటే భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ముప్పు ఉంటుందని స్పష్టంచేశారు. -
'పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం'
లాహోర్: పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటన.. భారత్, పాకిస్థాన్ శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలు సరైన దిశలో సాగుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి ఘటన జరగడం ప్రతికూల ప్రభావం చూపించిందని షరీఫ్ అంగీకరించారు. పాకిస్థాన్ రేడియా ఈ విషయాలను వెల్లడించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు పాక్ ఓ ఉన్నతస్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన దౌత్య చర్చలు వాయిదా పడ్డాయి. -
పఠాన్‌కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు
పఠాన్‌కోట్: పఠాన్‌కోట్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ఆప్ఘనిస్తాన్ పౌరుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును ప్రారంభించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై కొన్ని వారాల కిందట జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పఠాన్ కోట్ పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి వెళ్లింది. అన్ని రకాల కదలికలను పోలీసులు పసిగడుతున్నారు. అదీ కాకుండా ఈ మంగళవారం పఠాన్ కోట్ రైల్వే స్టేషన్లో బాంబు ఉన్నట్లు అలికిడి వినిపించడంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్కడ ఏం లేదని గుర్తించారు. పోలీసులు, బలగాలు ఇదే అప్రమత్తతను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ అఫ్ఘనిస్తాన్ వ్యక్తి పట్టుబడ్డాడు. -
సరిహద్దుకు లేజర్ కవచం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా హోం శాఖ చర్యలు చేపట్టనుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో ప్రమాదం పొంచి ఉన్న కంచె లేని 40కి పైగా ప్రదేశాల్లో త్వరలో లేజర్ కిరణాలతో కంచె (గోడ) ఏర్పాటు చేయనున్నారు. బీఎస్ఎఫ్ అభివృద్ధి పరిచిన ఈ లేజర్ కిరణాల కంచెను పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. కంచెను దాటేందుకు ప్రయత్నిస్తే ఆ కిరణాలు గుర్తించి పెద్ద శబ్దంతో హెచ్చరికలు చేస్తాయి. ప్రమాదమున్న 40 ప్రాంతాల్లో 5 లేదా 6 కేంద్రాల్లో మాత్రమే లేజర్ గోడలు ఏర్పాటు చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడిన బమియాల్లో ఉన్న ఉజ్ నది తీరంలో ఈ లేజర్ గోడను పఠాన్‌కోట్‌లో దాడి తర్వాత ఏర్పాటు చేశారు. -
క్షమ లేదిక.. ఏదో ఒకటి చేసేస్తాం
జైపూర్: 'మనది క్షమాగుణం కలిగిన దేశం. చాలామందిని చాలా విషయాల్లో క్షమిస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది. క్షమ లేదిక. ఏదో ఒక విధంగా తప్పుచేసినవాళ్ల భరతం పడతాం' అంటూ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీచేశారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్. శనివారం జైపూర్ లోని సీఐఎస్ఎఫ్ మైదానంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ యువకులు గొప్ప దేశభక్తులని, జాతీయవాద భావాలు నిండినవారని అందుకే సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపుతారని కితాబిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగ ఉద్యోగులు ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడిపోకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి ఎయిర్ ఫోర్స్ లోని కొందరు ఉద్యోగులే సహకరించారనే ఆరోపణలు వెలుగుచేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ 'హనీట్రాప్ కేసులు వెలుగులోకి రావటం వాస్తవమే అయినప్పటికీ ఉన్నతస్థాయి అధికారులెవ్వరూ ఆ ఉచ్చులో పడలేదు. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగులే కుట్రకు పాల్పడ్డారు. నిజానికి వ్యవస్థ అత్యంత బలంగా ఉన్నప్పుడే శత్రువులు హనీట్రాప్ తరహా పాచికలువేస్తారు. ఏదిఏమైనప్పటికీ ఉద్యోగులు ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని పారికర్ పేర్కొన్నారు. -
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
-
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
లాహోర్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నిందితులు, జైషే గ్రూపు ఉగ్రసంస్థ సభ్యులపై తీసుకుంటున్న చర్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు నోరువిప్పింది. ఉగ్రదాడుల సూత్రధారి, జైషే సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ గృహ నిర్బంధ కస్టడీలో ఉన్నట్లు పాక్ పేర్కొంది. కానీ, అతడిని అరెస్టు చేయలేదని న్యాయశాఖ మంత్రి రానా సనాఉల్లా తెలిపారు. మసూద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లుగా గురువారం కథనాలు వచ్చాయి. వాటిపై పాక్ వివరణ ఇచ్చుకుంది. పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులెవన్నది తెలియకుండా మసూద్‌ను ఎలా అరెస్టు చేస్తామని సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాక్ దర్యాప్తు చేపట్టిందని, సాక్ష్యాధారాల కోసం ప్రయత్నాలు చేపట్టిందన్నారు. మరోవైపు భారత్ వాదన ప్రకారం.. ఈ ఏడాది జనవరి 2న ఎయిర్ బేస్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనకు మసూద్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తోంది. మసూద్ అరెస్ట్ వార్త స్వాగతించదగినది... పాక్ తీసుకున్న తొలి చర్యకు సంతోషమే, కానీ అతడి అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనకపోవడంపై విదేశాంగశాఖ మంత్రి వికాస్ స్వరూప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి మసూద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. -
చర్చలు వాయిదా
* విదేశాంగ కార్యదర్శుల భేటీపై భారత్-పాక్ ఉమ్మడి నిర్ణయం * గతానికి భిన్నంగా సమన్వయంతో సాగుతున్న దాయాది దేశాలు * జైషే సభ్యుల అరెస్టు కీలక, సానుకూల చర్యగా భారత్ ఆహ్వానం * పాక్ దర్యాప్తు బృందం పఠాన్‌కోట్ సందర్శించేందుకు అంగీకారం న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ల మధ్య శుక్రవారం జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను స్వల్ప కాలం పాటు వాయిదా వేయాలని ఇరు దేశాలూ ఉమ్మడిగా అంగీకరించాయి. చర్చల ప్రక్రియను పఠాన్‌కోట్ ఉగ్రదాడి పట్టాలు తప్పించరాదని సమన్వయంతో ముందుకు కదిలాయి. దాడిపై దర్యాప్తు కోసం పాక్ ప్రత్యేక దర్యాప్తు బృందం పఠాన్‌కోట్‌ను సందర్శించేందుకు భారత్ అనుమతించింది. వట్టి ప్రకటనలు సరిపోవు... భారత్ - పాక్‌లు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గతానికి భిన్నంగా ఇప్పుడు తమ వ్యూహాలపై సమన్వయంతో పనిచేస్తుండటం విశేషం. భారత్‌లో ఉగ్రదాడుల విషయంలో పాక్ శక్తుల పాత్రను గతంలో నిరాకరించిన పాక్.. ఇప్పుడు జైషే నేతలు, సభ్యులను అరెస్ట్ చేసింది. జైషే చీఫ్ మసూద్‌ను అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలినప్పటికీ.. ఆ సంస్థ ఉగ్రవాదులను అరెస్ట్ చేయటం సానుకూలమైన, కీలకమైన చర్యగా భారత్ ఆహ్వానించింది. వట్టి ప్రకటనలు సరిపోవని తాము కోరుకుంటున్నామని ఉద్ఘాటించింది. అలాగే.. భారత్ కూడా ఇరు దేశాల మధ్య చర్చలను రద్దు చేసుకోలేదు. జైషే చీఫ్ అరెస్టుకు, చర్చలకు ముడిపెట్టలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌధరితో చర్చల నిమిత్తం గురువారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే.. వారిద్దరూ గురువారం ఫోన్లో మాట్లాడుకుని చర్చలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. చర్చల వాయిదా విషయాన్ని తొలుత పాక్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లో ప్రకటించగా.. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో వెల్లడించింది. మళ్లీ చర్చలు నిర్వహించే తేదీని ఖరారు చేసేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. పాక్ సిట్‌కు పూర్తి సహకారం పఠాన్‌కోట్ దాడిపై దర్యాప్తు చేయటం కోసం పాక్ సిట్ పర్యటనకు భారత్ అంగీకరించటంతో పాటు.. దాడికి పాల్పడ్డ వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు సిట్ దర్యాప్తుకు అవసరమైన సాయమంతా అందిస్తామని పేర్కొంది. పఠాన్‌కోట్ దాడితో సంబంధమున్న ఉగ్రవాద శక్తులపై దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించినట్లు పాక్ ప్రభుత్వం బుధవారం చేసిన జైషే సభ్యుల అరెస్టు ప్రకటన తెలియజేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాశ్స్వరూప్ గురువారం మీడియాతో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌పై దర్యాప్తు కోసం సిట్‌ను పంపించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. ఆ సంస్థ దర్యాప్తుకు భారత దర్యాప్తు సంస్థలు పూర్తిగా సహకరిస్తాయన్నారు. జైషేపై పాక్ కేసు పెట్టిందా లేదా! జైషే సభ్యులను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించిన నేపథ్యంలో పఠాన్‌కోట్ దాడికి సంబంధించి ఆ సంస్థపై పాక్ ఏదైనా కేసు నమోదు చేసిందా లేదా అనే అంశంపై తమకు సమాచారం లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టుల విషయం ప్రకటించిన పాక్ సర్కారు ఏ చట్టం కింద ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి, జైషే సభ్యులను అరెస్ట్ చేసిందనేది కూడా వెల్లడించాలని వ్యాఖ్యానించాయి. కాగా.. పఠాన్‌కోట్ ఘటనపై పాక్ తీరుకు నిరసనగా ఢిల్లీలోని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ కార్యాలయంపై హిందూసేన కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. -
దాడి ప్రాంతంలో చైనా వైర్ లెస్ సెట్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడే అవకాశం ఉంది. ఈ దాడికి సంబంధించి అంగుళం కూడా వదిలిపెట్టకుండా శోధిస్తున్న ఎన్ఐఏ అధికారులు ఓ కొత్త ఆధారాన్ని సంపాధించారు. పఠాన్ కోట్ దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ వాహనంలో చైనాకు చెందిన ఓ వైర్ లెస్ సెట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని పరీక్షించేందుకు అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. మరోపక్క, ఈ దాడికి సంబంధించి అనుమానంతో అదుపులోకి తీసుకున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను వరుసగా మూడో రోజు కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఒకే అంశంపై ఎన్ఐఏ అధికారులు మార్చి మార్చి ప్రశ్నిస్తుండగా సల్వీందర్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వివరణల పట్ల సంతృప్తి చెందని అధికారులు మరిన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, ఆ రోజు రెండు సార్లు వేళకాని వేళలో పంజ్ పీర్ దర్గాను సల్వీందర్ సందర్శించారని వివరణ ఇచ్చిన దర్గా సంరక్షకుడు సోమరాజ్ కు కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో సోమరాజ్ కూడా గురువారం ఎన్ఐఏ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. -
వారికీ ఆ నొప్పి చూపించాలి..
దేశానికి హాని చేసే వ్యక్తులు, సంస్థలకు ఆ భాషలోనే బదులివ్వాలి: పరీకర్ ♦ అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది భారతదేశం నిర్ణయించుకోవాలి ♦ ఇతరులను బాధించే వారు ఆ బాధను అనుభవించే వరకూ మారరు న్యూఢిల్లీ: హాని చేసే వారికి అదే భాష అర్థమవుతుందని.. భారతదేశాన్ని ఏ వ్యక్తి లేదా సంస్థ గాయపరచినా వారికి అదే బాధను రుచిచూపించాలని, అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలనేది భారత్ నిర్ణయించుకోవాలని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. ఇతరులను బాధించే వారు.. ఆ బాధను స్వయంగా అనుభవించే వరకూ మారరని చరిత్ర చెప్తోందని పఠాన్‌కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో అన్నారు. పరీకర్ సోమవారం ఢిల్లీలో సైనిక దళాధిపతి జనరల్ దల్బీర్సింగ్సుహాగ్ సహా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న సైనిక సదస్సులో మాట్లాడారు. ‘‘ఇది నా అభిప్రాయం.. ప్రభుత్వ ఆలోచనగా తీసుకోరాదు. ఎవరైనా మనకు హాని చేస్తే.. వారికి అదే భాష అర్థమవుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాగే ఎవరైనా దేశానికి హాని చేస్తున్నపుడు.. ఆ నిర్దిష్ట వ్యక్తి లేదా సంస్థలకు కూడా - నేను కావాలనే వ్యక్తి లేదా సంస్థ అనే పదాలు వాడాను - అటువంటి చర్యల నొప్పిని ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు వివరణ అడగగా.. ‘‘మనం వారికి బాధ కలిగించే వరకూ - వారు ఎవరైనా సరే - ఇటువంటి చర్యలు తగ్గవు’’ అని స్పందించారు. ఉగ్రదాడిలో తమ ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల పట్ల దేశం గర్విస్తోందన్నారు. అయితే.. తమ ప్రాణాలను త్యాగం చేయటానికి బదులుగా.. మన శత్రువు, దేశానికి శత్రువుల ప్రాణాలను తీసుకునే కోణంలో ఆలోచించాలని మన సైనికులకు చెప్పాలని పేర్కొన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సుష్మా భేటీ భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై అనిశ్చితి నేపథ్యంలో.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారన్న దానిపై ఇద్దరి కార్యాలయాలూ స్పందించలేదు. అయితే పఠాన్‌కోట్ ఉగ్రదాడి అంశంపై చర్చించి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ఎప్పుడు సమావేశం జరిగినా.. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వివరాలను కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖకు అందిస్తుంది. ఇటీవల భారత్ - పాక్‌లు చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ నెల 15వ తేదీన పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశం కావాల్సి ఉంది. అయితే.. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో.. ఈ దాడికి బాధ్యులైన వారిపై తక్షణం నిర్ణయాత్మక చర్యలు చేపట్టటంపై విదేశాంగ కార్యదర్శుల చర్చల భవితవ్యం ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో రక్షణ స్థావరాలన్నిటా హై-అలర్ట్...: ఉగ్రసంస్థలకు సరిహద్దులోని భారత భద్రతా స్థావరాలు లక్ష్యంగా ఉండటంతో స్థావరాల్లో హై-అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. రాజ్‌నాథ్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అంతర్గత భద్రత, దాడులను తిప్పికొట్టే సన్నద్ధత మీద సమీక్ష నిర్వహించారు. ఎన్ఐఏ ముందుకు పంజాబ్ ఎస్పీ పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ సోమవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో ఆయనను లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న సల్వీందర్ ఈ మేరకు ఢిల్లీలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యారు. వారు ఆయనను 8గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సల్వీందర్ వంటమనిషి మదన్‌గోపాల్‌ను కూడా ప్రశ్నించటానికి ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. అవసరమైతే.. ఎస్పీని, వంట మనిషిని కలిపి ప్రశ్నిస్తామని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. తాము పాక్ సరిహద్దులోని మందిరాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఎస్పీ చెప్పటంతో.. ఆ మందిరం బాధ్యుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. కాగా, హతమార్చిన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తించేందుకు భారత్ ఇంటర్‌పోల్ సాయం కోరింది. -
'భారతీయుల ఆగ్రహాన్ని మేమూ పంచుకుంటాం'
బీజింగ్: పఠాన్ కోట్‌పై దాడిని తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఈ దాడి వల్ల భారతీయులకు కలిగిన ఆవేదనను, ఆవేశాన్ని తాము కూడా పంచుకుంటున్నామని చైనా వెల్లడించింది. 'చైనా కూడా ఒక ఉగ్రవాద బాధితురాలే. మేం భారతీయుల బాధను పంచుకుంటున్నాం. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానిని మేం తీవ్రంగా ఖండిస్తాం.. వ్యతిరేకిస్తాం' అని చైనా భారత రాయభారి లీ యూచెంగ్ అన్నారు. దాడి జరిగిన పఠాన్ కోట్ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించిన కొద్ది సేపటితర్వాత చైనా తరుపున ఈ ప్రకటన రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి భారత్ కు అనుకూలంగా ఉన్నట్లు ప్రవర్తించినా.. వెనుకనుంచి అది పాకిస్థాన్‌కే అధిక మద్దతు ఇస్తుందని, పరోక్షంగా భారత్‌ను ఇరుకున పడేసి చర్యలకు సహకరిస్తుందని అపవాదు చైనాపై ఉన్న విషయం తెలిసిందే. -
వారి ధైర్యసాహసాలు గర్వకారణం
-
వారి ధైర్యసాహసాలు గర్వకారణం
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ప్రధాని ♦ ఆపరేషన్‌పై ప్రధానికి వివరించిన భద్రతా బలగాల చీఫ్‌లు ♦ ఉగ్రదాడిని ఎదుర్కొన్న ఆపరేషన్‌పై సంతృప్తి: పీఎంఓ ప్రకటన పఠాన్‌కోట్: ఉగ్రవాదులు దాడికి తెగబడిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సైనికుల ధైర్యసాహసాలు మనకు గర్వకారణమని ప్రశంసించారు. మోదీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ ఉన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులంతా హతమయ్యాక సైతం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ పూర్తయ్యాక కూడా ఎయిర్‌బేస్‌లో కొనసాగించిన కూంబింగ్ ఆపరేషన్లు శుక్రవారం ముగిశాయని, స్థావరం పూర్తిగా సురక్షితంగా ఉందని బలగాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మోదీ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. దాడులు, ఆపరేషన్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఉగ్రవాదులను భద్రతా బలగాలు తొలుత ఎదుర్కొన్న మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ యార్డ్‌ను, చివరి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టటానికి బలగాలు పేల్చివేసిన రెండంతస్తుల భవనాన్ని మోదీ పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతాన్ని గగనతలం నుంచి పరిశీలించారు. వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ అరూప్ రాహా, సైనిక దళాధిపతి దల్బీర్‌సింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నతాధికారులు సంబంధిత వివరాలు తెలియజేశారు. మోదీ పర్యటనలో ‘‘వ్యూహాత్మక ప్రతిస్పందన విషయంలో నిర్ణయం తీసుకోవటం, దానిని అమలు చేయటాన్ని సంతృప్తితో గుర్తించటం జరిగింది. పోరాట క్షేత్రంలో మన పురుష, మహిళా సిబ్బంది ధైర్యసాహసాలను ప్రశంసించటం జరిగింది. వారు మనకు గర్వకారణం’’ అంటూ ప్రధాని కార్యాలయం శనివారం ట్వీట్ల ద్వారా వ్యాఖ్యానించింది. ఫొటోలకు ఫోజుల కోసమే...: కాంగ్రెస్ దాడి జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ప్రధాని ఆ స్థావరాన్ని సందర్శించటం.. దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో మోదీ సర్కారు వైఫల్యాన్ని చూపుతోందని.. ప్రధాని ఆలస్య సందర్శన కేవలం ఫొటో కార్యక్రమం స్థాయికి దిగజారిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘‘జైషే మొహమ్మద్‌పై పాకిస్తాన్ చర్యలు చేపట్టేలా చూడటం, అంతర్గత భద్రత పరిరక్షణ చర్యలపై సంపూర్ణ సమీక్ష, భద్రతా లోపాలకు బాధ్యులను గుర్తించటం.. తక్షణావసరం. ఈ కీలకాంశాలపై చేపట్టిన చర్యల గురించి మోదీ దేశ ప్రజలకు తెలియజేస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని ఏఐసీసీ సమాచార విభాగం చీఫ్ రణ్‌దీప్‌సూర్జేవాలా శనివారం ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాని మోదీ తన విమానాన్ని ఆ దేశానికి మళ్లించారు.. కానీ పఠాన్‌కోట్ వెళ్లటానికి ఎనిమిది రోజుల సమయం తీసుకున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తప్పుపట్టింది. కాగా, అనుమానిత ఉగ్రవాదులు కనిపించారన్న సమాచారాన్ని భద్రతాబలగాలు తేలికగా తీసుకోబోవని.. దానిని చాలా తీవ్రంగా పరిగణించి వేగంగా స్పందిస్తామని బోర్డర్ రేంజ్ డీఐజీ కున్వర్విజయ్ప్రతాప్సింగ్ పేర్కొన్నారు. కాగా, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి వెనుక ఉన్న సూత్రధారులపై పాకిస్తాన్ త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. 15న విదేశాంగ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది: అజీజ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చిత పరిస్థితుల మధ్య.. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఈ నెల 15వ తేదీన సమావేశమై చర్చలు జరపాల్సి ఉందని పాకిస్తాన్ పేర్కొంది. విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధానమంత్రికి సలహాదారైన సర్తాజ్ అజీజ్ శుక్రవారం తమ దేశ పార్లమెంటులో తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శులు జనవరి 15వ తేదీన భేటీ కావాల్సి ఉంది. కొత్తగా అంగీకరించిన సమగ్ర ద్వైపాక్షిక చర్చల కింద వివిధ సమావేశాల షెడ్యూళ్లను ఇరువురు విదేశాంగ కార్యదర్శులూ నిర్ణయిస్తారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో వివిధ అంశాలతో పాటు కశ్మీర్ అంశం కూడా భాగంగా ఉంటుంది’’ అని వివరించారు. ఎలా వచ్చారు? ఎవరు సహకరించారు? దాడి కేసులో ఎన్ఐఏ దృష్టిపెట్టిన కీలకాంశాలివీ... న్యూఢిల్లీ: ఉగ్రదాడికి సంబంధించిన కీలకాంశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది. గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్, ఆయన స్నేహితుడు, వంటమనిషిల కిడ్నాప్‌పై ఒకటి, దానికి ముందు ఒక ట్యాక్సీ డ్రైవర్ హత్యపై ఒకటి, స్థావరంపై దాడిపై ఒకటి.. మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో దృష్టి పెట్టిన కీలకాంశాలివీ... ► ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినప్పటి నుంచీ దాడి చేయటం వరకూ జరిగిన ఘటనల క్రమం, సరిహద్దు నుంచి ఉగ్రవాదులు ప్రయాణించిన మార్గం, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ - కశ్మీర్‌లోని కతువాల మధ్య బమియాల్ సెక్టార్‌లోకి పాక్ నుంచి చొరబాటును నిరోధించటంలో బీఎస్ఎఫ్ లోపాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ► ఉగ్రవాదుల ఆయుధాలు, మందుగుండు.. వారి వ్యూహం.. వారికి స్థానికుల సహకారం. పంజాబ్‌లోకి చొరబడిన తర్వాత సైనిక దుస్తులు, వాకీ-టాకీలు అందించిన స్థానికులను గుర్తించేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. ► ఉగ్రవాదులకు - పాక్‌లోని వారి సూత్రధారులకు మధ్య మొబైల్ ఫోన్ సంభాషణలను ఉగ్రవాదులు చంపేసిన ఇన్నోవా ట్యాక్సీ డ్రైవర్‌కు చెందిన మొబైల్ ఫోన్ నంబరు సహా వారు కాల్ చేసిన నంబర్లపై దర్యాప్తు చేస్తోంది. ► జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థదిగా భావిస్తున్న లేఖ, ఉగ్రవాదులు అపహరించి వదిలివెళ్లిన ఎస్పీ కారులో దొరికిన పఠాన్‌కోట్ మ్యాప్ పైనా దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, వారి స్వర నమూనాల విశ్లేషణపై దృష్టి సారించింది. ► ఉగ్రదాడికి ముందు.. ఎస్పీ, ఆయన స్నేహితుడు, వంటమనిషి చెప్పిన కిడ్నాప్ కథనాలు, ఇచ్చిన స్టేట్మెంట్లను విశ్లేషిస్తోంది. ఎన్ఐఏ బుధవారం ఎస్పీని..కిడ్నాప్ చేసిన ప్రాంతానికి, తర్వాత ఆయనను పడేసిన చోటుకు, ఆయన కారు దొరికిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. 31వ తేదీ కతువాలోని ఆలయానికి వెళ్లామని చెప్తున్న ఎస్పీ ఆలయం నుంచి రాత్రి 9:30 గంటలకు తిరిగి బయల్దేరిన తర్వాత.. అర్థరాత్రి దాటాక ఉగ్రవాదులు కిడ్నాప్ చేసే వరకూ మూడు గంటల పాటు ఏం చేశారనే దానిపైనా ఎన్ఐఏ దృష్టి సారించింది. -
'చర్చలు ఓకేగానీ.. స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వాల్సిందే'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాల విషయంలో ముందుకు వెళ్లొచ్చని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఎన్డీయేకు సందేశాన్నిచ్చినట్లు సమాచారం. అయితే, ఉగ్రవాదం విషయంలో మాత్రం పాకిస్థాన్‌కు గట్టి సందేశాన్ని మాత్రం ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 'పాకిస్థాన్‌తో చర్చలు జరపవచ్చు. కానీ, గట్టి సందేశం మాత్రం ఆ దేశానికి ఇవ్వాలి. పఠాన్ కోట్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈ అంశాన్ని రేపు జరగబోయే ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ప్రధాన అంశంగా పెట్టాలి. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ధృఢమైన నిర్ణయం తీసుకోవాలని ఆ దేశానికి నొక్కి చెప్పాలి' అని ఎన్డీయేకు సూచించినట్లు కీలక వర్గాల సమాచారం. అంతేకాకుండా భారత్ లో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రత్యేక చర్చలు జరిపేందుకు త్వరలోనే ఆరెస్సెస్ ముఖ్యనేతలంతా భేటీ కానున్నట్లు సమాచారం. అంతకు అసలు చర్చలే జరపకూడదని, భారత్ భద్రతే ముఖ్యమని ఆరెస్సెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
'ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు'
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరం పై దాడికి సంబంధించి విచారణ పలు అనుమానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దాడికి కొద్ది గంటలముందు కిడ్నాప్ కు గురైన గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ ఇప్పటికే చెప్పిన కథనంలో పొంతన లేని అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఘటన నేపథ్యంలో చెప్తున్న కొందరు ఇస్తున్న వివరణలు సల్వీందర్ సింగ్ ఏదైనా తప్పు చేశారా అనే అనుమానాలను పెంచుతున్నాయి. తాను పంజ్ పిర్ దర్గాకు తరుచుగా వెళ్లొస్తుంటానని, అలా వెళ్లొస్తున్న క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పగా.. ఆ దర్గాను చూసుకునే సోమ్ అనే వ్యక్తి మాత్రం సల్వీందర్ సింగ్ ను తానెప్పుడు ఆ దర్గా వద్ద చూడలేదని అన్నారు. అయితే, డిసెంబర్ 31, రాత్రి 8.30 గంటలకు సల్వీందర్ తనకు ఫోన్ చేశారని, దర్గాను తెరిచి ఉంచాలని కోరాడని, అయితే అప్పటికే సమయం ముగిసినందున అది సాధ్యం కాదని చెప్పగా, తాను ఒక అధికారిగా చెప్తున్నానని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి దర్గాను తెరిచి ఉంచేలా చేశారని చెప్పాడు. అదే రోజు ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ కూడా రెండు సార్లు దర్గాకు వచ్చాడని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆలయానికి అత్యంత సమీపంలో కొన్ని పాకిస్థాన్ కాలిబూట్ల గుర్తులు ఉన్నాయని, అది సరిహద్దుకు అతి సమీపంలో ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే గుర్తించింది. ఈ అనుమానాలు మరింత బలపడితే ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చాలా లాజిక్స్ కూడా సల్వీందర్ సింగ్ పరోక్షంగా పాక్ ఉగ్రవాదులకు సహకరించారేమోనని అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. -
వారిపై తక్షణమే చర్యలు
పఠాన్‌కోట్ దాడిపై మోదీకి షరీఫ్ హామీ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ లింకు ప్రస్ఫుటమైన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్ మంగళవారం మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి వెనుక గల ఉగ్రవాదులపై తక్షణమే నిర్ణయాత్మక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దాడికి బాధ్యులైన, దాడితో సంబంధమున్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై అత్యవసరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని షరీఫ్‌కు మోదీ బలంగా చెప్పారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదుల నిర్దిష్ట సమాచారాన్ని పాక్‌కు అందించినట్లు పీఎంఓ పేర్కొంది. శ్రీలంక పర్యటనలో ఉన్న షరీఫ్ మంగళవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడి.. పఠాన్‌కోట్ దాడిలో సంభవించిన మరణాలకు విచారం వ్యక్తం చేశారని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి ప్రక్రియను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారంటూ.. ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని, భారత్ అందించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తామని షరీఫ్ హామీ ఇచ్చారని వివరించింది. పరస్పర సహకారంతో ఉగ్రవాదంపై పోరాడాలని ఇరువురు ప్రధానులూ తీర్మానించారని పేర్కొంది. ప్రధానుల సంభాషణ తర్వాత పాక్ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ నసీర్ఖాన్జాన్జు కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదుల కాల్ చేసిన పాక్‌లోని ఫోన్ నంబర్లు, వాటిపై నిఘా సమాచారం వంటి ఆధారాలపై చర్చించారని, సమాచారాన్ని దోవ్ల్ పాక్‌కు అందించారని సమాచారం. దాడిని ఆదివారం ఖండించిన పాక్ సర్కారు సోమవారం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామంది. దర్యాప్తులో పాక్ సాయం కోరతాం.. ఎన్ఐఏ: పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనటంలో సందేహం లేదని ఎన్ఐఏ చీఫ్ శరద్‌కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు పాక్‌లోని తమ సూత్రధారులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ వివరాలు, వాటిపై నిఘా సమాచారం ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాలని చెప్పారు. ఈ దాడి వెనుక కుట్రను ఛేదించటం పెద్ద సవాలంటూ.. కేసు దర్యాప్తులో పాక్ సహాయం కోరతామని తెలిపారు. భద్రతా దళాల ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని, వారి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తామని.. వారు ఫోన్లో మాట్లాడిన పాక్‌లోని వారి సూత్రధారుల స్వరాలను సరిపోల్సి చూసేందుకు వారి స్వర నమూనాలు అందించాలని అడుగుతామని పేర్కొన్నారు. -
'ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో మా వైఫల్యం లేదు'
చంఢీగడ్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో తమ వైఫల్యం లేదని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారని తెలిపారు. తమ అధికారులు అప్రమత్తంగా ఉండి, అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించడం వల్లే దాడి తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. మొదటిసారి తాము ఎన్ఎస్జీని వినియోగించామని డీజీపీ పేర్కొన్నారు. అలాగే ఎయిర్‌బేస్‌లో ఏఐజీ కౌంటర్‌తో పాటు సీసీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాగా చెక్‌పోస్ట్ వద్ద ఓ ప్రయివేట్ కారును ఎలా అనుమతించారని విలేకర్ల ప్రశ్నకు డీజీపీ అరోరా సమాధానమిస్తూ ఆ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించి స్థానికుల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్న దానిపై కూడా ఆయన విచారణ అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. -
'రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం'
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ దాడిలో వీరమరణం పొందిన తమ ఇద్దరు పంజాబ్ సైనికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులతో పోరాడుతూ పంజాబ్ చెందిన హానరీ కెప్టెన్ ఫతే సింగ్, హవల్దార్ కుల్వంత్ సింగ్ నేలకొరిగారు. ఖదియన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ ఆదుకుంటామని హామీయిచ్చారు. అమరవీరుల కుటుంబాలను సంప్రదించి తగిన సాయం అందించాలని ప్రభుత్వ అధికారులను బాదల్ ఆదేశించారు. ఉగ్రవాదుల చొరబాటుకు ఆస్కారం లేకుండా సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న కాల్పులు
-
పటాన్ కోట్ లో 'ఉగ్ర' వేట
-
పటాన్ కోట్ లో 'ఉగ్ర' వేట
ఎయిర్ బేస్‌లో ముష్కరులపై కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్ మరో ఉగ్రవాది హతం.. మొత్తం ఏడుగురు జవాన్ల మృతి పఠాన్‌కోట్ : పంజాబ్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు చేస్తున్న ఆపరేషన్ ఆదివారం రెండోరోజూ కొనసాగింది. ఉగ్రవాదుల బాంబుదాడులు, కాల్పులతోపాటు భద్రతా బలగాల ఎదురుదాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది. శనివారం దాడికి దిగిన ఉగ్రవాదుల్లో నలుగురిని హతమార్చగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ ప్రాంగంణం లోనే ఉన్నట్లు గుర్తించిన బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కాల్పులు మొదలవటంతో అప్రమత్తమైన బలగాలు.. ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. ఈ కేంద్రం వెనకవైపున్న అడవిలో దాక్కుని.. కాల్పులు జరుపుతున్నారు. దీంతో భద్రతా బలగాలకు సాయంగా మరో ఐదు కంపెనీల సైనిక దళాలను రంగంలోకి దించారు. దీనికి తోడు ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు బుల్డోజర్లు, జేసీబీలనూ వినియోగిస్తున్నారు. సైనిక హెలికాప్టర్లు గగనతలం నుంచి ఈ అడవి ప్రాంతంలో గాలిస్తూ.. భద్రతా బలగాలకు సహాయం అందిస్తున్నాయి. ఆదివారం రాత్రికి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు చివరిసారిగా కాల్పులు జరిగాయని, వీలైనంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అమరులైన మరో నలుగురు జవాన్లు శనివారం తెల్లవారుజామున భారత్-పాక్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో దాడి చేయడం తెలిసిందే. గగనతల నిఘా ద్వారా వీరు లోపలకు వస్తుండటాన్ని గుర్తించిన ఎయిర్‌బేస్ రక్షణ సిబ్బంది.. అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో శనివారం ముగ్గురు జవాన్లు చనిపోవడమూ తెలిసిందే. శనివారం గాయపడి చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిలో ముగ్గురు (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్) ఆదివారం మృతిచెందారు. బలగాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది వద్దఉన్న గ్రనేడ్‌ను ఆదివారం ఉదయం నిర్వీర్యం చేస్తుండగా అది పేలటంతో.. ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతిచెందారు. దీంతో ఉగ్ర దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఏడుకు పెరిగింది. రెండు రోజుల్లో గాయపడిన జవాన్ల సంఖ్య 20కి పెరిగింది. ఎంతమంది ఉగ్రవాదులు? ఈ ఆపరేషన్‌లో..శనివారం నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో వారిని వేటాడేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మరొక ఉగ్రవాది హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఐదుగురు ఉగ్రవాదులు హతమైనందున ఆపరేషన్ పూర్తయిందని శనివారం రాత్రి ట్వీట్ చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు. ఐదో ఉగ్రవాది హతమైనట్లు అధికారికంగా వార్తలు కూడా రాలేదు. దీంతో.. దాడికి వచ్చిన ఉగ్రవాదులు ఎంతమంది అనేది నిర్దిష్టంగా తెలియలేదు. అయితే.. ఆదివారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు దిగటం.. రెండు వైపుల నుంచి కాల్పులు రావటంతో ఇంకా ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘ఆపరేషన్ తర్వాతే.. ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారనేది తెలుస్తుంది’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి తెలిపారు. మరింత మంది ఎన్ఎస్జీ కమాం డోలను పఠాన్‌కోట్ పంపిస్తున్నామని.. అప్పటివరకు ఆపరేషన్ పూర్తి కాదని పేర్కొన్నారు. ఒకటో తేదీనే స్థావరంలోకి చొరబాటు? ఉగ్రవాదులు జనవరి 1వ తేదీ మధ్యాహ్నమే ఎయిర్‌బేస్ క్యాంపస్‌లోకి ప్రవేశించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపైన ఎస్పీ మిత్రుడి సెల్‌ఫోన్‌తో పాకిస్తాన్‌లోని భవల్పూర్కు జరిపిన సంభాషణ కూడా ఎయిర్‌బేస్ సెల్‌టవర్ ద్వారానే జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. దీని ఆధారంగానే ఉగ్రదాడి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. జనవరి 1నే వారు ఎయిర్‌బేస్‌లోకి వచ్చినట్లయితే అది తీవ్ర భద్రతా వైఫల్యమే. ఎయిర్‌బేస్ భద్రతా వైఫల్యమే? నిఘా వర్గాలనుంచి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయటంలో ఆలస్యం జరగటం కచ్చితంగా భద్రతా బలగాల నిఘా వైఫల్యమేనని.. రక్షణ రంగ మాజీ నిపుణులు విమర్శించారు. ఇంతకన్నా సమర్థవంతంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ తెలిపారు. ‘సరిహద్దు భద్రతా దళాల కన్నుగప్పి.. ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకుని దేశంలోకి ఎలా వచ్చుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు తమ లక్ష్యానికి చేరుకోవటంలో విఫలమయ్యేలా ఎయిర్ బేస్ భద్రతా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని.. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని.. ఈ కేంద్రం చీఫ్‌గా పనిచేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ పీఎస్ అహ్లువాలియా అన్నారు. గత నెలలో ప్రధాని మోదీ పాక్ పర్యటన తర్వాతే ఇలాంటి ఘటనలు ఎదురవుతాయనే అనుమానం తనకు కలిగిందని.. రిటైర్డ్ మేజర్ జనరల్ గగన్‌దీప్ బక్షి ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. కేసు ఎన్ఐఏ చేతికి.. ఉగ్రదాడి ఘటనపై సోమవారం ఎన్ఐఏ కేసు నమోదు చేయనుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఉగ్రవాదులు ఎలా భారత్‌లోకి వచ్చారు?, ట్యాక్సీ డ్రైవర్‌ను చంపటం, ఎస్పీపై దాడి తదితర ఘటనల తర్వాత ఎయిర్ బేస్‌పై దాడి వంటి అంశాలను ఎన్ఐఏ విచారించనుంది. శనివారం మధ్యాహ్నమే ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎన్ఐఏ బృందం.. ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉంది. ఎయిర్‌బేస్‌లో ఏం జరిగింది? గురుదాస్‌పూర్ గుండా ఉగ్రవాదులు పంజాబ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం అందిందని.. వారి లక్ష్యం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడేనని సమాచారం అందటంతో.. ఎన్ఎస్జీ, ఆర్మీ, పోలీస్, వైమానిక సిబ్బంది అప్రమత్తమయ్యారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లోపలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ దళ సభ్యులు కాల్పులు ప్రారంభించారని.. ఉగ్రవాదులు ప్రతిదాడి చేయటంతో.. ఓ డీఎస్సీ సభ్యుడు మరణించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉగ్రవాదులు డీఎస్సీ క్యాంటీన్ వైపుకు పారిపోగా.. అక్కడున్న వారు అప్రమత్తమై కాల్పులు జరిపారని.. ఇందులో ఓ ఉగ్రవాది చనిపోగా.. మరో డీఎస్సీ సభ్యుడిని మరో ఉగ్రవాది కాల్చి చంపాడని వివరించారు. ఆ తర్వాత శనివారం దినమంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా.. మిగిలిన వారు ఎయిర్‌బేస్ వెనకనున్న అటవీ ప్రాంతం వైపుకు పారిపోయారన్నారు. పెళ్లై 45 రోజులే! పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరుడైన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ కుటుంబానికి హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 45 రోజుల క్రితమే గురుసేవక్కు వివాహమైంది. దీంతో కుటుంబం షాక్‌లో ఉంది. కాగా, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టు ఫతేసింగ్కు కేంద్ర మంత్రి, షూటింగ్ ఒలింపిక్ మెడలిస్టు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులర్పించారు. మోదీ ఉన్నత స్థాయి సమీక్ష... కర్ణాటక పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్, ఇతర అధికారులతో పఠాన్‌కోట్ పరిస్థితిపై సమీక్షించారు. అంతకుముందు.. ప్రధానికి రక్షణమంత్రి పరీకర్ ఆపరేషన్ వివరాలు తెలిపారు. కాగా, పాకిస్తాన్ వ్యూహాలపై మాజీ విదేశాంగ కార్యదర్శులు, పాక్‌లో పనిచేసిన మాజీ రాయబారులతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశమై చర్చించారు. భారత-పాక్ చర్చల ప్రక్రియపై ఈ దాడి చూపగల ప్రభావం గురించి సమీక్షించారు. పంజాబ్‌లో ఆరు నెలల్లో రెండుసార్లు ఉగ్రదాడులు జరగటంతో.. సరిహద్దుల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
పాక్ నెంబర్‌తోనే ట్యాక్సీ బుక్ చేశారు!
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం (ఎయిర్‌బేస్)పై దాడి చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగుచూస్తున్నాయి. తమను పంపిన పాకిస్థాన్ సూత్రధారులతో ఉగ్రవాదులు నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వచ్చారని, అంతేకాకుండా పాక్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి ఉగ్రవాదుల కోసం ఓ ట్యాక్సీ కూడా బుక్ చేశారని తాజాగా తేలింది. భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు మొదట టయోటా ఇన్నోవా కారులో ప్రయాణించారు. ఈ కారు డ్రైవర్‌కు పాక్‌లోని సూత్రధారులు ఫోన్ చేసి వాహనం బుక్ చేసుకున్నారు. అయితే డ్రైవర్‌కు మొదటినుంచి పాక్ స్మగ్లర్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? లేక అది పాక్ మొబైల్ నెంబర్ అని తెలియకపోవడం వల్ల అతను ఉగ్రవాదులను తన వాహనంలో ఎక్కించుకున్నాడా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పఠాన్‌కోట్‌లోని ఓ కీలక ప్రదేశం వరకు తమను తీసుకెళ్లి దింపాలని ఉగ్రవాదులు డ్రైవర్‌ను కోరారు. అయితే మధ్యలోనే ఇన్నోవా వాహనం పాడవ్వడంతో ఉగ్రవాదులు ఎస్పీకి చెందిన మహేంద్ర ఎస్యూవీ వాహనాన్ని హైజాక్ చేశారు. అందులో ఉన్న ఎస్పీని, ఆయన వంటవాణ్ని చితకబాది వదిలేశారు. వారితోపాటు ఉన్న మరో నగల వ్యాపారిని బందీగా పట్టుకొని కొంతదూరం వెళ్లాక అతన్ని గొంతు కోసి వదిలేశారు. ఈ క్రమంలోనే వారి మొబైల్ ఫోన్‌ను దొంగలించిన ఉగ్రవాదులు దానినుంచి మూడుసార్లు పాక్‌లోని తమ సూత్రధారులకు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసిన ఈ నెంబర్ నుంచే అంతకుముందు ఇన్నోవా డ్రైవర్‌కు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఒక ఉగ్రవాది తన కుటుంబానికి ఫోన్ చేసి తాను ఆత్మాహుతి దాడిలో పాల్గొనబోతున్నట్టు చెప్పాడు. ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకొస్తున్న భద్రతా సంస్థలు ఉగ్రవాదుల వెనుక ఉన్న కీలక సూత్రధారులను గురించి కచ్చితమైన ఆధారాలు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'అమ్మా.. నేను సూసైడ్ మిషన్‌లో ఉన్నాను'
చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్ వివరాలు తెలిసి అధికారులు అశ్యర్యపోయారు. అర్థరాత్రి 1:58 గంటలకు వచ్చిన ఈ 70 సెకన్ల కాల్ రికార్డ్ వివరాలను అధికారులు సేకరించారు. అయితే, ఈ వివరాలపై స్పష్టత లేకపోవడంతోనే వైమానిక స్థావరంపై దాడులు జరగకుండా అప్రమత్తం కాలేకపోయినట్లు తెలుస్తోంది. టెర్రరిస్ట్ తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ.. 'నేను సూసైడ్ మిషన్‌లో ఉన్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చిన కాల్స్ వివరాలను డీకోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులు ఫోన్లో పంజాబీ, ముల్తానీ భాషల్లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. 87 సెకన్లపాటు జరిగిన ఓ కాల్ సంభాషణలో.. అంతా కంట్రోల్లో ఉందా అని ఓ వ్యక్తి అడగగా, అవును అని ఫోన్లో అవతలి వ్యక్తి సమాధానమిచ్చినట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్తులు, చాపర్స్, ఇతర విమానాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం చోటుచేసుకున్న ఉగ్రదాడులు, భారత బలగాల ఎదురుకాల్పుల ఫలితంగా ముగ్గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోగా, నలుగురు తీవ్రవాదులు హతమైన విషయం అందరికీ తెలిసిందే.