ప్రతీకాత్మక చిత్రం..
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్‌లోని అక్నూర్‌లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు.
ఈ దాడిలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ వీకే పాండే (27), ఏఎస్‌ఐ ఎస్‌ఎన్ యాదవ్ (48) సహా ముగ్గురు పౌరులు మృతి చెందారనీ పరగ్వాల్ చెక్ పోస్ట్ ఇన్‌చార్జ్ బ్రిజిలాల్ శర్మ తెలిపారు. ప్రతిగా భారత బలగాలు దాడులు ప్రారంభించాయని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరగ్వాల్ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్ చెప్పారు.
సరిహద్దుల్లోని భద్రతపై కట్టుదిట్టమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుందామని పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. మే 29న భారత్‌కు పిలుపునివ్వడం గమనార్హం. కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పిలుపుపై భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే, ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment