ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్‌ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్‌కోట్‌లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్‌టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు.
తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్‌ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు.