పఠాన్‌కోట్‌లో పాక్ బృందం
పఠాన్‌కోట్: ఐదుగురు సభ్యుల పాకిస్తాన్ సంయుక్త విచారణ బృందం(జేఐటీ) ఉగ్రదాడి జరిగిన పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను మంగళవారం పరిశీలించింది. ఉదయం ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న బృందాన్ని రోడ్డు మార్గంలో పఠాన్‌కోట్ తీసుకెళ్లారు. ఉగ్రదాడి జరగొచ్చన్న సమాచారంతో ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పోలీసు కమెండోల రక్షణ మధ్య పాక్ బృందం పఠాన్‌కోట్ పర్యటన సాగింది. ప్రత్యేక విమానంలో తీసుకెళ్లాలని నిర్ణయించినా రక్షణ శాఖ అనుమతి నిరాకరణతో రోడ్డు మార్గంలోనే తీసుకెళ్లారు.
అప్పర్ దోబా కాల్వ వద్దే కాన్వాయ్ నిలిపివేసి అక్కడి నుంచి మినీ బస్సులో బృందం ఎయిర్‌బేస్‌లోకి వెళ్లింది. ఉగ్రవాదులు దాడిచేసిన ప్రాంతం, భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ సంజీవ్‌సింగ్ నేతృత్వంలోని ఎన్‌ఐఏ బృందం చూపించింది. విచారణ బృందానికి కనిపించకుండా ఎయిర్‌బేస్‌లోని చాలా ప్రాంతాన్ని తెరలతో కప్పిఉంచారు. ఎస్పీ సల్వీందర్ సింగ్, అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంటమనిషి కిడ్నాపైన కొలియాన్ గ్రామానికి తీసుకెళ్లారు.
అనంతరం సల్వీందర్, వంటమనిషినివదిలిపెట్టినగుల్పుర్ గ్రామంతో పాటు రాజేష్ గాయాలతో కనిపించిన తాజ్‌పూర్ గ్రామాన్ని కూడా జేఐటీకి చూపించారు. పఠాన్‌కోట్‌లోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భావిస్తున్న ఊంజా నది ప్రాంతాన్ని కూడా పాక్ బృందం పరిశీలించింది. ఈ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు ఎయిర్‌బేస్ ముందు ధర్నా నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పర్యటనను శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తప్పుపడుతూ... ఉగ్రదాడిపై విచారణకు భారత్ బృందాన్ని పాక్‌కు పంపాలన్నారు.