pathankot airbase
-
'ఉగ్రవాదులు ఎలా వచ్చారో అర్థంకాలేదు'
న్యూఢిల్లీ: గణతంత్ర్యవేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయినప్పటికీ ఆయుధాలు చేతపట్టుకున్న ఉగ్రవాదులు పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డారు. జనవరి 2న చోటుచేసుకున్న నాటి ఘటనతోపాటు దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులపై అధ్యయనం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న రక్షణ కంచె బలంగా లేదు. భద్రతా చర్యలు బలహీనంగా ఉన్నాయి' అని భట్టాచార్య అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా ఉగ్రవాదులు లోపలికి ఎలా వచ్చారో అర్థంకాలేదని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుందన్న కమిటీ.. తీవ్ర చర్యలు చేపడితేతప్ప పరిస్థితిలో మార్పురాబోదని ప్రభుత్వానికి సూచించింది. -
పాకిస్తాన్ వెళ్లనున్న ఎన్ఐఏ బృందం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం త్వరలో పాకిస్తాన్లో పర్యటించనుంది. ఎన్ఐఏ బృందం పాక్ పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్‌కుమార్ శుక్రవారం తెలిపారు. పఠాన్‌కోట్ దర్యాప్తు కోసం ఐదు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన పాక్ బృందం శుక్రవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. కాగా, జేఐటీ దర్యాప్తు సమయంలో పాక్ అధికారులతో ఎన్ఐఏ చర్చలు జరిపింది. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందాన్ని పాకిస్తాన్‌కు పంపాలని భావిస్తున్నట్లు చెప్పగా.. దానికి పాక్ సానుకూలంగా స్పందించినట్టు శరద్‌కుమార్ తెలిపారు. పఠాన్‌కోట్ దాడికి కుట్ర వెనుక జైషే మహమ్మద్ ఉందనేందుకు కీలక ఆధారాలను జేఐటీకి సమర్పించినట్లు పేర్కొన్నారు. -
పఠాన్‌కోట్‌లో పాక్ బృందం
పఠాన్‌కోట్: ఐదుగురు సభ్యుల పాకిస్తాన్ సంయుక్త విచారణ బృందం(జేఐటీ) ఉగ్రదాడి జరిగిన పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను మంగళవారం పరిశీలించింది. ఉదయం ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న బృందాన్ని రోడ్డు మార్గంలో పఠాన్‌కోట్ తీసుకెళ్లారు. ఉగ్రదాడి జరగొచ్చన్న సమాచారంతో ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పోలీసు కమెండోల రక్షణ మధ్య పాక్ బృందం పఠాన్‌కోట్ పర్యటన సాగింది. ప్రత్యేక విమానంలో తీసుకెళ్లాలని నిర్ణయించినా రక్షణ శాఖ అనుమతి నిరాకరణతో రోడ్డు మార్గంలోనే తీసుకెళ్లారు. అప్పర్ దోబా కాల్వ వద్దే కాన్వాయ్ నిలిపివేసి అక్కడి నుంచి మినీ బస్సులో బృందం ఎయిర్‌బేస్‌లోకి వెళ్లింది. ఉగ్రవాదులు దాడిచేసిన ప్రాంతం, భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ సంజీవ్‌సింగ్ నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం చూపించింది. విచారణ బృందానికి కనిపించకుండా ఎయిర్‌బేస్‌లోని చాలా ప్రాంతాన్ని తెరలతో కప్పిఉంచారు. ఎస్పీ సల్వీందర్ సింగ్, అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి కిడ్నాపైన కొలియాన్ గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం సల్వీందర్, వంటమనిషినివదిలిపెట్టినగుల్పుర్ గ్రామంతో పాటు రాజేష్ గాయాలతో కనిపించిన తాజ్పూర్ గ్రామాన్ని కూడా జేఐటీకి చూపించారు. పఠాన్‌కోట్‌లోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భావిస్తున్న ఊంజా నది ప్రాంతాన్ని కూడా పాక్ బృందం పరిశీలించింది. ఈ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు ఎయిర్‌బేస్ ముందు ధర్నా నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పర్యటనను శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తప్పుపడుతూ... ఉగ్రదాడిపై విచారణకు భారత్ బృందాన్ని పాక్‌కు పంపాలన్నారు. -
'మోదీ పాకిస్థాన్ ముందు సాగిలపడ్డారు'
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం రాకను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాక్ విచారణ బృందం తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని ప్లకార్డులు, బ్యానర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు సాగాలపడ్డారు. ఐఎస్ఐ అధికారులను విచారణకు ఆహ్వానించడంద్వారా ఆ దేశానికి పూర్తిగా లొంగిపోయారు'అని కేజ్రీవాల్ అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ(ఐఎస్ఐ) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, పఠాన్ కోట్ ఉగ్రదాడి కూడా ఆ సంస్థ కనుసన్నల్లో జరిగిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాంటి ఐఎస్ఐకి చెందినవారిని విచారణ పేరుతో దేశంలోకి, అది కూడా కీలకమైన ఎయిర్ బేస్ లోకి అనుమతించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివారం పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి పాకిస్థాన్ హై కమిషన్, ఎన్ఐఏ అధికారులు స్వాగతం పలికారు. పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో హాజరైన ఐదుగురు సభ్యుల బృందంలో లాహోర్‌లోని ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహ్మద్ హర్షద్ అజీమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మిర్జా, గుజరాన్‌వాలా సీటీడీ దర్యాప్తు అధికారి షాహీద్ తన్వీర్ ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్న అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు కొందరు ఫ్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన నిర్వహించారు. దీంతో సభ కొద్దిసేపు నిలిచిపోయింది. పాక్ బృందం సోమవారం ఉదయం ఎన్ఐఏ కేంద్రకార్యాలయాన్ని సందర్శించింది. మంగళవారం నాడు పఠాన్‌కోట్‌లో పర్యటించనున్నది. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్‌లో దర్యాప్తు జరుపడం ఇదే తొలిసారి. పాక్ కేంద్రంగా పనిచేసే జైష్‌ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ జనవరి రెండున గుజరాత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలుకోల్పాయారు. కౌంటర్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. -
పఠాన్‌కోట్ ఘటనపై విచారణకు పాక్ జేఐటీ
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాది దాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని (జేఐటీ)ని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం వచ్చే నెలలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనుంది. ఈ దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారం తర్వాత పాక్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పాక్ బృందం భారత ప్రభుత్వ అనుమతి తీసుకుని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సాక్ష్యాలను సేకరించి సొంతంగా దర్యాప్తు చేయనుంది. విచారణ బృందంలో పంజాబ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) ఎడిషనల్ ఐజీ మహ్మద్ తాహీర్ రాయ్‌ను కన్వీనర్‌గా నియమించింది. లాహోర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఇంటెలిజన్స్ బ్యూరో మహ్మద్ అజిమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్(ఐఎస్ఐ) లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజన్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మీర్జా, గుజ్జరన్వాలా సీటీడీ ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ షాహిద్ తన్వీర్ సభ్యులుగా ఉంటారు. ఈ ఘటనపై భారత్ ఇచ్చిన ఆధారాల మేరకు ప్రాథమిక దర్యాప్తు చేయడానికి ఇంతకుముందు ఆరుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం(సిట్)ను పాక్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ నుంచి జేఐటీకి బదిలీ చేస్తున్నటు పాకిస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగం నుంచే భారత్‌కు వచ్చినట్లు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందచేశారు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరి18న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాక్.. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరును నమోదు చేయలేదు. -
పఠాన్ కోట్ దాడి దర్యాప్తుకు పాక్‌లో బ్రేక్
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తును ఇక ముందుకు తీసుకెళ్లలేమని పాకిస్థాన్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆధారాలను తమకు అందించాల్సిందిగా భారత్‌ను కోరినట్లు సమాచారం. కీలక వర్గాల సమాచారం మేరకు పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన ఐదు ఫోన్ నెంబర్లను భారత్ పాకిస్థాన్ దర్యాప్తు అధికారులకు అందించింది. అయితే వీటిని పరిశీలించిన వారు వాటి ద్వారా ఎలాంటి సమాచారం రాబట్టలేమని చెప్పినట్లు అక్కడి పత్రిక డాన్ తెలిపింది. 'దర్యాప్తు బృందం భారత అధికారులు ఇచ్చిన ఐదు నెంబర్లను పరిశీలించింది. కానీ, ఈ నెంబర్ల ఆధారంగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఎందుకంటే అవి ఫేక్ ఐడెంటిటీ ఉన్న ఫోన్ నెంబర్లు. వాటిద్వారా దర్యాప్తు ముందుకు వెళ్లదు. అందుకే ఆ బృందానికి మరిన్ని ఆధారాలు కావాలి. అందుకే ఈ మేరకు వాటిని త్వరగా తమకు పంపించాలని భారత్‌కు అధికారులు లేఖ రాశారు' అని డాన్ తెలిపింది. -
దాడి ప్రాంతంలో చైనా వైర్ లెస్ సెట్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడే అవకాశం ఉంది. ఈ దాడికి సంబంధించి అంగుళం కూడా వదిలిపెట్టకుండా శోధిస్తున్న ఎన్ఐఏ అధికారులు ఓ కొత్త ఆధారాన్ని సంపాధించారు. పఠాన్ కోట్ దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ వాహనంలో చైనాకు చెందిన ఓ వైర్ లెస్ సెట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని పరీక్షించేందుకు అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. మరోపక్క, ఈ దాడికి సంబంధించి అనుమానంతో అదుపులోకి తీసుకున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను వరుసగా మూడో రోజు కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఒకే అంశంపై ఎన్ఐఏ అధికారులు మార్చి మార్చి ప్రశ్నిస్తుండగా సల్వీందర్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వివరణల పట్ల సంతృప్తి చెందని అధికారులు మరిన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, ఆ రోజు రెండు సార్లు వేళకాని వేళలో పంజ్ పీర్ దర్గాను సల్వీందర్ సందర్శించారని వివరణ ఇచ్చిన దర్గా సంరక్షకుడు సోమరాజ్ కు కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో సోమరాజ్ కూడా గురువారం ఎన్ఐఏ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. -
రూ. 50 ఇస్తే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి!
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి ఘటనలో భద్రతపరమైన లోపాలున్నట్టు విచారణలో వెల్లడైంది. ఎయిర్‌బేస్ వద్ద తగినంత భద్రత లేదని, 50 రూపాయలు తీసుకుని స్థానికులను అక్రమంగా ఎయిర్‌బేస్‌లోకి అనుమతించేవారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఎయిర్‌బేస్ లోపల ఉగ్రవాదులు దాడి చేయడానికి స్థానికంగా సాయం అందిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించి ఉగ్రవాదులకు సాయపడిన వారిని గుర్తించే దిశగా విచారణ చేస్తున్నారు. ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఏడుగురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేస్తోంది. అనుమానాస్పదంగా వ్యవహరించిన గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను రెండో రోజు మంగళవారం కూడా ఎన్ఐఏ విచారించింది. ఆయన సమాధానాల పట్ల ఎన్ఐఏ సంతృప్తి చెందలేదు. మరోసారి ఆయన్ను ప్రశ్నించనున్నారు. అలాగే లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశముంది. -
ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్‌ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్‌కోట్‌లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్‌టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్‌ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు. -
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
-
ఆపరేషన్ ముగిసినట్లేనా?
