'మోదీ పాకిస్థాన్ ముందు సాగిలపడ్డారు'
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం రాకను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాక్ విచారణ బృందం తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని ప్లకార్డులు, బ్యానర్లతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించింది. తమ పార్టీ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
'ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు సాగాలపడ్డారు. ఐఎస్ఐ అధికారులను విచారణకు ఆహ్వానించడంద్వారా ఆ దేశానికి పూర్తిగా లొంగిపోయారు'అని కేజ్రీవాల్ అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ(ఐఎస్ఐ) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, పఠాన్ కోట్ ఉగ్రదాడి కూడా ఆ సంస్థ కనుసన్నల్లో జరిగిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాంటి ఐఎస్ఐకి చెందినవారిని విచారణ పేరుతో దేశంలోకి, అది కూడా కీలకమైన ఎయిర్ బేస్ లోకి అనుమతించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఆదివారం పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి పాకిస్థాన్ హై కమిషన్, ఎన్‌ఐఏ అధికారులు స్వాగతం పలికారు. పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో హాజరైన ఐదుగురు సభ్యుల బృందంలో లాహోర్‌లోని ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహ్మద్ హర్షద్ అజీమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) అధికారి లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మిర్జా, గుజరాన్‌వాలా సీటీడీ దర్యాప్తు అధికారి షాహీద్ తన్వీర్ ఉన్నారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్న అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు కొందరు ఫ్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన నిర్వహించారు. దీంతో సభ కొద్దిసేపు నిలిచిపోయింది. పాక్ బృందం సోమవారం ఉదయం ఎన్‌ఐఏ కేంద్రకార్యాలయాన్ని సందర్శించింది. మంగళవారం నాడు పఠాన్‌కోట్‌లో పర్యటించనున్నది. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్‌లో దర్యాప్తు జరుపడం ఇదే తొలిసారి. పాక్ కేంద్రంగా పనిచేసే జైష్‌ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ జనవరి రెండున గుజరాత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలుకోల్పాయారు. కౌంటర్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.