salwinder singh
-
'పఠాన్‌కోట్' ఎస్పీ మరో కీచకపర్వం
చండీగఢ్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి కేసులో ముష్కరులకు సహకరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్ ఎస్పీ సల్వీదర్సింగ్పై తాజాగా మరో లైంగిక వేధింపుల కేసు నమోదయింది. గతంలోనూ పలువురు మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఈసారి ఏకంగా ఓ రేప్ కేసు నిందితుడి భార్యను లొంగదీసుకోవాలని ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహింస్తున్న సల్వీందర్పై ఈ మేరకు బుధవారం కేసు కూడా నమోదయింది. దీంతో తన ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎస్పీని ఐజీ (ప్రొవిజన్) ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారమే సల్వీందర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. (సల్వీందర్ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు) పదేపదే మా ఇంటికి వచ్చి.. రేప్ కేసులో నిందితుడు, ప్రస్తుత కేసులో బాధితుడు అయిన వ్యక్తి ఇలా చెప్పుకొచ్చాడు.. 'నన్ను కేసు నుంచి తప్పించాలంటే రూ 50 వేలు లంచం ఇవ్వాలని సల్వీందర్ డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా పదేపదే మా ఇంటికి వచ్చి, నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఒకానొక దశలో ఆమెను చెరపట్టేప్రయత్నం చేశాడు. ఎలాగోలా డబ్బులు సర్దినప్పటికీ ఆయన వేధిపులు ఆగలేదు. ఇక భరించలేని స్థితిలో అతని(ఎస్పీ సల్వీందర్)పై పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ కు ఫిర్యాదుచేశాం. దీంతో ఎస్పీపై దైర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ రెండు ఎంక్వైరీల్లోనూ సల్వీందర్ కు క్లీన్ చిట్ లభించింది. మాపై వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి' అని బాధితుడు పేర్కొన్నాడు. 'పఠాన్‌కోట్' అనంతరం.. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి అనంతరం ఎస్సీ సల్వీందర్ కు సంబంధించిన అనేక చీకటి కోణాలు వెలుగులోకి రావడంతో బాధితుడు మరోసారి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సారి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడంతో ఎస్పీ కీచకపర్వం నిజమేనని తేలింది. నిందితుడి భార్యతో మాట్లాడిన ఆడియో టేపులు, తదితర ఆధారాలను బట్టి బుధవారం ఎస్పీ సల్వీందర్ పై లైంగిక వేధింపుల కేసు(ఐపీసీ సెక్షన్ 376సి) నమోదయింది. అంతేకాదు, సదరు ఫిర్యాదుదాడిపై నమోదయిన రేప్ కేసు కూడా అక్రమమేనని తాజా దర్యాప్తులో తేలింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తనపై తప్పుడు కేసు పెట్టడమేకాకుండా భార్యను వేధింపులకు గురిచేసిన ఎస్పీని కఠినంగా శిక్షించాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ('ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు') -
రెండోరోజు విచారణకు హాజరైన సల్వీందర్
న్యూఢిల్లీ : పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ రెండోరోజు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. ఆయనకు ఇవాళ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న సల్వీందర్ సింగ్ కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన సంఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్వీందర్ సింగ్ పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. నిన్న ఆయనను ఎన్ఐఏ బృందం సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మాత్రం సల్వీందర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఆయనను విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు. -
ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్
కోల్‌కతా: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు. -
సల్వీందర్ సత్యవంతుడో.. కాదో?
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడిపై విచారణలో భాగంగా గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇస్తున్న వివరణలు నిజాలా లేక అబద్ధాల అనే విషయం నేడు తేలనుంది. ఆయనకు నేడు సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కేసు విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనను ఇప్పటికే ఢిల్లీలో పాలిగ్రాప్ పరీక్షలకు తీసుకెళ్లింది. పాలిగ్రాప్ పరీక్షలకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 8నే సల్వీందర్ సింగ్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అయితే, ఆయన ఇస్తున్న వివరణలు పలు రకాల అనుమానాలకు దారి ఇవ్వడంతోపాటు ఆ రోజు కిడ్నాప్ అయినట్లు చెప్తున్న ప్రాంతంలో దర్గా మూసే సమయం అయినా కావాలని తెరిపించి ఉంచారని, సల్వీందర్ స్నేహితుడు రెండుసార్లు దర్గాను సందర్శించారని ఆ దర్గాలో పనిచేసే వ్యక్తి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ తీరును మరింత అనుమానించారు. పైగా ఆ దర్గా ప్రాంతంలో, సమీప పొలాల్లో వేర్వేరు సైజుల్లో ఉన్న కాలి బూటు గుర్తులను కూడా ఫొటోలు తీసుకుని పరిశీలించారు. దాదాపు అన్నిరకాలుగా సల్వీందర్‌ను విచారించిన ఎన్ఐఏ అధికారులు చివరికి పాలిగ్రాప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. -
ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్‌ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్‌కోట్‌లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్‌టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్‌ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు. -
'ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు'
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరం పై దాడికి సంబంధించి విచారణ పలు అనుమానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దాడికి కొద్ది గంటలముందు కిడ్నాప్ కు గురైన గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ ఇప్పటికే చెప్పిన కథనంలో పొంతన లేని అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఘటన నేపథ్యంలో చెప్తున్న కొందరు ఇస్తున్న వివరణలు సల్వీందర్ సింగ్ ఏదైనా తప్పు చేశారా అనే అనుమానాలను పెంచుతున్నాయి. తాను పంజ్ పిర్ దర్గాకు తరుచుగా వెళ్లొస్తుంటానని, అలా వెళ్లొస్తున్న క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పగా.. ఆ దర్గాను చూసుకునే సోమ్ అనే వ్యక్తి మాత్రం సల్వీందర్ సింగ్ ను తానెప్పుడు ఆ దర్గా వద్ద చూడలేదని అన్నారు. అయితే, డిసెంబర్ 31, రాత్రి 8.30 గంటలకు సల్వీందర్ తనకు ఫోన్ చేశారని, దర్గాను తెరిచి ఉంచాలని కోరాడని, అయితే అప్పటికే సమయం ముగిసినందున అది సాధ్యం కాదని చెప్పగా, తాను ఒక అధికారిగా చెప్తున్నానని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి దర్గాను తెరిచి ఉంచేలా చేశారని చెప్పాడు. అదే రోజు ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ కూడా రెండు సార్లు దర్గాకు వచ్చాడని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆలయానికి అత్యంత సమీపంలో కొన్ని పాకిస్థాన్ కాలిబూట్ల గుర్తులు ఉన్నాయని, అది సరిహద్దుకు అతి సమీపంలో ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే గుర్తించింది. ఈ అనుమానాలు మరింత బలపడితే ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చాలా లాజిక్స్ కూడా సల్వీందర్ సింగ్ పరోక్షంగా పాక్ ఉగ్రవాదులకు సహకరించారేమోనని అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.