ఉగ్ర కదలికలపై మరింత దృష్టి పెట్టండి
- కేంద్ర హోంమంత్రితో భేటీలో దత్తాత్రేయ విజ్ఞప్తి
- ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసులను రాజ్‌నాథ్ అభినందించారని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏ మూల ఉగ్ర దాడులు జరిగినా హైదరాబాద్‌లో ఒక్క ఉగ్రవాదైనా పట్టుబడుతున్నాడని, అందువల్ల వారి కదలికలపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో సమావేశమైన దత్తాత్రేయ హైదరాబాద్‌లో ఐసిస్ కార్యకలాపాలు, హైకోర్టు న్యాయవాదుల నిరసనలపై చర్చించారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఛేదించిన ఎన్‌ఐఏతోపాటు తెలంగాణ పోలీసుల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు.
తెలంగాణలో న్యాయవాదుల ఆందోళనలపై జోక్యం చేసుకోవాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గవర్నర్‌తో చర్చించి సమస్య పరిష్కరించుకునేలా చూడాలని కోరగా అం దుకు రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్‌లో దాడులు జరగనివ్వకుండా సకాలంలో ఉగ్రవాదులను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భవి ష్యత్తులో ఇస్తాంబుల్ వంటి దాడులు హైదరాబాద్‌లో జరగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగాలని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారన్నారు. కాగా, న్యాయవాదుల ఆందోళనలు, సబార్డినేట్ జడ్జిల సస్పెన్షన్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో దత్తాత్రేయ చర్చించారు. ఈ అంశాలను సత్వరమే కొలిక్కి తెస్తామని సదానంద హామీ ఇచ్చారు.