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ మొత్తం ముగిసినట్లేనా? ఇక అక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరని కచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్లేనా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుకోవాలి. రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్, ఆర్మీ చీఫ్‌తో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా మంగళవారం పఠాన్‌కోట్ వెళ్తున్నారు. ఇంత ఉన్నతస్థాయి బృందం అక్కడకు వెళ్తోందంటే.. ఆ ప్రాంతం మొత్తం క్లీన్‌గా ఉన్నట్లేనని సైనిక వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో మందుపాతరల లాంటివి ఏమైనా పెట్టారా అనే విషయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ మొత్తం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో.. ఈ మొత్తం ప్రాంతాన్ని గాలించడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. భద్రతా లోపాలు ఉన్నాయి.. కాగా, భద్రాతపరమైన లోపాల వల్లే ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్రం అంతర్గత సమావేశాల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. నిఘా హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని, అలాగే అపహరణకు గురైన ఎస్పీ చెప్పిన విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఉగ్రవాదులు అక్కడివరకు రాగలిగారని అంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంగళవారం ఉదయం మరోసారి హోంశాఖ ఉన్నతాధికారులతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. -
ఆపరేషన్ ముగిసినట్లేనా?
-
ఉగ్రదాడి వెనుక కుట్రకోణం!
-
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడి చేసిన ఉగ్రవాదులను ఆ దాడికి ముందే చూసిన ఏకైక వ్యక్తి.. గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్. ముందురోజే ఉగ్రవాదులు ఆయనమీద దాడిచేసి, ఆయన కారు లాక్కుని అందులోనే పఠాన్‌కోట్ వరకు వెళ్లారు. తొలుత ఎవరో దోపిడీ దొంగల పని అనుకున్నా.. తర్వాత మాత్రం వాళ్లే ఉగ్రవాదులని తెలిసింది. ఎస్పీ సల్వీందర్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుండి తమ కారుకు అడ్డంగా కొందరు రావడంతో కారు ఆపామని, నలుగురైదుగురు వ్యక్తులు తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వెనక్కి జరగమని గట్టిగా చెప్పారన్నారు. వాళ్లు మిలటరీ జాకెట్లు వేసుకుని ఉన్నా.. టెర్రరిస్టులేనని అర్థం అయ్యిందన్నారు. ఉర్దూలో మాట్లాడుతూ తమను బాగా వెనకసీటు వద్దకు పంపేసి.. తమ ముఖాలను కూడా కిందకు వంచేశారన్నారు. పైకి చూసినా, ఏమైనా మాట్లాడినా కాల్చిపారేస్తామని బెదిరించినట్లు తెలిపారు. వాళ్ల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నాయని, జీపీఎస్ పరికరాలు కూడా ఉండటంతో పఠాన్‌కోట్ దారి తనను అడగలేదని తెలిపారు. వాళ్లు ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల్లో మాట్లాడారని, తన మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారని అన్నారు. తన కళ్లకు గంతలు కట్టేశారని, దాంతో తర్వాత వాళ్లు ఏ ఫోన్లో మాట్లాడారో, ఏం జరిగిందో చూడలేకపోయానని అన్నారు. వాళ్లు తమ కమాండర్‌తో మాట్లాడినట్లు అర్థమైందని, సలాం, ఆలేకుం సలాం అన్నారని సల్వీందర్ చెప్పారు. అయితే.. వాళ్లకు తాను జిల్లా ఎస్పీనని తెలియదని కూడా ఆయన తెలిపారు. -
ఉగ్రదాడి వెనుక కుట్రకోణం!
ఉగ్రవాదులు భారత సైనిక దుస్తుల్లో అసలు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపల మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవాళ్లు ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా? సరిగ్గా ఇవే అనుమానాలు సామాన్య ప్రజల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వరకు అందరికీ వచ్చాయి. దాంతో దాడి వెనుక కుట్రకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ మూడు కేసులు నమోదు చేసింది. జనవరి ఒకటోతేదీన దాడి ప్రారంభం దగ్గర నుంచి అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ తెలిపారు. ఐజీ ర్యాంకులో ఉన్న ఓ అధికారి నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం ఇప్పటికే పఠాన్‌కోట్ చేరుకుంది. ఆరుగురు ఉగ్రవాదుల ఫొటోలు, పేర్లు ఈ బృందం వద్ద ఉన్నాయని, వాళ్ల హ్యాండ్లర్లను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని శరద్ కుమార్ చెప్పారు. మూడు కేసుల్లో తొలుత ఎస్పీ సల్వీందర్ సింగ్‌పై దాడి అంశాన్ని పరిశీలిస్తారు. రెండో కేసులో టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ హత్యను దర్యాప్తు చేస్తారు. ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి కేసు. -
ముష్కరులు హతం
పఠాన్‌కోట్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత ♦ ఆరుకు పెరిగిన ఉగ్రవాదుల సంఖ్య.. ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ♦ వైమానిక స్థావరంలో అణువణువూ కూంబింగ్ చేస్తాం: భద్రతా బలగాలు ♦ వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ జరగలేదని వెల్లడి ♦ పఠాన్‌కోట్‌పై దాడి మాదే: పాక్‌లోని యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ ప్రకటన ♦ అది పాక్ ముష్కరుల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడన్న రక్షణ నిపుణులు ♦ ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడులపై చర్చ పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల దాడితో మొదలైన సైనిక చర్య వరుసగా మూడో రోజు సోమవారమూ కొనసాగింది. ఎయిర్‌బేస్‌లో వైమానికదళ సిబ్బంది నివసించే రెండంతస్తుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని ఏరివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, వైమానిక దళం, సైనిక విభాగాలకు చెందిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్ల వంటి భారీ ఆయుధ సంపత్తితో ఆపరేషన్‌ను తీవ్రం చేశాయి. ఆదివారం రాత్రి కూడా హెలికాప్టర్లతో గాలింపు, పహారా కొనసాగించిన భద్రతా దళాలు.. సోమవారం ప్రధాన యుద్ధ శక్తులన్నిటినీ ఈ ఆపరేషన్ కోసం మోహరించాయి. పంజాబ్ పోలీసులు, నిఘా సంస్థలు కూడా కూడా సహకారమందించాయి. పొద్దున్నుంచీ సాయంత్రం దాక వరుస విరామాలతో పలుమార్లు కాల్పులు, పేలుళ్లు వినిపించాయి. ఉగ్రవాదులు దాక్కున్న భవనం భారీ పేలుడుతో దద్దరిల్లింది. రాత్రయ్యాక.. భవనంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులూ హతమైనట్లు భధ్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి. అయితే.. ఈ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యపైనా, అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య పైనా తొలి రోజు శనివారం నుంచీ భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. స్థావరంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అన్న సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ.. మొత్తం ఆరుగురని ఆదివారం నాడు ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు పేర్కొన్నారు. శనివారం నాడే నలుగురు ఉగ్రవాదులు హతమవగా.. సోమవారం రాత్రికి మరో ఇద్దరిని హతమార్చటంతో ఉగ్రవాదులను మొత్తంగా నిర్మూలించినట్లు పరిగణిస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆపరేషన్‌లో పాల్గొంటున్న అధికారులు కానీ.. ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులెవరూ ప్రాణాలతో లేరని, ఆపరేషన్ముగిసిందని ప్రకటించటానికి సిద్ధంగా లేరు. భద్రమని తేల్చే వరకూ ఆపరేషన్... ‘‘కూంబింగ్, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థావరంలోని సిబ్బంది అందరినీ, ఆస్తులన్నిటినీ, నిర్మాణాలన్నిటినీ ప్రత్యక్షంగా క్షుణ్నంగా తనిఖీ పూర్తిచేసి ఎయిర్‌బేస్ భద్రంగా ఉందని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుంది’’ అని ఎన్ఎస్జీ ఐజీ మేజర్ జనరల్ దుషాంత్సింగ్ సోమవారం సాయంత్రం పఠాన్‌కోట్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన అంతకుముందు కూడా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ కమొడోర్ జె.