gurdaspur
-
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్..?
టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తాజాగా యువీ.. తల్లి షబ్నమ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. ఇతను 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్దిగా పలుమార్లు గెలిచాడు. 1998, 1999, 2004, 2014లో వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్-పాకిస్తాన్ బోర్డర్‌ను ఆనుకుని ఉంటుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్‌లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్‌పైకి గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని పంజ్‌గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్‌కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్‌లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ ధన్యవాదాలు!
చండీగఢ్ : సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా శనివారం పంజాబ్‌లోని దేరా బాబా నానక్ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిక్కుల చిరకాల స్వప్నమైన కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వారా దర్శనానికి వీలు కల్పించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి పాకిస్తాన్ దర్బార్ సాహిబ్ గురుద్వారాకు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే కర్తార్‌పూర్ కారిడార్‌కు.. పంజాబ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను(ఐసీపీ) మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయుల మనోభావాలను గౌరవించి.. రెండు దేశాల మధ్య కర్తార్‌పూర్ కారిడార్‌ను అనుమతించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అదే విధంగా సిక్కు మతంలో కర్తార్‌పూర్‌కు ఉన్న ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ.. గురునానక్ ఇక్కడి నుంచే ' నిజాయితీగా పని చేయండి. దేవుణ్ణి స్మరించండి. పంచండి' అనే సందేశమిచ్చారనే విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఐక్యత, సామాజిక సామరస్యం, సోదర భావం దిశగా గురు నానక్ చేసిన బోధనలు ఒక్క సిక్కు వర్గానికి మాత్రమే పరిమితం కాదని.. సమస్త మానవాళికి హితోపదేశమని పేర్కొన్నారు. -
సన్నీ ఫోన్ నంబరు ఎంత పనిచేసింది!
ముంబై: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు తయారైంది ముంబై వాసి ప్రశాంత్ మిశ్రా పరిస్థితి. అధికారులు చేసిన పొరపాటు అతడికి పెద్ద చికాకు తెచ్చిపెట్టింది. లోక్‌సభ వెబ్సైట్లో పొరపాటున అతడి మొబైల్ నంబరు పెట్టడంతో నిరాంతరాయంగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ గురుదాస్‌పూర్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్‌కు వెళ్లాల్సినవి. లోక్‌సభ వెబ్సైట్లో సన్నీ డియోల్ నంబరుకు బదులుగా ప్రశాంత్ మిశ్రా ఫోన్ నంబరు పెట్టారు. దీంతో అతడి ఫోన్‌కు రకరకాల ఫిర్యాదులు, అభ్యర్థనలతో ఫోన్లు, వాట్సప్, టెక్ట్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. సన్నీ డియోల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ముంబైలో ఉంటున్నారని గురుదాస్‌పూర్ వాసుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. సన్నీడియోల్‌ను తమ ఎంపీగా ఎన్నుకుని తప్పు చేశామని చాలా మంది వాపోయారు. సన్నీడియోల్‌ను కలవాలని ఆయన అభిమానులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ప్రశాంత్ మిశ్రా వాపోయాడు. గతేడాదే ఈ ఫోన్ నంబరు తీసుకున్నానని, లోక్‌సభ వెబ్సైట్లో పొరపాటుగా తన నంబరు పెట్టడంతో వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని తెలిపాడు. తన నంబరును లోక్‌సభ వెబ్సైట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాడు. సన్నీ డియోల్ ఫోన్ నంబరును లోక్‌సభ వెబ్సైట్లో అప్డేట్ చేశారని ఆయన వ్యక్తిగత సహాయకుడు నిరంజన్ విద్యాసాగర్ తెలిపారు. పొరపాటుగా పెట్టిన ప్రశాంత్ నంబరును అధికారులు తొలగిచారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా సన్నీ డియోల్ గెలిచిన సంగతి తెలిసిందే. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భయానక అనుభవం.. బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు. మృతులకు 2 లక్షల పరిహారం బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి – విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 19 మంది మృతి
గురుదాస్‌పూర్ : పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని ఓ బాణాసంచా ప్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా యంత్రాగం పరిస్థితిని సమీక్షిస్తుంది. గురుదాస్‌పూర్ బటాలాలోని నివాస ప్రాంతాల్లో ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. -
‘అసలైన ఘనత ఇమ్రాన్‌కే చెందుతుంది’
చండీగఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. సిక్కుల ప్రార్థనలు ఫలించేలా చేసిన ఘనత కేవలం ఇమ్రాన్‌కే చెందుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిద్ధు.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం విషయంలో అసలైన ఘనత మాత్రం పాక్ ప్రధాని, తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ సిక్కు ప్రజల ఆకాంక్షలు ఫలించేలా చేశారని ప్రశంసించారు. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారని ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. (భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్) కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవడం సిద్ధుకు కొత్తేం కాదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం.. సౌత్ ఇండియా కంటే పాకిస్తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించడం తదితర సమయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే లష్కరే ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన నరమేధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఘటనలో మరణించిన వారికి, అమరవీరులకు దేశమంతా నివాళి అర్పిస్తుంటే... అందుకు కారణమైన దాయాది దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం సిద్ధుకే చెల్లిందని ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. (26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం) -
‘నా కౌగిలింత పని చేసింది’
చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు. -
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మిస్తామని పాక్ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్ క్లుప్తంగా చర్చించింది. నానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని.. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. ∙పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటు. ∙చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు. ► భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది. ► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు. ► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి. ► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి. -
గురుదాస్‌పూర్ ‘హస్త’గతం
గురుదాస్‌పూర్/చండీగఢ్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ 1.93 లక్షల భారీ మెజారిటీతో పాగా వేసింది. ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. ఆ దూకుడును కొనసాగించింది. బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా హఠాన్మరణంతో (ఏప్రిల్‌లో) ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కడ్ 4,99,752 ఓట్లు సంపాదించగా.. బీజేపీ అభ్యర్థి స్వరన్ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి సురేశ్ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఘనవిజయంతో ఓటర్లకు సునీల్ జక్కడ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ విజయంతో కాంగ్రెస్, అమరీందర్ సింగ్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసాన్ని చాటుకున్నారు’ అని పేర్కొన్నారు. జక్కడ్ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభినందించారు. ఈ విజయం కాంగ్రెస్ అభివృద్ధి ఎజెండాకు దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురుదాస్పూర్తోపాటు పంజాబ్ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ముందస్తు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. విలువల్లేని రాజకీయాలకు తగినశాస్తి ‘ఈ ఎన్నికల్లో అవినీతిలో కూరుకుపోయిన, విలువల్లేని బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌లను ప్రజలు తిరస్కరించారు. ఈ ఫలితం ఆర్నెల్ల కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అన్న అకాలీదళ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ పని అయిపోయింది. ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ ఓటమిని అంగీకరించింది’ అని అమరీందర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై బీజేపీ పేరు గోడలపై మాత్రమే కనిపించాలి. ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అకాలీదళ్‌కు ప్రజలు సరైన సమాధానమిచ్చారు గురుదాస్‌పూర్ విజ యంతో రాష్ట్రంలో అకాలీదళ్ తిరోగమనం మొదలైనట్లే. ఆ పార్టీ తిరిగి కోలుకోవాలంటే.. కొత్త నాయకత్వం కావాల్సిందే’ అని జక్కడ్ విమర్శించారు. ఈ ఎన్నికల విజయం బీజేపీ–అకాలీదళ్ కూటమి స్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పేర్కొన్నారు. ఈ కూటమికి ఇది ఇన్నింగ్స్ ఓటమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పునరుజ్జీవనం మొదలైంది గురుదాస్‌పూర్ ఫలితం.. బీజేపీ, నరేంద్రమోదీ పథకాలపై ప్రజల్లో అసంతృప్తిని బట్టబయలు చేసిందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. మోదీవి మాటలే తప్ప చేతలు కావని ప్రజలు గుర్తించారన్నారు. 2017లో జరిగిన అన్ని లోక్‌సభ ఉప ఎన్నికల్లో (అమృత్సర్, శ్రీనగర్, మలప్పురం, గురుదాస్‌పూర్) యూపీఏ ఘన విజయం సాధించడమే ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారనడానికి నిదర్శనమన్నారు. 2019లో కాంగ్రెస్ మళ్లీ పునరుజ్జీవనం పొందేందుకు గురుదాస్‌పూర్ విజయం కీలకమని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ, ఆప్ ఆరోపించాయి. 1998, 1999, 2004, 2014 ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి వినోద్ ఖన్నా విజయం సాధించారు. 2009లో వినోద్ ఖన్నాపై కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా గెలుపొందారు. -
ఆప్ నేతపై దుండగుల కాల్పులు
గురుదాస్‌పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన నుంచి అదృష్టవశాత్తు అతడు బయటపడ్డాడు. పోలీసులు నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే, ఆమ్ ఆద్మీ పార్టీలో గురుపర్తాప్ సింగ్ కుషల్పూర్ అనే వ్యక్తి కీలక నేతగా పని చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆదివారం రాత్రి గురుద్వార అనే గ్రామం నుంచి తిరిగొచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఆయన వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం అక్కడి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. -
పంజాబ్‌లో 'ఉగ్ర' కాల్పులు
గురుదాస్‌పూర్ : భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. ఆదివారం రాత్రి బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఆత్మహూతి దాడికి దిగిన ఉగ్రవాదులు మళ్లీ సోమవారం ఉదయం విరుచుకుపడ్డారు. పంజాజ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీఎస్ఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అనిల్ పైల్వాల్ ఈ దాడులను నిర్థారించారు. అనుమానిత ఉగ్రవాదులు గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని చక్రి పోస్టు వద్ద చొరబాటుకు ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ కాల్పులను బీఎస్ఎఫ్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని వివరించారు. కాగ,ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలోనే ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రధానకార్యాలయం వద్ద బీభత్సం సృష్టించారు. గంటసేపు జరిగిన ఆ హోరాహోరి కాల్పుల్లో ఓ జవాను అమరుడవగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని ఆర్మీ వెల్లడించింది. ఇద్దరు మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టింది. మిగతా నలుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారి కోసం ప్రస్తుతం వేట జరుగుతున్న నేపథ్యంలో గురుదాస్‌పూర్‌లో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
పఠాన్‌కోట్‌లో హై అలర్ట్
పఠాన్‌కోట్: ఉగ్రవాదులు మరోసారి పంజాబ్ సరిహద్దు జిల్లాలు పఠాన్‌కోట్, గురుదాస్ పూర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ రెండు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బటాలా పట్టణంలో శనివారం ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన నిఘా వర్గాలు ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసానికి కుట్రపన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. -
అమరవీరుల కుటుంబాలకు కేజ్రీవాల్ పరామర్శ
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, టాక్సీ డ్రైవర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చాక్ షరీఫ్, ఝుండా గురజాన్ గ్రామాలకు వెళ్లి హావిల్దార్ కుల్వంత్ సింగ్, ఫతేహ్ సింగ్, టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ కల్వంత్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. అమరవీరులకు నివాళి అర్పించారు. -
ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్
కోల్‌కతా: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు. -
సల్వీందర్ సత్యవంతుడో.. కాదో?
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడిపై విచారణలో భాగంగా గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇస్తున్న వివరణలు నిజాలా లేక అబద్ధాల అనే విషయం నేడు తేలనుంది. ఆయనకు నేడు సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కేసు విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనను ఇప్పటికే ఢిల్లీలో పాలిగ్రాప్ పరీక్షలకు తీసుకెళ్లింది. పాలిగ్రాప్ పరీక్షలకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 8నే సల్వీందర్ సింగ్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అయితే, ఆయన ఇస్తున్న వివరణలు పలు రకాల అనుమానాలకు దారి ఇవ్వడంతోపాటు ఆ రోజు కిడ్నాప్ అయినట్లు చెప్తున్న ప్రాంతంలో దర్గా మూసే సమయం అయినా కావాలని తెరిపించి ఉంచారని, సల్వీందర్ స్నేహితుడు రెండుసార్లు దర్గాను సందర్శించారని ఆ దర్గాలో పనిచేసే వ్యక్తి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ తీరును మరింత అనుమానించారు. పైగా ఆ దర్గా ప్రాంతంలో, సమీప పొలాల్లో వేర్వేరు సైజుల్లో ఉన్న కాలి బూటు గుర్తులను కూడా ఫొటోలు తీసుకుని పరిశీలించారు. దాదాపు అన్నిరకాలుగా సల్వీందర్‌ను విచారించిన ఎన్ఐఏ అధికారులు చివరికి పాలిగ్రాప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. -
గురుదాస్ పూర్ లో ఉగ్ర కలకలం
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు అనుమానిత వ్యక్తులు మిలటరీ దుస్తుల్లో కనిపించారన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆర్మీ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. టిబ్రీ మిలటరీ స్టేషన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు నుంచి గురుదాస్ పూర్ లోకి ఉగ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా అనేది తెలుసుకునేందుకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలు, సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ బలగాలు అణువణువు శోధిస్తున్నాయి. సొరంగ మార్గం గుండా ఉగ్రవాదులు చొరబడేందుకు ఏమైనా అవకాశముందా అనే కోణంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 2న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను మూడు రోజుల తర్వాత భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, విడిచి పెట్టిన గురుదాస్ పూర్ ఎస్పీ సాల్విందర్ సింగ్ ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. -
ఆ ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
గురుదాస్‌పూర్ ఉగ్రదాడిపై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటన న్యూఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్‌తో సంబంధముందని.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయటానికి పాక్ నుంచే చొరబడ్డారని నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 27వ తేదీ సోమవారం నాడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉగ్రదాడిని పార్లమెంటు ఉభయసభలైన లోక్‌సభ, రాజ్యసభ గురువారం తీవ్రంగా ఖండించాయి. ఆ దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పించాయి. అనంతరం.. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అంత్యక్రియలు జరుగుతున్నందున లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయగా.. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదావేశారు. మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురుదాస్‌పూర్ దాడిపై ప్రకటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య ఆయన మాట్లాడుతూ.. గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది పాకిస్తాన్లో ప్రవేశించే ప్రాంతమైన తాష్ ప్రాంతం వద్ద ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబడినట్లు జీపీఎస్ సమాచారం ప్రకారం పోలీసుల ప్రాధమిక విశ్లేషణ సూచిస్తోందని తెలిపారు. సరిహద్దులో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదులు పంజాబ్‌లో చొరబడగలగటానికి అక్కడ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తోడయిన ఫలితంగా సరిహద్దు వెంట నదులు, కాల్వల్లో నీటి ప్రవాహం పెరగటం కావచ్చునని అభిప్రాయపడ్డారు. -
గురుదాస్ పూర్ లో బాంబు కలకలం
గురుదాస్ పూర్: ఉగ్రవాదుల దాడి నుంచి కోలుకోకముందే పంజాబ్ లో గురుదాస్ పూర్ లో గురువారం బాంబు కలకలం రేగింది. బస్టాండ్ లో అనుమానిత బ్యాగ్ కనపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు బస్టాండ్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను బయటకు పంపించారు. బ్యాగ్ లో ఏముందో తెలుసుకునేందుకు బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగింది. దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా ఏడుగురు మృతి చెందారు. అంతకుముందు రైల్వే ట్రాక్ పై పేలకుండా ఉన్న బాంబులను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో గురుదాస్ పూర్ బస్టాండ్ లో గుర్తించిన సంచి ఉగ్రవాదాదులు పెట్టారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కాలం చెల్లిన తుపాకులే ఉన్నాయి వాటితోనే...
కపూర్తలా : పంజాబ్ లోని పోలీసుల వద్ద కాలం చెల్లిన తుపాకీలే ఉన్నాయి. వాటితోనే తమ పోలీసులు తీవ్రవాదులతో పోరాడతున్నారు... గత ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతుంది. బుల్లెట్ ఫ్రూప్ దుస్తులు లేవు... యుద్ధ సమయంలో ధరించే హెల్మెట్లు లేవు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. బుధవారం గురుదాస్‌పూర్‌లో పాక్ ముష్కర మూకల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ బల్జీత్ సింగ్ నివాసంలో బల్జీజ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడారు. బల్జీత్ సింగ్‌ను చూసి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రంలో కాలం చెల్లిన ఆయుధాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం న్యూఢిల్లీలో కలసి ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ సింగ్ తెలిపారు. సోమవారం పంజాబ్ జిల్లాలోని గురుదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌పై పాక్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులతోపాటు ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులో స్థానిక డిటెక్టివ్ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్జీత్ సింగ్ మరణించారు. అలాగే పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. -
ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్ పూర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తుననట్టు రాహుల్ ట్విట్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పంజాబ్ లో సాధ్యమైనంత తొందరగా పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పిరికతనంతో అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే అపరాధులైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
ఉగ్రదాడి జరిగిందిలా..
-
వచ్చింది పాకిస్థాన్ నుంచేనా?
గుర్దాస్పూర్: పంజాబ్‌లోని దీనానగర్‌లో భీభత్సం సృష్టించి పోలీస్ స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఆరుగురిని కాల్చిచంపి.. ఇంకా స్టేషన్ లోనే నక్కి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తూటాలు పేల్చుతూ భద్రతా బలగాలకు సవాలు విసురుతోన్న ముష్కరులు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినబడుతోంది. నాలుగురి నుంచి పది మంది వరకు ఉన్న ఈ ఉగ్రవాదుల బృందం.. పాకిస్థాన్‌లోని నరోవాల్ నుంచి వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నరోవల్ ఓ ముఖ్య పట్టణమేకాదు.. నరోవల్ జిల్లాకు కేంద్రం కూడా. ఇది భారత్- పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉంది. ఇటు పంజాబ్‌తోపాటు జమ్ముకశ్మీర్తోనూ సరిహద్దును పంచుకుంటున్న నరోవల్ జిల్లా నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి ముందు జమ్ములోని హరినగర్‌లో ఈ బృందం కదలికలను ఐబీ గుర్తించినట్లు తెలిసింది. హరినగర్ నుంచి సోమవారం రాత్రి అమృత్సర్- పఠాన్‌కోట్ హైవే వద్దకు చేరుకున్న ముష్కరులు.. మొదట ఓ కారును హైజాక్ చేశారు. అదే మార్గంలో వెళుతోన్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోయాడు. అక్కడినుంచి కారులో నేరుగా దీనానగర్ కు చేరుకుని, గార్డులను కాల్చిచంపి, పోలీస్ స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారంత సుశిక్షితులైన ఉగ్రవాదులేనని ఇప్పటికే నిర్ధారించిన భద్రతా దళాలు.. తగు జాగ్రత్తలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనానగర్‌లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
ఉగ్రదాడి జరిగిందిలా..
గుర్దాస్పూర్: పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో.. సెంట్రీలను కాల్చేసి స్టేషన్ లోకి చొరబడ్డ ముష్కరులు అక్కడ భీభత్సం సృష్టించారు. ఆ తరువాత ఓ భవనంలోకి ప్రవేశించి లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరుకు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు. పాకిస్థాన్‌లోని నరోవల్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించారు. జమ్ములోని హరినగర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి తరువాత పంజాబ్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పఠాన్‌కోట్ మీదుగా గుర్దాస్పూర్- జమ్ము హైవేపై వద్దకు చేరుకుని ఓ మారుతీ కారును హైజాక్ చేశారు. అప్పటికే వారు సైనిక దుస్తులు ధరించారు. అదే మార్గంలో జమ్ము వైపు వెళుతోన్న బస్సుపై కాల్పులు జరపగా ఓ ప్రయాణికుడు మరణించాడు. అక్కడి నుంచి హైజాక్ చేసిన కారులో నేరుగా దీనానగర్ పోలీస్ స్టేషన్ వైపునకు బయలుదేరారు. దీనానగర్ లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ముష్కరులు సెంట్రీలపై కాల్చిచంపారు. స్టేషన్ లో భీభత్సం సృష్టించిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించారు. లోపలి నుంచి ప్రతి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగి దీనానగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను చూట్టుముట్టాయి. ఈలోపే దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దీనానగర్ లోని స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. దాదాపు 10 గంటల సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ ప్రారంభం. కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు చనిపోయారు. కౌంటర్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది హతం. దీంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో గుర్ దాస్ పూర్ జిల్లా ఎస్సీ బల్జీత్ సింగ్ మరణించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 13 మంది చనిపోయారు.