'పఠాన్కోట్' ఎస్పీ మరో కీచకపర్వం
చండీగఢ్: పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రదాడి కేసులో ముష్కరులకు సహకరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్ ఎస్పీ సల్వీదర్సింగ్పై తాజాగా మరో లైంగిక వేధింపుల కేసు నమోదయింది. గతంలోనూ పలువురు మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఈసారి ఏకంగా ఓ రేప్ కేసు నిందితుడి భార్యను లొంగదీసుకోవాలని ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వహింస్తున్న సల్వీందర్పై ఈ మేరకు బుధవారం కేసు కూడా నమోదయింది. దీంతో తన ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎస్పీని ఐజీ (ప్రొవిజన్) ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారమే సల్వీందర్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. (సల్వీందర్ ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు)
పదేపదే మా ఇంటికి వచ్చి..
రేప్ కేసులో నిందితుడు, ప్రస్తుత కేసులో బాధితుడు అయిన వ్యక్తి ఇలా చెప్పుకొచ్చాడు.. 'నన్ను కేసు నుంచి తప్పించాలంటే రూ 50 వేలు లంచం ఇవ్వాలని సల్వీందర్ డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా పదేపదే మా ఇంటికి వచ్చి, నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఒకానొక దశలో ఆమెను చెరపట్టేప్రయత్నం చేశాడు. ఎలాగోలా డబ్బులు సర్దినప్పటికీ ఆయన వేధిపులు ఆగలేదు. ఇక భరించలేని స్థితిలో అతని(ఎస్పీ సల్వీందర్)పై పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ కు ఫిర్యాదుచేశాం. దీంతో ఎస్పీపై దైర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ రెండు ఎంక్వైరీల్లోనూ సల్వీందర్ కు క్లీన్ చిట్ లభించింది. మాపై వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి' అని బాధితుడు పేర్కొన్నాడు.
'పఠాన్కోట్' అనంతరం..
కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి అనంతరం ఎస్సీ సల్వీందర్ కు సంబంధించిన అనేక చీకటి కోణాలు వెలుగులోకి రావడంతో బాధితుడు మరోసారి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సారి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడంతో ఎస్పీ కీచకపర్వం నిజమేనని తేలింది. నిందితుడి భార్యతో మాట్లాడిన ఆడియో టేపులు, తదితర ఆధారాలను బట్టి బుధవారం ఎస్పీ సల్వీందర్ పై లైంగిక వేధింపుల కేసు(ఐపీసీ సెక్షన్ 376సి) నమోదయింది. అంతేకాదు, సదరు ఫిర్యాదుదాడిపై నమోదయిన రేప్ కేసు కూడా అక్రమమేనని తాజా దర్యాప్తులో తేలింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తనపై తప్పుడు కేసు పెట్టడమేకాకుండా భార్యను వేధింపులకు గురిచేసిన ఎస్పీని కఠినంగా శిక్షించాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ('ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు')