గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్‌తో సంబంధముందని.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయటానికి పాక్ నుంచే చొరబడ్డారని..
గురుదాస్‌పూర్ ఉగ్రదాడిపై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటన
న్యూఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్‌తో సంబంధముందని.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయటానికి పాక్ నుంచే చొరబడ్డారని నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 27వ తేదీ సోమవారం నాడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉగ్రదాడిని పార్లమెంటు ఉభయసభలైన లోక్‌సభ, రాజ్యసభ గురువారం తీవ్రంగా ఖండించాయి. ఆ దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పించాయి.
అనంతరం.. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అంత్యక్రియలు జరుగుతున్నందున లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయగా.. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదావేశారు. మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురుదాస్‌పూర్ దాడిపై ప్రకటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య ఆయన మాట్లాడుతూ..
గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది పాకిస్తాన్‌లో ప్రవేశించే ప్రాంతమైన తాష్ ప్రాంతం వద్ద ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబడినట్లు జీపీఎస్ సమాచారం ప్రకారం పోలీసుల ప్రాధమిక విశ్లేషణ సూచిస్తోందని తెలిపారు. సరిహద్దులో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదులు పంజాబ్‌లో చొరబడగలగటానికి అక్కడ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తోడయిన ఫలితంగా సరిహద్దు వెంట నదులు, కాల్వల్లో నీటి ప్రవాహం పెరగటం కావచ్చునని అభిప్రాయపడ్డారు.