'నిఖా' అంటే ఏంటో తెలుసా?
'నిఖా' అంటే ఏంటో తెలుసా?
Published Tue, Dec 20 2016 8:43 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
ఉగ్రవాదులు ఒక్కో దానికి ఒక్కో కోడ్ పెట్టుకుంటారు. అసలు భాషలో మాట్లాడుకుంటే మధ్యలో నిఘా వర్గాలు పసిగట్టి తమ కుట్రను భగ్నం చేస్తాయన్న ఉద్దేశంతో.. రహస్యంగా తమకు మాత్రమే అర్థమయ్యేలా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అలాగే.. పఠాన్‌కోట్ ఉగ్రదాడి చేసేటపుడు కూడా వాళ్లు ఒక కోడ్ పెట్టుకున్నారు. ఈ దాడికి వాళ్లు 'నిఖా' అని కోడ్ పెట్టుకున్నారు. ఉగ్రదాడికి వచ్చిన ముష్కరులకు 'బారాతీ' అని కోడ్ పెట్టారు. ఈ విషయం జైషేమహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జిషీట్‌లో వెల్లడైంది. ఈ చార్జిషీటులో పేర్కొన్న వివరాల ప్రకారం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి కుట్ర పన్నింది కేవలం మసూద్ అజహర్ మాత్రమే కాదని, పాకిస్థానీ అధికారుల హస్తం కూడా అందులో ఉందని తెలిసింది. మసూద్ అజహర్ సోదరుడు, జైషేమహ్మద్ ఉప నేత అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాకు చెందిన షహీద్ లతీఫ్, నలుగురు హంతకులకు ప్రధాన హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కషీఫ్ జైన్ల పేర్లు కూడా చార్జిషీట్‌లో ఉన్నాయి.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సహా మొత్తం ఏడుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు, మరో 37 మంది గాయపడ్డారు. దాడికి వచ్చిన నలుగురు దుండగులూ హతమయ్యారు. ఇప్పుడు ఎన్ఐఏ దాఖలుచేసిన చార్జిషీటు సాయంతో.. మసూద్ అజహర్ మీద ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించేలా భారతదేశం మరింత ఒత్తిడి తెచ్చేందుకు వీలు కుదురుతుంది. దీనికి చైనా ఇన్నాళ్లూ అడ్డు చెబుతున్న విషయం తెలిసిందే.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి చేసింది జైషే మహ్మదేనని భారత ప్రభుత్వానికి తెలియాలన్నది ఉగ్రవాదుల ఉద్దేశంలా కనిపించింది. వాళ్ల వద్ద చేత్తో రాసిన నోట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లీషులోను, మరొకటి ఉర్దూలోను ఉన్నాయి. అందులో.. 'జైషే మహ్మద్ జిందాబాద్.. తంఘ్‌దర్ నుంచి సాంబా, కతువా, రాజ్‌బాఘ్, ఢిల్లీ వరకు అఫ్జల్‌గురును ఉరి తీసినందుకు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాం.. అల్లా ఏజీఎస్ 25-12-15'' అని రాసి ఉంది.
Advertisement