ఎస్.దామూన్, బ్రిగేడియర్ అనుపీందర్సింగ్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌బేస్‌లోని వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ వాటిల్లలేదని చెప్పారు. ‘‘వైమానిక దళ స్థావరం చాలా విశాలమైన ప్రదేశం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఐఏఎఫ్ సిబ్బంది కుటుంబాలు, పాఠశాలలు కూడా ఇందులో ఉన్నాయి.. ఇదొక మినీ నగరం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవటానికి ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో పూర్తిగా సిద్ధమై వచ్చారు’’ అని ఐఏఎఫ్ అధికారి వివరించారు. ఈ ఉగ్రవాదులు సుశిక్షితులు.. భారీ ఆయుధాలు... పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు సుశిక్షితులని.. వైమానిక స్థావరంలో ఉన్న మిగ్ 21 ఫైటర్ విమానాలు, ఎంఐ 25 యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేసే లక్ష్యంతో బలమైన ఆయుధ సంపత్తితో వచ్చారని.. అందుకే వారిని ఏరివేసే ఆపరేషన్ సుదీర్ఘంగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2008లో ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకన్నా కూడా ఈ ఉగ్రవాదులు మరింత సుశిక్షితులని చెప్పాయి. ఉగ్రవాదులు ఏకే47 రైఫిళ్లు, అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు (యూబీజీఎల్), 52 ఎంఎం మోర్టార్లు, జీపీఎస్ వ్యవస్థలు వెంట తెచ్చుకుని దాడికి దిగారని తెలిపాయి. అలాగే.. మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్‌లు ఇచ్చిన కచ్చితమైన సూచనలు కూడా ఆపరేషన్ మూడు రోజుల పాటు కొనసాగటానికి కారణమని వివరించాయి. ‘ఉగ్ర’ వేటపై ప్రధాని సమీక్ష...: పఠాన్‌కోట్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్రవాదుల దాడులు, వారిని నిలువరించేందుకు భద్రతా బలగాల ఆపరేషన్లపై ప్రధాని మోదీ సోమవారం జాతీయ భద్రతా మండలి భేటీ నిర్వహించి చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్గోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌లతో పాటు.. భద్రతపై కేబినెట్ కమిటీ సభ్యులైన రక్షణమంత్రి మనోహర్‌పారికర్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు చోట్ల కొనసాగుతున్న ఆపరేషన్ల గురించి ఉన్నతాధికారులు మోదీకి వివరించారు. దాడి చేసింది మా వాళ్లే: యూజేసీ శ్రీనగర్: ‘పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది మా నేషనల్ హైవే స్క్వాడ్’ అని యూజేసీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ సయ్యద్ సదాకత్ హుస్సేన్ అనే వ్యక్తి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మీడియాకు ఈ-మెయిల్ పంపించారు. అయితే.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్య వివరాలేవీ చెప్పలేదు. అయితే.. యూజీసీ పేరుతో వచ్చిన ఈ-మెయిల్ విశ్వసనీయతపై భారత భద్రతా నిపుణులు సందేహం వ్యక్తంచేశారు. ఈ దాడి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పనేనని బలంగా భావిస్తున్నారు. ఉగ్రదాడి పాక్ నుంచి జరుగుతోందన్న అంశం నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలో భాగంగా యూజేసీ పేరును తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చిన వారు కాదని.. కశ్మీర్‌కు చెందిన వారని చూపించే ప్రయత్నంలో భాగమని భావిస్తున్నారు. స్మగ్లర్ల అండతో చొరబాటు! పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు.. డ్రగ్స్ స్మగ్లర్ల సాయంతో భారత్‌లో ప్రవేశించి ఉండొచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు వాడిన ఆయుధాలను వారు భారత్‌లోకి చొరబడకముందే పాక్ నుంచి దేశంలోకి తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు. నకిలీ భారత కరెన్సీ, మాదకద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసే వ్యవస్థీకృత ముఠాలు.. సరిహద్దుకు ఇరువైపులా ఉగ్రవాదులకు సాయపడి ఉండొచ్చని చెప్తున్నారు. ఆయుధాలను కూడా చాలా ముందుగానే డ్రగ్స్ స్మగ్లర్ల ద్వారా భారత్‌లోకి తరలించి.. ఒకచోట దాచివుంచితే ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చివాటిని తీసుకుని దాడికి దిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాల్లో కొందరు భద్రతా సిబ్బంది పాత్రను కొట్టేయలేమని..నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మూడో రోజైన సోమవారం హతమార్చాయి. దీంతో మొత్తం హతులైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే.. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. స్థావరాన్ని పూర్తిగా జల్లెడ పడుతూ ఎన్ఎస్జీ, సైన్యం, వైమానిక దళ బృందాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టంచేశాయి. పఠాన్‌కోట్‌లో దాడి చేసింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ అనే పలు కశ్మీరీ ఉగ్రవాద సంస్థల కూటమి సోమవారం ప్రకటించింది. ఒకవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులతో భారత బలగాలు పోరాడుతుండగానే ఆదివారం రాత్రి అఫ్గానిస్తాన్‌లోని మజారే షరీఫ్‌లో భారత దౌత్యకార్యాలయంపైనా ఉగ్రవాదులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులను కార్యాలయం వెలుపలే నిలువరించిన భద్రతా బలగాలు.. ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని ఒక భవనంలో దాక్కుని కాల్పులు జరుపుతుండటంతో వారిపై అఫ్గాన్ భద్రతా బలగాలు, కమాండోలు సైనిక చర్య చేపడుతున్నాయి. భారత దౌత్య కార్యాలయంలో సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారు. ఇటు పఠాన్‌కోట్.. అటు మజారే షరీఫ్‌లో భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. భారత్ - పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం తొలుత ఉన్నత స్థాయి సమావేశం, ఆ తర్వాత జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించి పఠాన్‌కోట్, మజారే షరీఫ్ దాడులు, సైనిక చర్యలు, ఇతర పరిణామాలపై చర్చించారు. -
సిబ్బంది క్వార్టర్స్‌లో నక్కిన ఉగ్రవాదులు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో సిబ్బంది క్వార్టర్స్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. ఎన్ఎస్జీకి చెందిన మేజర్ జనరల్ దుష్యంత్ సింగ్, మరో ఇద్దరు అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఇప్పటికి నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని, వాళ్లు భారీ ఆయుధ సంపత్తితో వచ్చారని చెప్పారు. ఇది చాలా పెద్ద ఎయిర్ బేస్ అని, దాదాపు ఓ నగరం అంత వైశాల్యం ఉంటుందని వివరించారు. ఇందులో వ్యూహాత్మక ఆయుధాలతో పాటు సిబ్బంది నివాసాలు, స్కూళ్లు కూడా ఉన్నాయని.. ఇక్కడి ఆస్తులకు గానీ, ఆయుధాలకు గానీ ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ చాలా మంచి సినర్జీతో సాగుతోందని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్జీ, పంజాబ్ పోలీస్ కలిసి చేస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే గానీ వివరాలు ఏవీ చెప్పలేమని అన్నారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జనవరి 1 నుంచి తాము అప్రమత్తంగా ఉన్నామని, నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆర్మీ కూడా 8 దళాలను మోహరించిందని అన్నారు. గరుడ్ దళంతో తొలుత ఉగ్రవాదులు తలపడ్డారని, తర్వాత ఆర్మీ, గరుడ్, ఎన్ఎస్జీల సంయుక్త దాడుల వల్ల వాళ్లు కొంత ఏరియాకే పరిమితం అయ్యారని అన్నారు. ఆదివారం రాత్రి కూడా శానిటైజేషన్ జరిగిందని, అయితే ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నివాసం ఉండే రెండు అంతస్థుల భవనంలో దాక్కుని ఉగ్రవాదులు అక్కడి నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. వాళ్లను అక్కడికే పరిమితం చేసి, క్వార్టర్లలో ఉండే సిబ్బంది కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు కమాండ్ ఆస్పత్రిలోను, పఠాన్ కోట్లోను మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయాలనే కుట్రతో ఉగ్రవాదులు వచ్చారని, అయితే ఇప్పుడు మాత్రం ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయని తాను హామీ ఇవ్వగలనని అన్నారు. -
ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
పఠాన్‌కోట్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, భద్రతాదళానికి చెందిన మరో జవాను వీరమరణం పొందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం తెల్లవారుజామున దాడిచేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక గరుడ్ కమాండో, మరొక జవాను ఉన్నట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా ఉద్రిక్తతను రాజేసిన ఈ ఘటనలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఉగ్రవాదుల దాడిపై హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈదాడిని మన జాతీయ భద్రతా దళాలు, జవాన్లు, పంజాబ్ పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టాయని వెల్లడించారు. పాకిస్తాన్ మన పొరుగు దేశం.. భారతదేశం శాంతిని కోరుకుంటోందన్నారు. కానీ తమ దేశంపై జరిగే దాడులను ఉపేక్షించమని, ధీటుగా సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. గతరాత్రి పఠాన్ కోట్ - పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశామని భద్రతా అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్, పాక్ మధ్య ఈ కాల్స్ జరిగినట్టు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాగా ఇరుదేశాల మధ్య శాంతిసాధనకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు. -
ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోల మోహరింపు
భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్ ఎయిర్‌బేస్ మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఈ బలగాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలను అక్కడ మోహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లను కూడా ఇప్పటికే హతమార్చారా.. లేదా అన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 8 గంటల తర్వాత పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడం లేదని ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలో ఉన్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులను పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని డొమెస్టిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశామని, దాంతో టెక్నికల్ ఏరియా మొత్తం సురక్షితంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం పరిస్థితిని అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఉగ్రదాడి: ఎయిర్‌బేస్ సిబ్బందిలో ఒకరి మృతి
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సిబ్బందిలో ఒకరు మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. తొలుత శుక్రవారం నాడు ఒక ఎస్పీపై దాడిచేసి ఆయన వాహనాన్ని లాక్కున్న ఉగ్రవాదులు.. ఆ వాహనంలోనే ఎయిర్‌బేస్ సమీపంలోకి చేరుకున్నారు. ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఎయిర్‌బేస్‌లోని మిగ్ 29, హెలికాప్టర్లపై దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించినా, కేవలం ఎయిర్‌బేస్‌లోని సివిల్ ప్రాంతానికి మాత్రమే వారిని భద్రతా దళాలు పరిమితం చేయగలిగాయి. ఫైటర్ జెట్లకు గానీ, చాపర్లకు గానీ ఎలాంటి నష్టం లేదని ఆర్మీ ప్రకటించింది. ఇప్పటికే అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ దళాలు మోహరించాయి. ఉగ్రవాదులు భారత సైనిక యూనిఫాంలో వచ్చినా, వారిని వెంటనే పసిగట్టి ఎన్ఎస్జీ జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో వాళ్లలో ఇద్దరు హతమయ్యారు. -
ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే!
పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీని ఉగ్రవాదులు శుక్రవారం నాడు తీవ్రంగా కొట్టి.. ఆయన వాహనాన్ని లాక్కున్నారు. ఆ వాహనం ఎయిర్‌బేస్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో వదిలేసి ఉంది. అందులోనే ఉగ్రవాదులు వచ్చి ఉంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. తొలుత ఎవరైనా దోపిడీ దొంగలు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుకున్నారు. దొంగలు పంజాబ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారిని దోచుకున్నారనే మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఆ ఘటనను ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఎస్పీపై దాడి చేసింది ఉగ్రవాదులేనన్న విషయం స్పష్టమైంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని బహావల్పూర్ నుంచి వచ్చినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి పాక్ ఉగ్రవాద మూకలు ఇంకా భారతదేశాన్ని తమ టార్గెట్ చేయడం మానలేదని అర్థమవుతోంది. పఠాన్‌కోట్ ప్రాంతం కూడా పాక్ సరిహద్దుకు దగ్గరగానే ఉండటంతో, భారత ఆర్మీ యూనిఫాం ధరించి ఏకే 47లతో వచ్చారు. గతంలో కూడా నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి పంజాబ్‌లోకి వచ్చి, పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా ఇద్దరు అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాళ్లు పఠాన్‌కోట్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది.