international border between India and Pakistan
-
సరిహద్దులో డ్రగ్స్ డ్రోన్ కూల్చివేత
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మాదకద్రవ్యాల డ్రోన్‌ను కూల్చివేశారు. బీఎస్ఎఫ్ సిబ్బంది, పంజాబ్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. కక్కార్ గ్రామంలో 6 రెక్కలున్న డ్రోన్ ఎగురుతున్నట్లుగా గుర్తించామని, వెంటనే ఏకే–47 నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపి కూల్చివేశామని, ఇందులో 5 కిలోల హెరాయిన్ లభ్యమైందని అధికారులు ఆదివారం వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందన్నారు. డ్రోన్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
‘నా కౌగిలింత పని చేసింది’
చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు. -
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మిస్తామని పాక్ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్ క్లుప్తంగా చర్చించింది. నానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని.. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. ∙పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటు. ∙చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు. ► భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది. ► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు. ► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి. ► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి. -
పాక్ కాల్పుల్లో 7 నెలల్లో 52 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. -
పాక్ దొంగదెబ్బ.. ఐదుగురి మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్‌లోని అక్నూర్లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వీకే పాండే (27), ఏఎస్ఐ ఎస్ఎన్ యాదవ్ (48) సహా ముగ్గురు పౌరులు మృతి చెందారనీ పరగ్వాల్ చెక్ పోస్ట్ ఇన్చార్జ్ బ్రిజిలాల్ శర్మ తెలిపారు. ప్రతిగా భారత బలగాలు దాడులు ప్రారంభించాయని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరగ్వాల్ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్ చెప్పారు. సరిహద్దుల్లోని భద్రతపై కట్టుదిట్టమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుందామని పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. మే 29న భారత్‌కు పిలుపునివ్వడం గమనార్హం. కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పిలుపుపై భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే, ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా చేస్తోంది. -
అబ్బురపరిచే ఇండో-పాక్ బార్డర్ ఫొటో
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది. అంతరిక్షం నుంచి చూస్తే ఇండో-పాక్ సరిహద్దు ఎలా వుంటుందో తెలిపే ఫొటోను నాసా ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి గత సెప్టెంబర్ 23న రాత్రి సమయంలో ఈ ఫొటో తీశారు. 28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికన్ డీ4 డిజిటల్ కెమెరాతో ఉత్తర పాక్‌లోని ఇండస్ రివర్ వ్యాలీ మీదుగా భారత్ సరిహద్దు వరకు పానోరమ ఫొటోను క్లిక్ మనిపించారు. రాత్రి సమయంలోనూ భూమి మీదున్న అంతర్జాతీయ సరిహద్దుతోపాటు పలు ప్రాంతాలను ఈ ఫొటోలో స్పష్టంగా చూడవచ్చు. నారింజరంగులో వెలుగుతున్న భద్రత లైట్లు భారత్-పాక్ వేరు చేస్తున్న సరిహద్దును స్పష్టంగా చూపుతున్నాయి. గతంలోనూ 2011లో భారత్-పాక్ సరిహద్దుకు సంబంధించిన ఫొటోను నాసా విడుదల చేసింది.