దాడి ప్రాంతంలో చైనా వైర్ లెస్ సెట్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడే అవకాశం ఉంది. ఈ దాడికి సంబంధించి అంగుళం కూడా వదిలిపెట్టకుండా శోధిస్తున్న ఎన్ఐఏ అధికారులు ఓ కొత్త ఆధారాన్ని సంపాధించారు. పఠాన్ కోట్ దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ వాహనంలో చైనాకు చెందిన ఓ వైర్ లెస్ సెట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని పరీక్షించేందుకు అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
మరోపక్క, ఈ దాడికి సంబంధించి అనుమానంతో అదుపులోకి తీసుకున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను వరుసగా మూడో రోజు కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఒకే అంశంపై ఎన్ఐఏ అధికారులు మార్చి మార్చి ప్రశ్నిస్తుండగా సల్వీందర్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వివరణల పట్ల సంతృప్తి చెందని అధికారులు మరిన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, ఆ రోజు రెండు సార్లు వేళకాని వేళలో పంజ్ పీర్ దర్గాను సల్వీందర్ సందర్శించారని వివరణ ఇచ్చిన దర్గా సంరక్షకుడు సోమరాజ్ కు కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో సోమరాజ్ కూడా గురువారం ఎన్ఐఏ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.