చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్‌లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment