ప్రయాణికుల్ని పిట్టల్లా కాల్చి.. పేల్చేసుకున్నారు
ఇస్తాంబుల్: ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్లో మరో 150 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బుల్లెట్ల వర్షం.. ఆపై మెరుపు లాంటి పేలుడు
భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
దేశాధినేతల అత్యవసర సమావేశం.. అంతర్జాతీయ సహకారానికి పిలుపు
ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో జరిగిన పేలుడులో ఇద్దరికి గాయాలైన సంగతి తెలిసిందే.