టర్కీలో నరమేధం | 41 people killed in the terrorist attack | Sakshi
Sakshi News home page

టర్కీలో నరమేధం

Published Thu, Jun 30 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

టర్కీలో నరమేధం

టర్కీలో నరమేధం

ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి  41 మంది మృతి
 
 ఇస్తాంబుల్:  టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఇస్తాంబుల్‌లో గల అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పది గంటలకు తుపాకులు, బాంబులతో విచక్షణారహితంగా విరుచుకుపడి మారణహోమానికి తెగబడ్డారు. ఈ ఉన్మాదానికి 41 మంది అమాయక ప్రజలు బలయ్యారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థేనని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల్లో 23మంది టర్కీ పౌరులు కాగా.. 13 మంది విదేశీ జాతీయులు ఉన్నారు.

వారిలో పలువురు సౌదీ పౌరులతో పాటు చైనా, ట్యునీసియా, ఉక్రెయిన్ దేశస్తులు ఒక్కొక్కరు ఉన్నారు. టర్కీలో అతిపెద్దదే కాదు, యూరప్‌లో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మూడోది, ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న అటాటర్క్ విమానాశ్రయానికి ముగ్గ్గురు ఆత్మాహుతి బాంబర్లు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ట్యాక్సీలో చేరుకుని ఈ మారణహోమానికి తెరతీశారు. వారిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో ముగ్గురూ తమను తాము పేల్చేసుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుంది కచ్చితంగా ఎక్కడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఎవరూ ప్రవేశమార్గం దగ్గర భద్రతా తనిఖీల ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లలేదని.. ఇద్దరు ముష్కరులు అంతర్జాతీయ ఆగమనాల ప్రాంతంలో, మరొక ఉగ్రవాది పార్కింగ్ ప్రదేశంలో పేల్చేసుకున్నారని  ఒక అధికారి చెప్పారు.

అయితే.. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల  పేల్చేసుకున్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు ఎక్స్‌రే మిషన్ల సమీపంలో కాల్పులు జరిపారని హాబర్‌టర్క్ వార్తా పత్రిక తెలిపింది. ప్రాణభయంతో పారిపోతున్న ప్రయాణికులతో కలిసి పరిగెడుతున్న ఒక ఉగ్రవాదిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో అతడు వెలుపలికి వెళ్లే ద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని, మూడో ఉగ్రవాది ఒక అంతస్తు ఎక్కి అంతర్జాతీయ నిష్ర్కమణల ప్రాంతం వరకూ వెళ్లగా పోలీసులు కాల్పులు జరపటంతో తనను తాను పేల్చివేసుకున్నాడని పేర్కొంది. విమానాశ్రయ నిఘా వీడియో దృశ్యాలను సామాజిక వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఒక వీడియోలో మరొక ఉగ్రవాది పోలీసుల కాల్పులకు నేలకొరిగి తనను తాను పేల్చేసుకోవటం కనిపించింది.

అలాగే ఒక ఉగ్రవాది ఏకే47 తుపాకులతో పరుగెడుతూ కాల్పులు జరపటమూ మరొక వీడియోలో కనిపించింది. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ముష్కరుల దాడులతో భీతిల్లి పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కన్నీళ్లతో కాలం గడిపారు. బుధవారం ఉదయానికి విమానాశ్రయాన్ని శుభ్రంచేసి మళ్లీ తెరిచారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ అని అంచనాలు చెప్తున్నట్లు ప్రధానమంత్రి బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యం కావాలని అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చారు. అయితే.. దాడి చేసింది తామేనని ఆ సంస్థ ప్రకటించలేదు.

 ఏదో ప్రవక్తలా నడుస్తూ కాల్చేశాడు...
 ‘నేను నా లగేజీని పెడుతున్నాను. అంతలో ఒక వ్యక్తి రహస్యంగా దాచిన తుపాకీ బయటకు తీయటం చూశాను. అతడు వెంటనే కాల్పులు జరపటం మొదలు పెట్టాడు. రెండు సార్లు కాల్పులు జరిపాడు. చాలా మామూలుగా జనాన్ని కాల్చివేస్తున్నాడు.. ఏదో ప్రవక్త లాగా నడుస్తూ కాల్చివేస్తున్నాడు’ అని ఓట్ఫా మొహమద్ అబ్దుల్లా అనే మహిళ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

 అమానవీయం: రాష్ట్రపతి, ప్రధాని
 న్యూఢిల్లీ: ఈ దాడి అమానవీయం అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసి పోరాడాలన్నారు. మృతుల్లో భారతీయులు లేరని ప్రభుత్వం తెలిపింది.
 
 టర్కీలో ఏడాదిగా ఉగ్రవాద రక్తపాతం...
 పశ్చిమాసియా అస్థిరత  టర్కీనీకబళిస్తోంది. ప్రభుత్వంతో పోరాడుతున్న కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ఉగ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ గత ఏడాది కాలంగా  రక్తపాతం సృష్టిస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఉగ్రవాదులు దాదాపు 14 భారీ దాడులకు పాల్పడి 200 మందికి పైగా సామాన్య ప్రజల ప్రాణాలను హరించాయి. గత ఏడాది అక్టోబర్‌లో అంకారాలో ఐసిస్ జరిపిన దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

 సిరియా తిరుగుబాటుదారులకు మద్దతిచ్చి...
 ముస్లిం ప్రజాస్వామ్య దేశమైన టర్కీకి ఈ ప్రాంతంలో విశిష్ట స్థానముంది. పొరుగు ముస్లిం దేశాలకు సాయం చేయటం ద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంటుంది. సిరియాలో ఐసిస్‌పై పోరాటంలో నాటో దళాలతో కలసి పనిచేస్తోంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినపుడు.. ఆ దేశాధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుడ్ని చేయటానికి మద్దతిస్తూ సిరియా రెబల్స్‌కు సాయం చేసింది.సిరియాలో ఐసిస్‌తో పోరాడుతున్న కుర్దు రెబల్స్‌కు అమెరికా మద్దతివ్వడంపై టర్కీ ఆగ్రహంగా ఉంది.  టర్కీ ఆదాయ వనరుల్లో పర్యాటకం కీలకమైనంది. దేశంలో పర్యాటకానికి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం లాంటిది.  ఈ ఏడాది పర్యాటక సీజన్ ఇప్పుడే మొదలైంది. దీంతో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చేందుకుఐసిస్ ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టుపై దాడి చేసుంటుందని భావిస్తున్నారు.
 
 అంతకుముందే బయల్దేరా: హృతిక్

 ముంబై: ఈ దాడి నుంచి బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ త్రుటిలో బయటపడ్డారు. దాడికి కొద్ది గంటలముందు అక్కడి నుంచి వేరే విమానంలోవెళ్లారు. ‘నేను ఇస్తాంబుల్‌లో విమానం మారాల్సి ఉంది. కానీ సమయానికి చేరుకోలేకపోయాను. తర్వాతి విమానం మరుసట్రోజు ఉండటంతో ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సివచ్చేది. అక్కడి సిబ్బంది సాయం చేశారు. టికెట్ తీసుకుని కొన్నిగంటల ముందుబయల్దేరాను. దిగ్భ్రాంతికరమైన వార్త’ అని ట్వీట్ చేశారు.  హృతిక్ తన కుమారులిద్దరితో మాడ్రిడ్ నుంచి ఆఫ్రికాకు వెళ్తూ ఇస్తాంబుల్‌లో ఆగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement