Istanbul airport
-
ఇస్తాంబుల్‌లో మూడు ముక్కలైన విమానం
-
ఎయిర్‌పోర్టులో భారత్ పరువుకు భంగం
ఇస్తాన్‌బుల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటణలు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి. టర్కీ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఇస్తాన్బుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు ‘ఇండియాలో ఆవులకు ఉన్న విలువ అక్కడి మనుషులకు, ముఖ్యంగా మహిళలకు లేదు’ అంటూ టీషర్ట్‌లపై కొటేషన్లను ముద్రించి వాటిని ధరించి ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొంతమంది ‘మీ ఆడవారిని ఇండియాకు పంపించాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆలోచించండి’ అంటూ టీషర్ట్‌లపై ముద్రించు కున్నారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. అంతర్జాతీయంగా భారత్ పరువు పోవడానికి కారణమైన ఆ అత్యాచార నిందితులను వెంటనే ఉరి తీయాలని కొంతమంది నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారంటూ టీషర్ట్ ధరించిన వారిపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మహిళలపై లైంగిక దాడులను అరికట్టనంత వరకు ఇలాంటి అవమానాలను ఎదుర్కొనక తప్పదు. -
టర్కీలో నరమేధం
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి 41 మంది మృతి ఇస్తాంబుల్: టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఇస్తాంబుల్‌లో గల అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పది గంటలకు తుపాకులు, బాంబులతో విచక్షణారహితంగా విరుచుకుపడి మారణహోమానికి తెగబడ్డారు. ఈ ఉన్మాదానికి 41 మంది అమాయక ప్రజలు బలయ్యారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థేనని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల్లో 23మంది టర్కీ పౌరులు కాగా.. 13 మంది విదేశీ జాతీయులు ఉన్నారు. వారిలో పలువురు సౌదీ పౌరులతో పాటు చైనా, ట్యునీసియా, ఉక్రెయిన్ దేశస్తులు ఒక్కొక్కరు ఉన్నారు. టర్కీలో అతిపెద్దదే కాదు, యూరప్‌లో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మూడోది, ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న అటాటర్క్ విమానాశ్రయానికి ముగ్గ్గురు ఆత్మాహుతి బాంబర్లు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ట్యాక్సీలో చేరుకుని ఈ మారణహోమానికి తెరతీశారు. వారిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో ముగ్గురూ తమను తాము పేల్చేసుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుంది కచ్చితంగా ఎక్కడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఎవరూ ప్రవేశమార్గం దగ్గర భద్రతా తనిఖీల ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లలేదని.. ఇద్దరు ముష్కరులు అంతర్జాతీయ ఆగమనాల ప్రాంతంలో, మరొక ఉగ్రవాది పార్కింగ్ ప్రదేశంలో పేల్చేసుకున్నారని ఒక అధికారి చెప్పారు. అయితే.. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకున్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు ఎక్స్‌రే మిషన్ల సమీపంలో కాల్పులు జరిపారని హాబర్‌టర్క్ వార్తా పత్రిక తెలిపింది. ప్రాణభయంతో పారిపోతున్న ప్రయాణికులతో కలిసి పరిగెడుతున్న ఒక ఉగ్రవాదిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో అతడు వెలుపలికి వెళ్లే ద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని, మూడో ఉగ్రవాది ఒక అంతస్తు ఎక్కి అంతర్జాతీయ నిష్ర్కమణల ప్రాంతం వరకూ వెళ్లగా పోలీసులు కాల్పులు జరపటంతో తనను తాను పేల్చివేసుకున్నాడని పేర్కొంది. విమానాశ్రయ నిఘా వీడియో దృశ్యాలను సామాజిక వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఒక వీడియోలో మరొక ఉగ్రవాది పోలీసుల కాల్పులకు నేలకొరిగి తనను తాను పేల్చేసుకోవటం కనిపించింది. అలాగే ఒక ఉగ్రవాది ఏకే47 తుపాకులతో పరుగెడుతూ కాల్పులు జరపటమూ మరొక వీడియోలో కనిపించింది. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ముష్కరుల దాడులతో భీతిల్లి పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కన్నీళ్లతో కాలం గడిపారు. బుధవారం ఉదయానికి విమానాశ్రయాన్ని శుభ్రంచేసి మళ్లీ తెరిచారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ అని అంచనాలు చెప్తున్నట్లు ప్రధానమంత్రి బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యం కావాలని అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చారు. అయితే.. దాడి చేసింది తామేనని ఆ సంస్థ ప్రకటించలేదు. ఏదో ప్రవక్తలా నడుస్తూ కాల్చేశాడు... ‘నేను నా లగేజీని పెడుతున్నాను. అంతలో ఒక వ్యక్తి రహస్యంగా దాచిన తుపాకీ బయటకు తీయటం చూశాను. అతడు వెంటనే కాల్పులు జరపటం మొదలు పెట్టాడు. రెండు సార్లు కాల్పులు జరిపాడు. చాలా మామూలుగా జనాన్ని కాల్చివేస్తున్నాడు.. ఏదో ప్రవక్త లాగా నడుస్తూ కాల్చివేస్తున్నాడు’ అని ఓట్ఫా మొహమద్ అబ్దుల్లా అనే మహిళ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. అమానవీయం: రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ: ఈ దాడి అమానవీయం అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసి పోరాడాలన్నారు. మృతుల్లో భారతీయులు లేరని ప్రభుత్వం తెలిపింది. టర్కీలో ఏడాదిగా ఉగ్రవాద రక్తపాతం... పశ్చిమాసియా అస్థిరత టర్కీనీకబళిస్తోంది. ప్రభుత్వంతో పోరాడుతున్న కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ఉగ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ గత ఏడాది కాలంగా రక్తపాతం సృష్టిస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఉగ్రవాదులు దాదాపు 14 భారీ దాడులకు పాల్పడి 200 మందికి పైగా సామాన్య ప్రజల ప్రాణాలను హరించాయి. గత ఏడాది అక్టోబర్‌లో అంకారాలో ఐసిస్ జరిపిన దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియా తిరుగుబాటుదారులకు మద్దతిచ్చి... ముస్లిం ప్రజాస్వామ్య దేశమైన టర్కీకి ఈ ప్రాంతంలో విశిష్ట స్థానముంది. పొరుగు ముస్లిం దేశాలకు సాయం చేయటం ద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంటుంది. సిరియాలో ఐసిస్‌పై పోరాటంలో నాటో దళాలతో కలసి పనిచేస్తోంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినపుడు.. ఆ దేశాధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుడ్ని చేయటానికి మద్దతిస్తూ సిరియా రెబల్స్‌కు సాయం చేసింది.సిరియాలో ఐసిస్‌తో పోరాడుతున్న కుర్దు రెబల్స్‌కు అమెరికా మద్దతివ్వడంపై టర్కీ ఆగ్రహంగా ఉంది. టర్కీ ఆదాయ వనరుల్లో పర్యాటకం కీలకమైనంది. దేశంలో పర్యాటకానికి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం లాంటిది. ఈ ఏడాది పర్యాటక సీజన్ ఇప్పుడే మొదలైంది. దీంతో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చేందుకుఐసిస్ ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టుపై దాడి చేసుంటుందని భావిస్తున్నారు. అంతకుముందే బయల్దేరా: హృతిక్ ముంబై: ఈ దాడి నుంచి బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ త్రుటిలో బయటపడ్డారు. దాడికి కొద్ది గంటలముందు అక్కడి నుంచి వేరే విమానంలోవెళ్లారు. ‘నేను ఇస్తాంబుల్‌లో విమానం మారాల్సి ఉంది. కానీ సమయానికి చేరుకోలేకపోయాను. తర్వాతి విమానం మరుసట్రోజు ఉండటంతో ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సివచ్చేది. అక్కడి సిబ్బంది సాయం చేశారు. టికెట్ తీసుకుని కొన్నిగంటల ముందుబయల్దేరాను. దిగ్భ్రాంతికరమైన వార్త’ అని ట్వీట్ చేశారు. హృతిక్ తన కుమారులిద్దరితో మాడ్రిడ్ నుంచి ఆఫ్రికాకు వెళ్తూ ఇస్తాంబుల్‌లో ఆగారు. -
ఆ పేలుళ్లలో హృతిక్ బలయ్యేవాడు!
ముంబయి: హృతిక్ రోషన్ ఆయన కుమారులకు ప్రాణగండం తప్పింది. మరికొద్ది గంటలు అక్కడే ఉంటే వారి ప్రాణానికి ముప్పు ఏర్పడి ఉండేదేమో.. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపి దాదాపు 40మందిని పొట్టన బెట్టుకొని 150మంది వరకు గాయపరిచిన విషయం తెలిసిందే. అదే విమానాశ్రయంలో దాడికి కొన్ని గంటల ముందు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన కుమారులు రెహాన్, రిధాన్తో కలిసి అదే విమానాశ్రయంలో ఉన్నారు. ఓ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయి మరో విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు దొరక్కపోవడంతో ఆయన అక్కడే ఎదురుచూశారు. అయితే, విమాన సిబ్బంది సహాయంతో తిరిగి ఎకానమీ ఫ్లైట్‌లో బయలుదేరారు. అలా వారు బయలుదేరిన కొద్ది సేపటికే విమానశ్రయంలో పేలుళ్ల ఘటన జరిగింది. ఈ సంఘటన గురించి తెలుసుకొని హృతిక్ ఉలిక్కిపడ్డాడు. విమాన సిబ్బంది సహాయం వల్ల తాము రెప్పపాటులో దాడి నుంచి తప్పించుకోగలిగామని చెప్పారు. తన ప్రార్థనలు ఇస్తాంబుల్ వైపు ఉంటాయని ట్వీట్ చేశారు. 'మతం పేరిట అమాయకులను చంపేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యం నిలబడాలి' అని హృతిక్ ట్వీట్ చేశారు. Ws helped by d kindest staff at Istanbul arport hours ago. Shocking news. Innocents killed 4 religion.V must stand united against terrorism. — Hrithik Roshan (@iHrithik) 29 June 2016 missed connecting flight at Istanbul n wer stuck at airport next flight ws next day,but took economy n flew out earlier. #Prayers4istanbul — Hrithik Roshan (@iHrithik) 28 June 2016 -
హైదరాబాద్- టర్కీ విమాన సర్వీసుల రద్దు
హైదరాబాద్: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న పది మంది పట్టుబడిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్, రాక్సా, ఎయిర్‌పోర్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు. -
ప్రయాణికుల్ని పిట్టల్లా కాల్చి.. పేల్చేసుకున్నారు
ఇస్తాంబుల్: ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్లో మరో 150 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బుల్లెట్ల వర్షం.. ఆపై మెరుపు లాంటి పేలుడు భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దేశాధినేతల అత్యవసర సమావేశం.. అంతర్జాతీయ సహకారానికి పిలుపు ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో జరిగిన పేలుడులో ఇద్దరికి గాయాలైన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు : ఇద్దరికి గాయాలు
ఇస్తాంబుల్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఇద్దరు ఎయిర్‌పోర్ట్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడు ఆర్థరాత్రి 2.00 గంటల ప్రాంతంలో పేలిందని పేర్కొన్నారు. ఈ పేలుడు కూతవేటు దూరంలో విమానం ఆగి ఉందన్నారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని... దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు.