అబ్బురపరిచే ఇండో-పాక్ బార్డర్ ఫొటో
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది. అంతరిక్షం నుంచి చూస్తే ఇండో-పాక్ సరిహద్దు ఎలా వుంటుందో తెలిపే ఫొటోను నాసా ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి గత సెప్టెంబర్ 23న రాత్రి సమయంలో ఈ ఫొటో తీశారు.
28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికన్ డీ4 డిజిటల్ కెమెరాతో ఉత్తర పాక్లోని ఇండస్ రివర్ వ్యాలీ మీదుగా భారత్ సరిహద్దు వరకు పానోరమ ఫొటోను క్లిక్ మనిపించారు. రాత్రి సమయంలోనూ భూమి మీదున్న అంతర్జాతీయ సరిహద్దుతోపాటు పలు ప్రాంతాలను ఈ ఫొటోలో స్పష్టంగా చూడవచ్చు. నారింజరంగులో వెలుగుతున్న భద్రత లైట్లు భారత్-పాక్ వేరు చేస్తున్న సరిహద్దును స్పష్టంగా చూపుతున్నాయి. గతంలోనూ 2011లో భారత్-పాక్ సరిహద్దుకు సంబంధించిన ఫొటోను నాసా విడుదల చేసింది.