సల్వీందర్ సత్యవంతుడో.. కాదో?
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడిపై విచారణలో భాగంగా గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇస్తున్న వివరణలు నిజాలా లేక అబద్ధాల అనే విషయం నేడు తేలనుంది. ఆయనకు నేడు సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కేసు విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనను ఇప్పటికే ఢిల్లీలో పాలిగ్రాప్ పరీక్షలకు తీసుకెళ్లింది. పాలిగ్రాప్ పరీక్షలకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 8నే సల్వీందర్ సింగ్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు.
అయితే, ఆయన ఇస్తున్న వివరణలు పలు రకాల అనుమానాలకు దారి ఇవ్వడంతోపాటు ఆ రోజు కిడ్నాప్ అయినట్లు చెప్తున్న ప్రాంతంలో దర్గా మూసే సమయం అయినా కావాలని తెరిపించి ఉంచారని, సల్వీందర్ స్నేహితుడు రెండుసార్లు దర్గాను సందర్శించారని ఆ దర్గాలో పనిచేసే వ్యక్తి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ తీరును మరింత అనుమానించారు. పైగా ఆ దర్గా ప్రాంతంలో, సమీప పొలాల్లో వేర్వేరు సైజుల్లో ఉన్న కాలి బూటు గుర్తులను కూడా ఫొటోలు తీసుకుని పరిశీలించారు. దాదాపు అన్నిరకాలుగా సల్వీందర్ను విచారించిన ఎన్ఐఏ అధికారులు చివరికి పాలిగ్రాప్ పరీక్షలకు సిద్ధమయ్యారు.