
గురుదాస్‌పూర్/చండీగఢ్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ 1.93 లక్షల భారీ మెజారిటీతో పాగా వేసింది. ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. ఆ దూకుడును కొనసాగించింది. బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా హఠాన్మరణంతో (ఏప్రిల్‌లో) ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కడ్ 4,99,752 ఓట్లు సంపాదించగా.. బీజేపీ అభ్యర్థి స్వరన్ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి.
ఆప్ అభ్యర్థి సురేశ్ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఘనవిజయంతో ఓటర్లకు సునీల్ జక్కడ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ విజయంతో కాంగ్రెస్, అమరీందర్ సింగ్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసాన్ని చాటుకున్నారు’ అని పేర్కొన్నారు. జక్కడ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభినందించారు. ఈ విజయం కాంగ్రెస్ అభివృద్ధి ఎజెండాకు దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురుదాస్‌పూర్‌తోపాటు పంజాబ్ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ముందస్తు దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
విలువల్లేని రాజకీయాలకు తగినశాస్తి
‘ఈ ఎన్నికల్లో అవినీతిలో కూరుకుపోయిన, విలువల్లేని బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌లను ప్రజలు తిరస్కరించారు. ఈ ఫలితం ఆర్నెల్ల కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అన్న అకాలీదళ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ పని అయిపోయింది. ఎన్నికల ఫలితాలకు ముందే ఆ పార్టీ ఓటమిని అంగీకరించింది’ అని అమరీందర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై బీజేపీ పేరు గోడలపై మాత్రమే కనిపించాలి. ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అకాలీదళ్‌కు ప్రజలు సరైన సమాధానమిచ్చారు గురుదాస్‌పూర్ విజ
యంతో రాష్ట్రంలో అకాలీదళ్ తిరోగమనం మొదలైనట్లే. ఆ పార్టీ తిరిగి కోలుకోవాలంటే.. కొత్త నాయకత్వం కావాల్సిందే’ అని జక్కడ్ విమర్శించారు. ఈ ఎన్నికల విజయం బీజేపీ–అకాలీదళ్ కూటమి స్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పేర్కొన్నారు. ఈ కూటమికి ఇది ఇన్నింగ్స్ ఓటమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పునరుజ్జీవనం మొదలైంది
గురుదాస్‌పూర్ ఫలితం.. బీజేపీ, నరేంద్రమోదీ పథకాలపై ప్రజల్లో అసంతృప్తిని బట్టబయలు చేసిందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. మోదీవి మాటలే తప్ప చేతలు కావని ప్రజలు గుర్తించారన్నారు. 2017లో జరిగిన అన్ని లోక్‌సభ ఉప ఎన్నికల్లో (అమృత్‌సర్, శ్రీనగర్, మలప్పురం, గురుదాస్‌పూర్) యూపీఏ ఘన విజయం సాధించడమే ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారనడానికి నిదర్శనమన్నారు. 2019లో కాంగ్రెస్ మళ్లీ పునరుజ్జీవనం పొందేందుకు గురుదాస్‌పూర్ విజయం కీలకమని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ, ఆప్ ఆరోపించాయి. 1998, 1999, 2004, 2014 ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి వినోద్ ఖన్నా విజయం సాధించారు. 2009లో వినోద్ ఖన్నాపై కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment