rajnath
-
అగ్ని, బ్రహ్మోస్‌లను చూసొద్దాం రండి
గచ్చిబౌలి: శత్రు దేశాల్లోని లక్ష్యాలను ఛేదించే అగ్ని, బ్రహ్మోస్ రకం క్షిపణులతోపాటు వివిధ యుద్ధట్యాంకులు, శతఘ్నులు, రాకెట్ లాంచర్లను దగ్గర నుంచి చూసే అవకాశం హైదరాబాద్‌వాసులకు లభించనుంది. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞాన్ వైభవ్–2025 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణరంగ ఆయుధాలు, విడిభాగాల ప్రదర్శన శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు.త్రివిధ దళాల అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఇస్రో, మిధాని, బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించిన ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలను విద్యార్థులు, సామాన్య ప్రజలు మూడు రోజులపాటు తిలకించవచ్చు. ఇందుకోసం 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది విద్యార్థులు ఈ వేడుకలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు డీఆర్ఎడీఎల్ డైరెక్టర్ జనరల్ (మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) రాజబాబు, డీఆర్డీఎల్ డైరెక్టర్æ జీఏ శ్రీనివాసమూర్తి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. అయితే తొలి రోజైన శుక్రవారం మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంటుందని, మార్చి 1, 2 తేదీల్లో విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు చూడవచ్చని తెలిపారు.యువతను ఆకర్షించే లక్ష్యంతో..: రక్షణ, ఏరోస్పేస్ టెక్నాలజీ రంగాల వైపు విద్యార్థులు, యువతను ఆకర్షించే లక్ష్యంతో డీఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో తొలిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. రక్షణరంగ పరిశ్రమలు ఎలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయన్న వివరాలను సైన్స్ డే ద్వారా విద్యార్థులకు వివరించనున్నాయి.ప్రదర్శనలోని క్షిపణులు ఇవే..అగ్ని–5: అణ్వస్త్ర సామర్థ్యంగల ఖండాంతర క్షిపణి. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.రుద్రం–3 : 550 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది.ప్రళయ్ : ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే క్షిపణి. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. బ్రహ్మోస్ : 10 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తూ 290 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనం చేసే సామర్థ్యం ఉంది.వరుణాస్త్ర : యుద్ధనౌకల నుంచి ప్రయోగించే యాంటీ సబ్‌మెరైన్ టోర్పెడో. సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. వీటితోపాటు ఎంబీటీ అర్జున్, నాగ్ రకానికి చెందిన యుద్ధట్యాంకర్లు, పలు శతఘ్నులు, రాకెట్ లాంచర్లు, తుపాకులు, వాటి విడిభాగాలను ప్రదర్శించనున్నారు.స్ఫూర్తి కలిగించేందుకే..కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా సైన్స్‌ను ప్రమోట్ చేస్తోంది. హైదరాబాద్‌లో రక్షణరంగ పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో తయారయ్యే యుద్ధ సామగ్రిని విద్యార్థులు తిలకిస్తే స్ఫూర్తి పొంది శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు మళ్లుతారని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో భారత్‌ను ఈ రంగంలో లీడర్‌గా తీర్చిదిద్దే ఆవిష్కరణలతో ముందుకొస్తారని భావిస్తున్నాం. అందుకే ఎప్పుడూలేని విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. –డాక్టర్ జి. సతీష్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియావికసిత్ భారత్ కోసంరక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు పెరిగితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. అందుకోసం విద్యార్థులు, పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. – యు.రాజబాబు, డైరెక్టర్ జనరల్, డీఆర్డీఎల్క్షిపణుల తయారీకి ఏఐ సాయంక్షిపణుల తయారీలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం. ఒకసారి తయారు చేసిన మిసైల్‌ను మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తాం. హైపర్సోనిక్ టెక్నాలజీలో రెండు నెలల క్రితం ఒక మిసైల్‌ను తయారు చేశాం. దాదాపు 20 ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. – జి.ఎ. శ్రీనివాసమూర్తి, డైరెక్టర్, డీఆర్డీఎల్ -
నేటి నుంచి ఏరో ఇండియా
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా’15వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదిక కానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యూ–57, అమెరికాకు చెందిన ఎఫ్–35 లైట్నింగ్ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వివరాలను ఆదివారం రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది. ఈ ఎడిషన్‌ను ‘ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’అనే ఇతివృత్తంతో చేపట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది . ఇందులో 90 వరకు దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని వివరించింది. సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపింది. -
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ
మాస్కో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వామ్య పక్షాలకు చట్టబద్ధంగా కలిగే ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, అన్ని దేశాలకు మంచి జరిగేలా, పటిష్టమైన కొత్త ప్రపంచం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఉండాలని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్ స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలు కాపాడాలి : వాంగ్ యీ రష్మా, భారత్, చైనా కలసికట్టుగా సమస్యాత్మక అంశాలను ఎదుర్కోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. 3 దేశాల సంబంధాల పరిరక్షణ కోసం అన్నిదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యహరించాలన్నారు. మహాత్ముడికి రాజ్‌నాథ్ నివాళులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాస్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్‌నాథ్.. చైనా రక్షణమంత్రి వీ ఫెంగ్‌తో సమావేశం కావడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే 11 దేశాల సైనిక బలగాల పెరేడ్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి..
రాజ్‌నాథ్‌ను కోరిన వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై..గత ఆరు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రజకుల సమస్యలను వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, అయితే తెలుగు రాష్ట్రాలతోపాటు 14 రాష్ట్రాల్లో వారిని ఎస్సీ జాబితాలో చేర్చలేదన్నారు. 1985 మే 28న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ పంపిందన్నారు. అప్పట్లో దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రజకుల్ని ఎస్సీల జాబితాలో చేర్చితేనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయన్నారు. సమాజంలో సామాజిక అన్యాయానికి గురవుతున్న కమ్యూనిటీల్లో రజకులు ఒకరని తెలిపారు. 13 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో వారిని ఆ జాబితాలో చేర్చకపోవడం అధికరణ 14, 15, 16 ప్రకారం వివక్ష చూపడమేగాక రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకొని రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సుబ్బారెడ్డి కోరారు. -
మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం
8న నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో భేటీ ► కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి ► ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న మావోయిస్టుల తాజా దాడిని కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెను సవాలుగా తీసుకున్నాయి. సరికొత్త వ్యూహంతో మావోయిస్టులను గట్టి ఎదురుదెబ్బ తీస్తామని ప్రకటించాయి. మావోయిస్టులపై చేస్తున్న పోరాట వ్యూహాన్ని పునఃసమీక్షిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలించడానికి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలన్నింటితో వచ్చే నెల 8న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని, ఇందులో వ్యూహాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నాటి మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్లకు ఆయన మంగళవారం మానా క్యాంపులో నివాళి అర్పించారు. రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, పలువురు పారామిలటరీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మావోయిస్టులు నిరాశా నిస్పృహలతో, పిరికితనంతో పాశవిక దాడికి పాల్పడ్డారని, దీన్ని సవాలుగా స్వీకరిస్తున్నామని రాజ్‌నాథ్ విలేకర్లతో పేర్కొన్నారు. ‘మా సాహస జవాన్ల త్యాగాలు వృథాకావు. వామపక్ష తీవ్రవాద సంస్థలు అభివృద్ధికి వ్యతిరేకం. రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడానికి యత్నిస్తున్నాయి.. మావోయిస్టులు బస్తర్‌లో రోడ్ల అభివృద్ధిని సహించలేకపోతున్నారు. గిరిజనులను మానవ రక్షక కవచాలుగా వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో నక్సల్స్ నిరోధక ఆపరేషన్లను మరింత పటిష్టంగా, శక్తిమంతంగా నిర్వహిస్తామని రమణ్ సింగ్ తెలిపారు. ‘సుక్మాలో నక్సల్స్‌పై పోరు దేశంలోనే వామపక్ష తీవ్రవాదంపై పెద్ద పోరాటం. ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను, నిర్మాణ పనులను విస్తృతం చేస్తాం’ అని చెప్పారు. అనంతరం రాజ్‌నాథ్, సీఎంలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. కాగా, దాడిలో చనిపోయిన తమ రాష్ట్ర జవాన్లకు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షలు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 5 లక్షలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షలు, పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఇద్దరు హరియాణా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంది. ఛత్తీస్‌గఢ్‌లోనే ఉండండి మావోయిస్టు నిరోధక ఆపరేషన్ల సమన్వయం కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఉండాలని సీఆర్పీఎఫ్ తాత్కాలిక అధిపతి సుదీప్ లఖ్తాకియా, హోం శాఖలోని సీనియర్ సలహాదారు కే.ఆర్ విజయ్‌కుమార్‌లను రాజ్‌నాథ్ ఆదేశించారు. దాడుల్లో నష్టపోతున్న సీఆర్పీఎఫ్ పనితీరుపై అసంతృప్తితో ఆయన ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయుధాల కొరత, నిఘా సమాచార లేమి వంటి సమస్యలను అధిగమించాలని ఆయన బలగానికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా దాడిలో పాల్గొన్న మావోయిస్టుల లక్ష్యంగా చేపట్టనున్న భారీ ఆపరేషన్ పూర్తయ్యేవరకు ఈ ఇద్దరు అధికారులు రాష్ట్రంలోనే ఉంటారని వెల్లడించాయి. భేటీకి ఏపీ, తెలంగాణ సీఎంలు మే నెల 8న ఢిల్లీలో జరిగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పారామిలటరీ దళాల అధిపతులు కూడా భేటీలో పాల్గొంటారని వెల్లడించారు. నక్సల్స్‌తో రమణ్‌సింగ్ ఒప్పందం: దిగ్విజయ్ ఛత్తీస్ సీఎం రమణ్ సింగ్, ఇతర బీజేపీ నేతలకు నక్సల్స్‌తో బేరసారాల ఒప్పందముందని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ‘రమణ్, బీజేపీ నేతలంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచే ఎన్నికల్లో గెలిచారు. వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి’ అని అన్నారు. 22 ఆయుధాలు అపహరించిన మావోలు చింతూరు (రంపచోడవరం): ఘటనా స్థలం నుంచి మావోలు మొత్తం 22 అత్యాధునిక ఆయుధాలను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. వీటిలో 12 ఏకే 47లు, 4 ఏకేఎం రైఫిళ్లు , రెండు ఇన్సాస్ ఎల్ఎంజీలు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, 5 వైర్లెస్ సెట్లు, రెండు బైనాక్యులర్లు, 22 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయని, వీటితోపాటు 2820 ఏకే47, ఏకేఎం బుల్లెట్లు, 600 ఇన్సాస్ బుల్లెట్లు, 62 యూబీజీఎల్ బుల్లెట్లను సైతం తీసుకెళ్లారని తెలిపారు. దాడి చేసిన వారిలో 70 శాతం మహిళలే సుక్మా జిల్లాలోని కాలాపత్తర్‌లో సోమవారం సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారని ఘటనలో గాయపడిన జవాన్ ఒకరు తెలిపారు. దాడి తర్వాత మృతిచెందిన జవాన్ల తుపాకులను మహిళా మావోలే తీసుకెళ్లారని మరో జవాన్ చెప్పారు. నల్లదుస్తులు ధరించిన 300 మంది మావోలు దాడికి పాల్పడ్డారని, వారిలో కొందరి వద్ద రాకెట్ లాంచర్లు ఉన్నాయన్నారు. భోజనాలు చేస్తుండగా..: కాలాపత్తర్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు రక్షణ కోసం వెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేస్తుండగా మావోలు చుట్టుముట్టి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ‘మావోయిస్టులు స్థానికుల సాయంతో జవాన్ల కదలికలను పసిగట్టారు. ఒక టీంలోని 36 మంది జవాన్లు భోజనాలకు కూర్చోగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు విరుచుకుపడి అధునాతన ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించారు’ అని చెప్పారు. గస్తీ కాస్తున్న జవాన్లు దీటుగా కాల్పులు జరిపి, సమీపంలోని 40 మంది పౌరులు, నిర్మాణ కార్మికుల ప్రాణాలను కాపాడగలిగారు’ అని తెలిపారు. -
సుక్మా ఘటనపై రాజ్‌నాథ్ దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిలో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ హోంమంత్రితో రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. Extremely pained to know about the killing of CRPF personnel in Sukma. My tributes to the martyrs and condolences to their families. 1/2 — Rajnath Singh (@rajnathsingh) 24 April 2017 సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి పిరికిపందల చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, జవాన్ల త్యాగం వృథాగా పోనివ్వమని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. We are proud of the valour of our @crpfindia personnel. The sacrifice of the martyrs will not go in vain. Condolences to their families. — Narendra Modi (@narendramodi) 24 April 2017 కాగా బుర్కాపాల్- చింతగుఫ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు ఆకస్మాత్తుగా రెండువైపులా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 26 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడి ఘటనలో సుమారు 300మంది మావోయిస్టులు పాల్గొన్నారని గాయపడ్డ పీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. తాము 150 మందిమి ఉన్నామని, ఒక్కసారిగా తమపై దాడికి దిగారన్నారు. తాము కూడా ఎదురు దాడి చేశామని, మావోయిస్టులు కూడా గాయపడినట్లు తెలిపారు. కాగా ఓ కమాండర్ తో పాటు ఆరుగురు జావాన్ల జాడ తెలియాల్సి ఉంది. ఇక దాడి ఘటన అనంతరం మావోయిస్టులు 30 వరకు ఆయుధాలను ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వెంటనే హెలీకాప్టర్ ను పంపించి క్షతగాత్రులను రాయిపూర్‌లోని బాలాజీ, నారాయణ ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
'కశ్మీరీలకు భద్రత కల్పించండి'
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా నివసిస్తున్న కశ్మీరీల భద్రతను కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కశ్మీరీలను వేధిస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఓ అడ్వైజరీ పంపినట్లు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీలతో కొందరు తప్పుగా ప్రవర్తించారనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సైన్యంపై రాళ్లు రువ్వడంపై ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు ఎదురయ్యాయనే రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
యూపీ సీఎం రేసులో నేను లేను: కీలక నేత స్పష్టీకరణ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోనుండగా.. రేసులో కీలకంగా ఉన్న పలువురు నేతల మధ్య పోటీ తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగిఆదిత్యానాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లు కాకుండా పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న మనోజ్ సిన్హా తాజాగా స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనేలేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తాయని, తాను రేసులో ముందున్నాననని, తనకే అవకాశం వస్తుందంటూ జాతీయ మీడియా అనవసర కథనాలు వండి వారుస్తున్నదని ఆయన తప్పుబట్టారు. మరోవైపు యూపీ సీఎం రేసు హీటెక్కింది. తమ నాయకుడికే సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ ఇటు కేశవ్ ప్రసాద్ మౌర్య, అటు యోగి ఆదిత్యానాథ్ మద్దతుదారులు లక్నోలో రోడెక్కి బలప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. మౌర్య శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మంతనాలు జరిపారు. సీఎం ఎంపికపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య, ఇతర అధిష్ఠాన నేతలు ఇప్పటికే లక్నో చేరుకున్నారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకారం ఉండనుంది. -
కౌన్ బనేగా యూపీ సీఎం!
-
కౌన్ బనేగా యూపీ సీఎం!
రేసులో ముగ్గురి పేర్లు పూజలు చేసిన మనోజ్ సిన్హా మీడియా కథనాలు అవాస్తవమన్న వెంకయ్య న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరు తేలిపోనుందని.. బీజేపీ స్పష్టం చేసినప్పటికీ.. రేసులో పలువురి పేర్లు వినిపిస్తుండటంతో ఎవరు సీఎం అవుతారన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగి ఆదిత్యానాథ్ పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినబడుతున్నా.. పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని మౌర్య స్పష్టం చేశారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. మనోజ్ సిన్హా పూజలు! యూపీ సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న సీనియర్ నేత, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా శనివారం కాల భైరవ, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికే సీఎం రేసు నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ తప్పుకున్నారని, మౌర్య కూడా రేసులో ప్రధానంగా లేరని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మచ్చలేని వ్యక్తిత్వం, పాలన అనుభవం గల నేతగా పేరొందిన సిన్హాకు యూపీ అందలం దక్కవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రం యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకుంటారని చెప్పారు. సీఎం రేసులో పలువురు ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. -
నేడు యూపీ సీఎం ఎంపిక
ఆదివారం సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినబడుతున్నా.. తుది ఎంపికపై స్పష్టత రాలేదు. శనివారం లక్నోలో కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. ‘శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం ఎవరో తెలిసిపోతుంది’ అని అన్నారు. మార్చి 19 ఆదివారం పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. మీడియా దృష్టిని మళ్లించేందుకేనా? ‘యూపీ కొత్త సీఎం, కేబినెట్ సహచరులతో కలిసి 19 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణం చేయనున్నారు’ అని లక్నోలో గవర్నర్ రామ్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, మీడియా దృష్టిని పక్కదారి పట్టించేందుకే సీఎం ఎంపిక బాధ్యతను మౌర్యకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారని భావిస్తున్నారు. అటు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తను సీఎం రేసులో లేనని ప్రకటించారు. పాలనలో అనుభవం ఉండటంతోపాటు.. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీని ‘మిషన్ 2019’ మోడ్‌లో నడిపే సత్తా కేవలం రాజ్‌నాథ్ ఒక్కరికే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. యూపీ రైతుల రుణాల మాఫీ ఉత్తరప్రదేశ్‌లో కొలువదీరనున్న బీజేపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఈ అంశాన్ని చేర్చిందని.. దీనికి అనుగుణంగానే రుణమాఫీ జరుగుతుందన్నారు. -
మూడో విడత 61% పోలింగ్
యూపీలో ఓటేసిన రాజ్‌నాథ్, అఖిలేశ్, మాయావతి లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో విడతలో 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పుంజుకొంది. ఈ స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 59.96 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 58.43 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 55 స్థానాలను, బీఎస్పీ ఆరు, బీజేపీ ఐదు, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఓటేసిన ప్రముఖులు కాగా మూడో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బహుజనన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆశాభావం ఈ సందర్భంగా ప్రధాన పక్షాలన్నీ అధికారం తమదేనని ఘంటాపథంగా చెప్పాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ‘బీఎస్పీ 300 సీట్లను సాధించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యూపీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికే ప్రజలు పట్టం కడతారని ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. అఖిలేశే మళ్లీ సీఎం: ములాయం యూపీకి అఖిలేశ్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ గాంధీలు ఎవరికి ఓటేశారో! యూపీ మూడో దశ పోలింగ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు ఓటేశారు. వీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారులు కాదులెండి. లక్నోలోని ఓ కుటుంబంలోనూ రాజీవ్ గాంధీ (46), సంజయ్ గాంధీ (45), సోనియా గాంధీ (40)లు ఉన్నారు. రాజీవ్, సంజయ్‌లు అన్నదమ్ములు కాగా, సోనియా మాత్రం ఇక్కడ సంజయ్ భార్య. మరి ఈ గాంధీలను ఎవరికి ఓటేశారని అడగ్గా బయటకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
మాటల్లేవ్.. ఇక చేతలే!
• ఐఏఎఫ్ చీఫ్ రాహా వ్యాఖ్య ‘వసుధైక కుటుంబకం’ మా నినాదం: రాజ్‌నాథ్ • భద్రతపై సమీక్ష.. సైనికులకు మౌలిక వసతుల కల్పన వేగవంతం ఘజియాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్త వాతావరణంపై ఇకపై ఆర్మీ మాట్లాడటమేమీ ఉండదని.. చేతల్లోనే సమాధానం ఉంటుందని వైమానిక దళం చీఫ్ అరుప్ రాహా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులకైనా సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ జిల్లాలోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శనివారం ‘వైమానిక దళ 84వ వ్యవస్థాపక దినోత్సవం’ ఆయన మాట్లాడారు. ‘సర్జికల్ దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందరూ అభిప్రాయాలు చెబుతున్నారు. దేశం ఏం కోరుకుంటోందో దాన్ని నిర్వహించటం ఆర్మీ పని. మేం దీని గురించి మాట్లాడదలచుకోవటం లేదు. కేవలం చేతల్లో చూపిస్తాం’ అని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో భారత వైమానిక దళం సిద్ధంగా ఉందని.. ఎయిర్ వారియర్స్ విన్యాసాల ద్వారా గగనతలంలో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసుకున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను ఆర్మీ నిర్వీర్యం చేస్తోందని.. ప్రతి ఘటన తర్వాత గుణపాఠాలు నేర్చుకుంటున్నామని రాహా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతీయ వైమానిక దళం ఫేస్బుక్ పేజీ ‘పవర్ టు పనిష్’ను ఆయన ప్రారంభించారు. రాజ్‌నాథ్ ‘సరిహద్దు’ సమీక్ష సర్జికల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దుల్లో భద్రతను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. రాజస్తాన్‌లోని మునాబావో సరిహద్దు ఔట్‌పోస్టును సందర్శించారు. ‘భారత్ ఎప్పుడూ ఒకరిపై యుద్ధం చేయదు. కానీ, తనపై ఎవరైనా దాడిచేస్తే దీటైన జవాబిస్తుంది’ అని తెలిపారు. సరిహద్దుల్లో భద్రతాపోస్టుల్లో కంచె నిర్మాణం, ఫ్లడ్‌లైట్లు, సైనికులకు సౌకర్యాలతోపాటు ఇతర మౌలికవసతుల కల్పనను ప్రాధాన్యతతో పూర్తిచేస్తామని సైనికులకు తెలిపారు. ‘వసుధైక కుటుంబకం’ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. సరిహద్దుల్లో సైనికుల కోసం మరిన్ని మొబైల్ టవర్ల ఏర్పాటుతోపాటు.. శాటిలైట్ ఫోన్లను కూడా పెంచనున్నట్లు తెలిపారు. జవాన్లతో కాసేపు ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. మళ్లీ భగ్గుమన్న కశ్మీర్ లోయలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తమైంది. పెల్లెట్ గాయాలతో ఓ బాలుడు మృతి చెందటంతో.. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు. సఫకదల్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో జునైద్ అఖూన్ అనే బాలుడికి తల, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ.. జునైద్ మరణించటంతో.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. అయితే ఘర్షణలోనే బాలుడు మృతిచెందాడని పోలీసులంటుంటే.. పెల్లట్లు తగిలే చనిపోయాడని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వ్యాపారాలు, ఆస్తులు లేవు పాక్ ప్రధాని షరీఫ్ కుటుంబ సభ్యులు లాహోర్: భారత్‌లో తమ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు, ఆస్తులు లేవని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు భారత్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఈ మేరకు షరీఫ్ కుటుంబ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని కుమారునికి భారత్‌లో సొంత వ్యాపారాలు కానీ, వ్యాపారాల్లో భాగస్వామ్యం కానీ లేదని తెలిపారు. మోదీ సర్కారతో సంబంధాల పురోగతికి అవకాశం తక్కువే: అజీజ్ మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం పాకిస్తాన్‌కు లేదని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. -
మైనారిటీ గురుకులాలకు 500 కోట్లివ్వండి
కేంద్ర మైనారిటీ శాఖ మంత్రిని కోరిన ఈటల - కేంద్ర మంత్రులతో ఈటల వరుస భేటీలు - పీడీస్ రైస్ నిధులను విడుదల చేయాలని పాశ్వాన్‌కు విజ్ఞప్తి - ఎన్సీడీసీ కింద రూ. 600 కోట్లు ఇవ్వాలని రాధామోహన్ సింగ్‌కు వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో అదనంగా ఏర్పాటు చేయనున్న మైనారిటీ గురుకులాలకు రూ. 500 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్బాస్ నఖ్వీని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అలాగే రాష్ట్రం నుంచి హజ్ కోటాను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఈటల వివిధ శాఖల మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీతో సమావేశమై మైనారిటీల కోసం అమలు చేస్తున్న పథకాల అమలుకు కేంద్రం సాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపడుతున్న వివిధ పథకాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఆయా పథకాల అమలుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అభినందనీయమన్నారు. వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. గురుకులాల నిర్మాణానికి సంబంధించి రూ. 140 కోట్లు విడుదల చేసిన ట్లు చెప్పారు. మంత్రి ఈటల ఆహ్వానం మేరకు ఈ పథకాల అమలు తీరును పరిశీలించడానికి త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న కేంద్రియ విద్యాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. సీబీఎస్ఈ సిలబస్‌తో ఒక్కొక్క స్కూల్లో 400 నుంచి 600 మంది విద్యార్థులు విద్యనభ్యసించే విధంగా ఈ విద్యాసంవత్సరం నుంచే 71 మైనారిటీ గురకులాలను ఏర్పాటు చేశామన్నారు. 120 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మిగిలినవి ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికి కేంద్ర సాయంగా రూ. 500 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఈటల తెలిపారు. ప్రతి ఏడాది మైనారిటీ గురుకులాలకు నిర్వహణ ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,180 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. అందువల్ల మైనారిటీ గురుకులాల భవనాల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని అబ్బాస్ నఖ్వీకి విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. స్వయంఉపాధి కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు తీసుకుంటున్న మైనారిటీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఈటల పేర్కొన్నారు. విదేశాల్లో చదవాలనుకొనే విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అందువ ల్ల మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం తగిన సాయం చేయాలని ఈటల కోరారు. తగిన చర్యలు చేపట్టండి ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రూ. 450 కోట్లు అవసరమవుతాయని, ఈ మేరకు నష్టం అంచనా నివేదిక ఇటీవలే కేంద్ర హోం శాఖమంత్రి రాజ్‌నాథ్‌కు సమర్పించామని.. ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కోరామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీనీ వరంగల్, కరీం నగర్‌లకు విస్తరించేందుకు కేంద్రం సాయం చేయాలని, కరీంగనర్‌లో ఇంక్యుబెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరగా తోమర్ సానుకూలంగా స్పందిం చారన్నారు. ఐసీడీఎస్ కేంద్రాలలో పిల్లలకు రోజు వారీ ఖర్చుల కింద ఇచ్చే డబ్బును రూ. 15కు పెంచాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలసి విజ్ఞప్తి చేశామని ఈటల తెలిపారు. తెలంగాణలో ఐసీడీఎస్ కేంద్రాలను అద్దె భవనాల్లో నడపాల్సిన పరిస్థితి ఉందని, ఐదు వేల ఐసీడీఎస్ భవనాల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని ఆమెను కోరామని చెప్పారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పం దించారన్నారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ ఉన్నారు. ఎన్సీడీసీ కింద రుణాలను పెంచండి.. తెలంగాణలో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) కింద మహిళా సంఘాలకు మొదట రూ. 400 కోట్ల రుణా లివ్వాలని నిర్ణయిం చామని, దీనికి అదనంగా రూ. 600 కోట్లను విడుదల చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కోరామన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ ఇండస్ట్రీ కింద విద్యుత్ సబ్సిడీకి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం తన వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. పాల ఉత్పత్తి రంగాన్ని, మేకలు, గొర్రెలకు సంబంధించి ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పీడీఎస్ రైస్ నిధులను విడుదల చేయండి కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో భేటీ అయిన ఈటల తెలంగాణకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రైస్ కింద రావాల్సిన రూ. 1,640 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలకు నిలయంగా ఉన్న తెలంగాణకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6,400 మెట్రిక్ టన్నుల బియ్యానికి అదనంగా 2,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈటల తెలిపారు. -
చర్చలతోనే పరిష్కారం
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం కావాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం సూచించింది. రెండ్రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన బృందం సభ్యులు సమావేశమయ్యారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనే చర్యలతోపాటు.. ప్రజల్లో విశ్వాసం కల్పించేలా కార్యాచరణ ప్రారంభించాలని సభ్యులు సూచించారు. దీంతోపాటు పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కూడా పలువురు సభ్యులు తెలిపారు. కశ్మీరీ ప్రజలు కూడా హింసను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి హింసకు తావుండకూడదని.. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తున్నట్లు తాము విశ్వస్తిన్నామన్నారు. దీనిపై అఖిలపక్షానికి నాయకత్వం వహించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. లోయలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు భారత సార్వభౌమత్వానికి ఇబ్బంది కలగకుండానే చర్యలు చేపడతామన్నారు. సమావేశం తీర్మానాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలు జరపాలని అఖిలపక్షం చేసిన సూచనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే.. హురియత్ నేతల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కాగా, సమావేశంలో అన్ని పక్షాలు చర్చల విషయంపై ఏకాభిప్రాయానికి రాగా.. వామపక్ష పార్టీలు మాత్రం పాకిస్తాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని ప్రతిపాదించాయి. కాగా, కశ్మీర్లో పరిస్థితిని అదుపుచేయటంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మజ్లిస్ ఎంపీ ఒవైసీ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేని నిజనిర్ధారణ కమిటీని మరోసారి కశ్మీర్‌కు పంపి ప్రజలతో మాట్లాడిస్తే.. సమస్యకు పరిష్కారం దొరకొచ్చన్నారు. కొండను తవ్వి.. కశ్మీర్లో అఖిలపక్షం పర్యటించటం ద్వారా లాభమేమీ జరగలేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో అఖిలపక్షం పర్యటన ద్వారా ఒక చిన్న మంచి విషయాన్ని కూడా సాధించినట్లు నాకు అనిపించటం లేదు. వివిధ పార్టీలు కశ్మీర్‌కు రాకుండా కూడా ఓ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు. అనవసరంగా అక్కడ పర్యటన పేరుతో డబ్బులు, సమయం వృథా అయ్యేవి కావు’ అని ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్యకు భాగస్వామ్య పక్షాల(వేర్పాటువాదులు)తో సమావేశం కావటం కీలకమైన పరిణామమని సీపీఎం నేత తరిగామి తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే సీనియర్ ఎంపీలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కశ్మీర్లో మళ్లీ అల్లర్లు.. అఖిలపక్షం పర్యటన సందర్భంగా రెండ్రోజుల పాటు శాంతిగా కనిపించిన లోయలో మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజా గొడవల్లో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కశ్మీర్లో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. శ్రీనగర్ తప్ప మిగిలిన ప్రాంతాల్లోనే గొడవలు జరిగాయి. కాగా, శ్రీనగర్‌లో సాయంత్రం ఆరునుంచి 12 గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేశారు. -
కల్లోల కశ్మీర్‌ను చక్కదిద్దేందుకు
సీఎంతో అఖిలపక్షం చర్చలు - పరిష్కారంపై ఆశాభావం - ఆహ్వానాన్ని తిరస్కరించిన వేర్పాటువాదులు శ్రీనగర్: కశ్మీర్లో అశాంతియుత పరిస్థితులను చక్కదిద్దడం ధ్యేయంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలోని అఖిలపక్ష బృందం రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటన ఆదివారం ప్రారంభమైంది. 26 మంది సభ్యులతో కూడిన ఈ బృందం శ్రీనగర్ చేరుకున్న వెంటనే సీఎం మెహబూబాతో సమావేశమైంది. కశ్మీర్‌లోయలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించింది. అఖిలపక్ష బృందంలోని నేతలందరూ మాట్లాడుతూ.. లోయలో శాంతిని పునరుద్ధరించేందుకు పరిష్కారాన్ని కనుగొనగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యామంత్రి, రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి నయీం అక్తర్ మాట్లాడుతూ.. సంబంధిత పక్షాలన్నీ చర్చల ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత ఆజాద్ మాట్లాడుతూ అఖిలపక్ష బృందం పర్యటన కశ్మీర్‌కు, దేశానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింసాత్మక అల్లర్లు కొనసాగుతుండడం తెలిసిందే. ఇప్పటివరకు 71 మంది మరణించగా, భారీసంఖ్యలో గాయపడ్డారు. చర్చలకు వేర్పాటువాదుల తిరస్కారం అఖిలపక్షంతో సమావేశమవ్వాలన్న సీఎం మెహబూబా ముఫ్తీ ఆహ్వానాన్ని వేర్పాటువాదులు తిరస్కరించారు. తాజా చర్చల ప్రక్రియను ఏమార్చే ప్రయత్నంగా దీన్ని వారు అభివర్ణించారు. మరోవైపు వేర్పాటువాద నేతలను కలుసుకునేందుకు అఖిలపక్ష బృందంలోని పలువురు సభ్యులు విడిగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. 60 రోజులుగా గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీని కలిసేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత జయప్రకాశ్ నారాయణ్‌లు ఆయనింటికి వెళ్లగా కనీసం గేటు కూడా తీయలేదు. కాగా, అఖిలపక్షం పర్యటన సందర్భంగా ఆదివారం కశ్మీర్లో జరిగిన అల్లర్లలో 200 మంది గాయపడ్డారు. -
వీర జవాన్లే శ్రీరామ రక్ష: రాజ్‌నాథ్
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రేమించి, అభిమానించే వీర జవాన్ల ముందు ఏ ఉగ్రవాదం, తీవ్రవాదం ఏం చేయలేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. వీర జవాన్ల ధైర్యసాహసాలే భారత మాతకు శ్రీరామ రక్షన్నారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రాంగణాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతో కలసి శుక్రవారం ఆయన సందర్శించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ధైర్యసాహసాలకు మారుపేరు గ్రేహౌండ్స్ బలగాలన్నారు. మావోయిస్టులు, దేశ విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశ సమైక్యతా సమగ్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం... పోలీసులకు కావాల్సిన సౌకర్యాలను, అధికారాలను, స్వేచ్ఛను ఇచ్చిందని నాయిని వివరించారు. 1989లో నాటి డీఐజీ కె.ఎస్.వ్యాస్ స్థాపించిన గ్రేహౌండ్స్... ఈ రోజు దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థగా ఏర్పడిందని అనురాగ్‌శర్మ అన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఇక్కడి గ్రేహౌండ్స్‌లో శిక్షణకు వస్తుంటారని, రాష్ట్రంలో కొత్తగా రిక్రూట్ అయిన ప్రతి పోలీస్ ఆఫీసర్ తప్పనిసరిగా గ్రేహౌండ్స్‌లో కొంత కాలం పనిచేయాల్సిందేనన్నారు. జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కాశ్మీర్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా..
-
గోరక్షణ సంస్థలను నిషేధించాలి
లోక్‌సభలో విపక్ష సభ్యుల డిమాండ్ * దళితులపై దాడుల అంశంపై దిగువసభలో చర్చ * దళితులు భయాందోళనల్లో బతుకుతున్నారు: కాంగ్రెస్ * దళితులపై దాడులకు వ్యవస్థే కారణం.. ఏ ఒక్కరో కాదు: బీజేపీ న్యూఢిల్లీ: దేశంలో దళితులపై అత్యాచారాల ఘటనలు పెరుగుతుండటాన్ని నిరోధించటంలో కేంద్రం విఫలమైందని లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఎస్సీలు, ఎస్టీలు తీవ్ర భయాందోళనల్లో బతుకుతున్నారంటూ.. మతతత్వ గో పరిరక్షక సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల అంశంపై సీపీఎం సభ్యుడు పి.కె.బిజు గురువారం సభలో చర్చను ప్రారంభిస్తూ.. దేశవ్యాప్తంగా దళితుల దీన పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ‘ప్రతి రోజూ ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతి 18 నిమిషాలకూ దళితులపై ఒక నేరం జరుగుతోంది. ఈ వర్గానికి చెందిన వారిలో 37.8 శాతం మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో వేరేగా కూర్చుంటున్నారు. దళితుల్లో 24.5 శాతం కన్నా ఎక్కువ మందిని పోలీస్ స్టేషన్లలో ప్రవేశించటానికి అనుమతించటం లేదు’ అని వివరించారు. గో పరిరక్షణ సంఘాలను దేశమంతటా నిషేధించాలన్నారు. దళితులు తీవ్ర భయం, అభద్రతా భావనలతో జీవిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు హెచ్‌కే మునియప్ప ఆందోళన వ్యక్తంచేశారు. ‘వారికి తమను రక్షించటానికి సంబంధించి కాంగ్రెస్‌పై నమ్మకముండేది.. కానీ బీజేపీపై నమ్మకం లేదు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీలకు రక్షణ అవసరం ఉండేది కాదు. వాజపేయి ఉన్నప్పుడు అటువంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్లో దళితులపై దాడులు చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి పెరిగాయని, మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇలాంటివి 14,500 కేసులు నమోదయ్యాయన్నారు. వీహెచ్‌పీని, గో పరిరక్షణ పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు చేస్తున్న గో రక్షా దళ్ సంస్థలను నిషేధించాలని తృణమూల్ సభ్యుడు సౌగతారాయ్ కోరారు. అధికార బీజేపీ సభ్యుడు ఉదిత్‌రాజ్ తమ పార్టీపై విమర్శలను తిప్పికొడుతూ.. దళితులపై దాడులకు ఏ ఒక్కరూ కారణం కాదని.. వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటుండటం వల్ల దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లవుతోందన్నారు. ఈ చర్చ బీజేపీ, కాంగ్రెస్ లేదా బీజేడీల మధ్య యుద్ధంలా మారకూడదన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పాలనలో ఉత్తరప్రదేశ్‌లో దళితులపై పలు దాడులు జరిగాయని.. పదోన్నతుల్లో రిజర్వేషన్ విధానాన్ని సమర్థించేందుకు ఆమె ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టులో ఏమీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి: రాజ్‌నాథ్ కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు గో పరిరక్షణ వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని.. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వికృత మనస్తత్వంపై అంతా ఐక్యంగా పోరాడాలని పార్టీలకు పిలుపునిచ్చారు. ఆయన చర్చకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడుల ఘటనలు తగ్గాయన్నారు. దళితులపై దాడులకు సంబంధించి 2013లో 39,346 కేసులు నమోదైతే.. 2014లో 40,300 కేసులు నమోదయ్యాయని.. అవి 2015లో 38,564కు తగ్గాయని పేర్కొన్నారు. అయితే దళితులపై దాడులు కొనసాగుతున్నాయన్న విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుందంటూ.. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ అంశంపై సభలో చర్చించాల్సి రావటం విచారకరమన్నారు. దళితులపై దాడుల విషయంలో ప్రధాని మోదీ చాలా కాలం వరకూ ఎందుకు మాట్లాడలేదని విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు బదులుగా.. 1947 నుంచి గత ప్రధానమంత్రులు ప్రతి ఒక్క అంశంపైనా మాట్లాడారా అన్నది విపక్షాలు చెప్పాలన్నారు. ‘ఈ ముసాయిదాను చెత్తబుట్టలో వేయండి’ న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను మతపూరితం చేయటానికి, వాణిజ్యపూరితం చేయటానికి ప్రభుత్వం యత్నిస్తోందని.. తన సిద్ధాంతాలను విద్యా రంగంపై రుద్దుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా జాతీయ విద్యా విధానాన్ని చెత్తగా కొట్టివేస్తూ.. దానిని చెత్త బుట్టలో పడవేయాలని కాంగ్రెస్, వామపక్షాలు వ్యాఖ్యానించాయి. తమను కూడా విశ్వాసంలోకి తీసుకుంటూ మళ్లీ కొత్త విధానాన్ని రూపొందించాలని చెప్పాయి. ముసాయిదాలో ఏ దిశానిర్దేశనమూ లేదని.. నాణ్యత, అందుబాటు, సమానత అనే మూడు ముఖ్యమైన అంశాల గురించి అందులో ఏ ప్రస్తావనా లేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. ముసాయిదా విధానంపై పార్లమెంటు సభ్యుల సూచనలను తీసుకోవటానికి ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. -
ఉగ్రవాది అమరుడు కాలేడు
• ఆ విషయం పాక్‌కు చెప్పాం: పార్లమెంటులో రాజ్‌నాథ్ వెల్లడి • ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు వివరాలపై ప్రకటన • పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదని విమర్శ న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఉదంతం నేపథ్యంలో.. ఒక దేశంలో ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి మరో దేశానికి అమరవీరుడు కాలేడని పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులను కీర్తించడం, ప్రోత్సహించడం మానుకోవాలని సార్క్ దేశాలను కోరినట్టు చెప్పారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశానికి తాను హాజరైన అంశంపై రాజ్‌నాథ్ శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో సుమోటోగా ప్రకటన చేశారు. బుర్హాన్‌ను అమరవీరుడిగా, దేశ భక్తుడిగా పాక్ కీర్తించటం.. దానిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తించటం తగదని పాక్‌కు చెప్పినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. సార్క్ సదస్సులో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనుషుల క్రయవిక్రయాల అంశాలపై చర్చించారని, చాలా దేశాలు అన్ని రూపాల ఉగ్రవాదాన్నీ ఖండించాయని చెప్పారు. నేర విషయాలపై సహకారానికి సంబంధించి సార్క్ సదస్సు తీర్మానాన్ని పాక్ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై త్వరలో చర్యలు చేపడతామని పాక్ చెప్పిందని.. ఆ ‘త్వరలో’ అనేది నిజంగానే త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఉగ్రవాదం పట్ల మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అంటూ వివక్ష చూపొద్దన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న లేదా మద్దతిస్తున్న రాజ్య, రాజ్యేతర శక్తులపై అన్ని సమర్థవంతమైన చర్యలూ చేపట్టటం అవసరమన్నారు. ఉగ్రవాదులపై ప్రపంచ సమాజం విధించిన ఆంక్షలు, నిషేధాలను గౌరవించాలని సార్క్ మంత్రులకు తాను సూచించినట్లు చెప్పారు. అలాగే.. ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ మెరుగుదల కోసం నిఫుణుల కమిటీ భేటీని ఈ ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. విందు కోసం వెళ్లలేదు.. పాక్ హోమంత్రి సార్క్ సదస్సుకు వచ్చిన అందరినీ విందుకు పిలిచిన మాట వాస్తమే అని.. తర్వాత ఆయన తన కారులో వెళ్లిపోవడంతో తానూ వెళ్లిపోయానని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదన్నారు. అయితే విందు కోసం ఆ దేశానికి వెళ్లలేదంటూ దీనిపై ఫిర్యాదు చేయదలచుకోలేదని చెప్పారు. దీంతో సభ్యులు బల్లలపై చరుస్తూ మద్దతు తెలిపారు. సదస్సులో తాను ప్రసంగిస్తుండగా భారత మీడియాను అనుమతించలేదన్న ఎంపీల ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ఆ అది లైవ్ టెలికాస్టా, కాదా.. అనేది తెలియదు. అయితే ఆ సమయంలో దూరదర్శన్, పీటీఐ, ఏఎన్ఐ ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదనేది వాస్తవం’ అని చెప్పారు. -
రాజనాథ్ పాక్ పర్యటనపై టెన్షన్ టెన్షన్!
లాహోర్: పాకిస్తాన్లో జరగనున్న సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు ఉద్దేశించిన కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన తీవ్ర ఉత్కంఠత రేపుతోంది. ఓ వైపు.. రాజ్‌నాథ్ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలాహుద్దీన్, మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని జమాత్-ఉద్-దావా చిఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి భద్రతకు సంబంధించిన బాధ్యత ఆతిథ్య దేశానిదే అంటూ భారత విదేశాంగశాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు . అయితే.. పర్యటన విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని విదేశాంగ శాఖ తెలిపింది. కశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో అమాయక ప్రజల మరణానికి రాజనాథ్ సింగ్ కారణమని, ఆయన్ను పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానించడం ద్వారా కశ్మీరీల మనసులు గాయపడుతాయని హఫీజ్ సయీద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2008 ముంబై పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్.. రాజనాథ్ పర్యటనకు వ్యతిరేకంగా ఇస్లమాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్, క్వెట్టా, ముల్తాన్, ఫైసలాబాద్లతో పాటు పాక్‌లోని ఇతర నగరాల్లో ఆగస్టు 3న ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజనాథ్ పర్యటన టెన్షన్‌గా మారింది -
అసోం వరదల్లో 26 మంది మృతి.. హోం మంత్రి సమీక్ష..
గౌహతిః అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో లక్షలమంది జనం ఇక్కట్లు పడుతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే వరదల కారణంగా 26 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు వరద బాధిత ప్రాంతాల్లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్ర మంత్రి జితేంద్రసింగ్ లతో కలసి నష్టాలను అంచనావేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కేంద్రం 4 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న అసోం రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్రమంత్రి జితేంద్రసింగ్ లతో కలసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితులపై అక్కడి అధికారులతో సమీక్షించిన రాజ్ నాథ్.. సుమారు 60 ఎన్జీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం పరిష్కారం కాదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రాజ్ నాథ్ తెలిపారు. వరద పరిస్థితులను సమీక్షించేందుకు ఉదయం ఢిల్లీనుంచీ గౌహతి బయల్దేరేందుకు ముందుగా ఆయన.. తన పర్యటన వివరాలను ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సుమారు 36 లక్షలమంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకూ వరదల కారణంగా 26 మంది వరకూ మృతి చెందారని రాజ్ నాథ్ తెలిపారు. ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. నదులు పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పండిందన్నారు. లఖింపూర్, గోలాఘాట్, బొంగాయిగాన్, జోర్హాట్, ధీమాజీ, బర్పేటా, గావాల్పర్, ధుబ్రీ, దర్రాంగ్, మోరిగావ్, సోనిత్పూర్ జిల్లాలు అత్యధికంగా వరదల వల్ల నష్టపోయినట్లు 'అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ' (ఏఎస్డీఎమ్ఏ) వెల్లడించింది. అలాగే శివసాగర్, కోక్రజ్హర్, దిబ్రుఘర్, గోల్పారా, తిన్షుకియా,బిశ్వనాథ్, నల్బారీ, బక్సా, ఉదల్ గ్లురీ, కామ్రప్ (ఎం) ఛిరాంగ్ జిల్లాలు కూడా వరద ముంపునకు గురైనట్లు ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. గౌహతి, నేమాతిఘట్, తేజ్‌పూర్, గోల్పారా, ధుబ్రీల్లోని బ్రహ్మపుత్రానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 27 అగ్నిమాపక కేంద్రాలతో కలసి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు సైతం అందిస్తున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఉగ్ర కదలికలపై మరింత దృష్టి పెట్టండి
- కేంద్ర హోంమంత్రితో భేటీలో దత్తాత్రేయ విజ్ఞప్తి - ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసులను రాజ్‌నాథ్ అభినందించారని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏ మూల ఉగ్ర దాడులు జరిగినా హైదరాబాద్‌లో ఒక్క ఉగ్రవాదైనా పట్టుబడుతున్నాడని, అందువల్ల వారి కదలికలపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో సమావేశమైన దత్తాత్రేయ హైదరాబాద్‌లో ఐసిస్ కార్యకలాపాలు, హైకోర్టు న్యాయవాదుల నిరసనలపై చర్చించారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఛేదించిన ఎన్ఐఏతోపాటు తెలంగాణ పోలీసుల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో న్యాయవాదుల ఆందోళనలపై జోక్యం చేసుకోవాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గవర్నర్‌తో చర్చించి సమస్య పరిష్కరించుకునేలా చూడాలని కోరగా అం దుకు రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్‌లో దాడులు జరగనివ్వకుండా సకాలంలో ఉగ్రవాదులను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భవి ష్యత్తులో ఇస్తాంబుల్ వంటి దాడులు హైదరాబాద్‌లో జరగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగాలని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారన్నారు. కాగా, న్యాయవాదుల ఆందోళనలు, సబార్డినేట్ జడ్జిల సస్పెన్షన్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో దత్తాత్రేయ చర్చించారు. ఈ అంశాలను సత్వరమే కొలిక్కి తెస్తామని సదానంద హామీ ఇచ్చారు. -
అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్ర:రాజ్ నాథ్
ఫతేగఢ్ సాహిబ్: పొరుగుదేశం భారత్ లో అశాంతి, అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. ఎనిమిదిమంది సీఆర్ పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఘటనపై రాజ్ నాథ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధ వీరుడు బాబా బండ సింగ్ బహదూర్ వర్థంతి ఉత్సవంలో మాట్లాడుతూ ఆయన మాట్టాడుతూ.. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరి ఆధ్వర్యంలో కమిటీని వేసి పాంపోర్ కు పంపాల్సిందిగా హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. జరిగిన పొరపాట్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన సూచించారు. సైనికుల ధైర్యం, దేశ భక్తికి సైల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. సైనికుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. శనివారం జమ్ముకశ్మీర్ లోని పాంపొరాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిదిమంది జవాన్లు మరణించగా మరో 21 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
ఆఫ్రికన్లపై దాడులను ఖండించిన సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల ఆఫ్రికన్ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్లను ఆదివారం సుష్మా స్వరాజ్ కోరారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబీకులకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆమె వెల్లడించారు. అలాగే బుధవారం హైదరాబాద్‌లో పార్కింగ్ వివాదంలో నైజీరియన్ విద్యార్థులపై దాడికి సంబంధించిన కూడా సుష్మా స్వరాజ్ తక్షణమే నివేదికను కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. ఆఫ్రికన్లపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఆమె కోరారు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టదలచిన విద్యార్థులతో మాట్లాడాలని జనరల్ వీకే సింగ్, సహాయ కార్యదర్శి అమర్ సిన్హాలను కోరినట్లు సుష్మా స్వరాజ్ వెల్లడించారు. -
శ్రీనగర్ నిట్ తరలించేది లేదు!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు కొందరు, తమ క్యాంపస్‌లో భద్రతను పటిష్టం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఎన్ఐటీ ప్రాంగణాన్ని మరోచోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే క్యాంపస్‌ను మరోచోటికి తరలించడానికి స్మృతి ఇరానీ అంగీకరించలేదని ఓ విద్యార్థి తెలిపాడు. కొద్ది రోజులుగా నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. టీ-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్‌లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తాయి. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ గొడవలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సీట్లు పెంచండి
♦ కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి ♦ ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరతతో ఇబ్బందులు పడుతున్నాం ♦ రాష్ట్రానికి ఐపీఎస్‌ల సంఖ్యను 141కి పెంచండి ♦ ‘ఉపాధి’ని సాగుతో అనుసంధానించాలని కేంద్ర మంత్రి బీరేంద్రకు విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధన మేరకు తెలంగాణలో శాసనసభ స్థానాలను 153కు పెంచేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, పార్టీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, బి.బి.పాటిల్, సీతారాంనాయక్‌తో కలిసి ఆయన రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ‘‘తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియ వేగవంతం చేయాలి. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల కొరత కారణంగా తెలంగాణలో అనేక ఇక్కట్లు ఎదురవుతున్నందున త్వరగా ఈ సమస్యను పరిష్కరించండి. ప్రస్తుతం ఐపీఎస్ అధికారులు 123 మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను 141కి పెంచాల్సిన అవసరం ఉంది..’’ అని హోంమంత్రికి విన్నవించారు. తమ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు కేటీఆర్ తెలిపారు. ఉపాధి అనుసంధానంపై పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ హోంమంత్రిని కలిసిన అనంతరం కేటీఆర్, ఎంపీల బృందం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో భేటీ అయింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా బీరేంద్ర సింగ్‌ను కేటీఆర్ కోరారు. ఈ దిశగా తగు సూచనలు చేయాలని విన్నవించారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు రూపొందించి పంపిస్తే తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకునే దిశగా ఆలోచిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు కేటీఆర్ మీడియాకు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న పారిశుధ్య కార్మికులను కూడా ఉపాధి హామీ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేసినట్టు కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏప్రిల్ 20న రాష్ట్రానికి రావాల్సిందిగా బీరేంద్రసింగ్‌ను ఆహ్వానించామని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి రూ.3 వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ఇచ్చామని, 172 వంతెనల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరామని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను కూడా కేంద్రమంత్రికి వివరించామని, ముఖ్యంగా తాగునీటికి సంబంధించి సాయం అందించాల్సిందిగా కోరినట్లు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు చేపడతామని కేంద్రమంత్రి అన్నట్లు పేర్కొన్నారు. -
గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు
ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
'ఆధునిక పద్దతులతో పరిష్కరించండి'
లక్నో: ఉగ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో నూతనంగా ప్రారంభించనున్న ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బ్రాంచ్ భవనానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఉగ్రవాద, మావోయిస్టు చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషించిందన్నారు. 'భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం అతి పెద్దది. భద్రతా సమస్యలను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఆధునిక పద్దతులతో పరిష్కరించాలి. కీలకమైన కేసులలో విచారణ, ఇన్వెస్టిగేషన్లను పాత పద్దతులతో చేయలేము. ఈ రోజుల్లో క్రిమినల్స్ కూడా ఆధునిక పద్దతులు అనుసరిస్తున్నారు. ఎన్ఐఏ పనితీరుపై కేవలం మన దేశ ప్రజలే కాదు, మొత్తం ప్రపంచానికే నమ్మకం ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఐఎస్ఐఎస్ సమస్యతో మన దేశానికి ఎలాంటి భయం అవసరం లేదు. మన దేశంలోని ముస్లిం కుటుంబాలు వారి పిల్లలను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులు అవ్వకుండా చూడగలుగుతున్నారు'. అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాగా ఉగ్రవాదులు, మావోయిస్టులకు సంబంధించిన క్లిష్టమైన కేసులను ఎన్ఐఏ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. -
‘అసహనం’ తుపాను
న్యూఢిల్లీ: ‘అసహనం’ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోమవారం లోక్‌సభలో అసహనంపై చర్చ వాడీవేడిగా ప్రారంభమైంది. సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం రాజ్‌నాథ్‌పై చేసిన హిందుత్వ వ్యాఖ్యలతో దుమారం రేగింది. సలీం వ్యాఖ్యలను ఖండించిన అధికార పార్టీ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంది. ఇరు పక్షాలు ఆందోళనలకు దిగడంతో లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది. తొలుత సలీం అసహనంపై చర్చను ప్రారంభిస్తూ మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాక దేశంలో హిందుత్వ నేత అధికారం చేపట్టారని రాజ్‌నాథ్ ఆరెస్సెస్ అంతర్గత భేటీలో చెప్పారంటూ ఓ వార్తా పత్రికను ఉటంకిస్తూ ఆరోపణలు చేశారు. సలీం ఆరోపణలను తీవ్రంగా ఖండించిన రాజ్‌నాథ్.. తన పార్లమెంటరీ జీవితంలో ఇంతగా బాధించిన ఘటన మరొకటి లేదన్నారు. ‘తీవ్ర ఆరోపణ చేశారు. నేను ఆ మాటలు ఎక్కడ.. ఎప్పుడన్నానో చెప్పాలి. లేదా క్షమాపణలు చెప్పాలి. అలా అన్న వ్యక్తికి హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నేను ప్రతి మాటా చాలా జాగ్రత్తగా మాట్లాడతా. రాజ్‌నాథ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ప్రజలకు తెలుసు’ అని పేర్కొన్నారు. దీంతో.. తనకు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కలేదంటూ సలీం ఎద్దేవా చేశారు. మంత్రి రాజీవ్ ప్రతాప్రూడీతో పాటు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ వ్యాఖ్యల ప్రామాణికతతో పాటు అన్ని అంశాలపై స్పీకర్ పరిశీలించే వరకూ సలీం తన వ్యాఖ్యలను వాపసుతీసుకోవాలన్నారు. దీనికి అంగీకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సలీంను కోరినా.. ఆయన సమ్మతించలేదు. తనకు రాజ్‌నాథ్‌పై ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, పత్రికలో వచ్చిన వ్యాఖ్యలనే ప్రస్తావించానన్నారు. రాజ్‌నాథ్ అలా మాట్లాడి ఉండకపోతే నవంబర్ 16న వచ్చిన ఈ కథనంపై పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగానే ఆయన సమాచారమివ్వాల్సిందని, ఈ రకంగా ఆయనకు సాయమే చేశానన్నారు. కాగా, తాను ఈ అంశాలను పరిశీలించేవరకూ సలీం మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. అయితే విపక్ష, అధికార పక్షాల ఆందోళనలతో నాలుగుసార్లు సభ వాయిదా పడటంతో సలీం ముందస్తు నోటీసులివ్వనందున ఆయన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో చర్చ మొదలైంది. దేశంలో పెరుగుతున్న అసహన నిరోధంలో ప్రభుత్వం విఫలమైందని సలీం ఆరోపించారు. మతం పేరుతో అరాచకాలు జరుతున్నా.. మైనారిటీలు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. హరియాణాలో దళిత బాలల దహనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గత 15-16 నెలలుగా జరుగుతున్న ఘటనలు దేశంలో లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. అసహనానికి సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రధాని మౌనం వీడటం లేదని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతఘర్షణలు తగ్గాయంది. పార్లమెంటు సమాచారం సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వం వివిధ అంశాలపై వెల్లడించిన వివరాలు. ► 40 మంది అవార్డులు వెనక్కిచ్చారు: దేశంలో అసహనం పెరుగుతోందంటూ 40 మంది కళాకారులు, రచయితలు వారి అవార్డులను సాహిత్య అకాడమీకి తిరిగిచ్చారు. ►35 వేల మంది బాలకార్మికులకు పునరావాసం బాలకార్మిక ప్రాజెక్టు కింద ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి 35వేల మంది బాలకార్మికులకు పునరావాసం కల్పించారు. ► 22 లక్షల టన్నుల పప్పుల దిగుమతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు విదేశాల నుంచి 22.37 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుమతి జరిగింది. ► అంతర్జాతీయ విద్యా సదస్సు వాయిదా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నవంబర్‌లో జరగాల్సిన అంతర్జాతీయ విద్యా సదస్సు అనివార్య కారణాలతో వాయిదా పడింది. ► ‘గీత’ను చేర్చే ప్రతిపాదన లేదు: పాఠశాలల సిలబస్‌లో భగవద్గీత, వేదాలు, ఇతర మతగ్రంథాలను చేర్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. భూబిల్లు కమిటీ గడువు పొడిగింపు వివాదాస్పద భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ గడువును లోక్‌సభ సోమవారం ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజు వరకు పొడిగించింది. దీంతో బిల్లు ఆమోదంపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. జీఎస్టీకి మద్దతిస్తాం: మాయావతి జీఎస్టీ బిల్లు ఉద్దేశం దేశ ప్రయోజనాల కోసమే అయితే దానికి మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. అయితే అసహనం, మతతత్వం, అరాచకాలపై ఆమె ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. హరియాణాలో దళిత బాలల సజీవదహనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని, జైలుకు పంపాలని ఆమె రా జ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో డిమాండ్ చేశారు. -
మంత్రులపై రాజ్‌నాథ్ అసంతృప్తి
ఢిల్లీ: సహచర కేంద్రమంత్రులు, బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యల పట్ల హోం మంత్రి రాజనాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, నాయకులు మరింత జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు తమ ఉద్దేశాలను ప్రజలముందు ఉంచే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాట్లాడిన తరువాత.. వక్రికరించారంటూ తప్పించుకోవడం కుదరదన్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ ఫరీదాబాద్ ఘటనపై మాట్లాడుతూ.. ఎవరో కుక్కపై రాయి విసిరితే కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. అలాగే మరో మంత్రి రిజిజ్.. ఉత్తర భారతీయులు నిబంధనలను అతిక్రమించడం గర్వంగా భావిస్తారన్న మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఏకీభవిస్తున్నాన్న వ్యాఖ్యలను రాజనాథ్ సింగ్ తప్పుపట్టారు. ఈ రెండు ఘటనలలో మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి పర్యటన
-
ఆ ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
గురుదాస్‌పూర్ ఉగ్రదాడిపై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటన న్యూఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్‌తో సంబంధముందని.. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయటానికి పాక్ నుంచే చొరబడ్డారని నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 27వ తేదీ సోమవారం నాడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉగ్రదాడిని పార్లమెంటు ఉభయసభలైన లోక్‌సభ, రాజ్యసభ గురువారం తీవ్రంగా ఖండించాయి. ఆ దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పించాయి. అనంతరం.. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అంత్యక్రియలు జరుగుతున్నందున లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయగా.. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదావేశారు. మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురుదాస్‌పూర్ దాడిపై ప్రకటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య ఆయన మాట్లాడుతూ.. గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది పాకిస్తాన్లో ప్రవేశించే ప్రాంతమైన తాష్ ప్రాంతం వద్ద ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబడినట్లు జీపీఎస్ సమాచారం ప్రకారం పోలీసుల ప్రాధమిక విశ్లేషణ సూచిస్తోందని తెలిపారు. సరిహద్దులో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదులు పంజాబ్‌లో చొరబడగలగటానికి అక్కడ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తోడయిన ఫలితంగా సరిహద్దు వెంట నదులు, కాల్వల్లో నీటి ప్రవాహం పెరగటం కావచ్చునని అభిప్రాయపడ్డారు. -
అధికారులను అప్రమత్తం చేసిన మోదీ
ఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని మరోసారి వణికించిన భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. భూకంపం వార్త తెలిసిన వెంటనే ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నేపాల్ సహా దేశంలో ప్రకంపనలు రేపిన భూకంపంపై కేంద్రహోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి నేపాల్‌కు ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. దేశంలోని సంభవించిన భూకంపం ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని కేంద్రమంత్రి చెప్పారు. కాగా నేపాల్ భూకంపం విలయం నుంచి ఇంకా తేరుకోకముందే పలు చోట్ల భూప్రకంపనలు ఆందోళన రేకెత్తించాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. కఠ్మాండు విమానాశ్రయంలో ప్రయాణీకులు ఆందోళనతో పరుగులు పెట్టారు. మంగళవారం సంభవించిన భూకంపంలో ఇప్పటికి నేపాల్‌లో 26మంది, దేశంలో ఏడుగురు చనిపోయినట్టు సమాచారం. -
రాజ్‌నాథ్ గోడ దూకారట
-
రాజ్‌నాథ్ గోడ దూకారట..
న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోస్ పర్యవేక్షణ ఒకవైపు, వ్యక్తిగత భద్రతా దళాల పహారా మరోవైపు రక్షణగా ఉండే అత్యున్నత స్థాయి వ్యక్తి అకస్మాత్తుగా ఇబ్బందిలో పడితే ఎలా ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బందికి ముచ్చెమటలు పట్టవూ.. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సెక్యూరిటీ సిబ్బందికి ఎదురైంది. సౌత్ ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శౌర్యదివస్ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాజనాథ్ సింగ్ తదితరులు ఒక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో అందరూ కాసేపు భీతిల్లి పోయారట. సాంకేతిక కారణాలతో లిఫ్ట్ ఆగిపోవడంతో ముందుగా తేరుకున్న హోంమంత్రి సమయస్ఫూర్తిగా వ్యవహరించినట్టు సమాచారం. ఒక స్టూల్ సహాయంతో గోడెక్కి ఒకరి తర్వాత ఒకరుగా అంతా బయటపడ్డారు. అయితే ముందు మిగతావారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు స్వయంగా హోంమంత్రే చొరవ చూపినట్టు సమాచారం. ఈ విషయాలను రాజ్‌నాథ్ సమావేశంలో అందరితో పంచుకొన్నారు. అందరిలోనూ హరిభాయ్ చౌదరి బరువు ఎక్కువ ఉన్నారని... ఈసారి మాత్రం ఆయనకు దూరంగా ఉండాలని చమత్కరిస్తూ రాజ్‌నాథ్ నవ్వులు పూయించారట. కాగా సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రకాష్ మిశ్రా , కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డైరెక్టర్ బీకే సింగ్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి తదితరులు లిఫ్టులో ఇరుక్కున్న వారిలో ఉన్నారు. -
కేంద్రానికి తమిళనాడు ఫిర్యాదు
చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్ మంత్రులు, డీజీపీతో చంద్రబాబు భేటీ అనంతరం రాజ్‌నాథ్‌కు ఫోన్ చేసిన బాబు హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) మంగళవారం ‘‘ఎన్కౌంటర్’’లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను చంపేయటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో నిరసనలు రగులుకోవటంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించడం.. తమిళనాడులో నిరసనలు వ్యక్తమవడంతో చంద్రబాబు హడావుడిగా అందుబాటులో ఉన్న మంత్రు లు దేవినేని ఉమామహేశ్వరావు, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడులతో సచివాలయంలో సమావేశమయ్యారు. తమిళనాడు నుంచి భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అడవుల్లోకి వస్తున్నారన్న పక్కా సమాచారంతోనే సోమవారం నుంచి టాస్క్‌ఫోర్స్ బలగాలను కూంబింగ్‌కు పంపామని.. మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ బలగాలపై దాడులకు దిగాయని.. పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని సీఎంకు డీజీపీ వివరించారు. కాల్పుల్లో గాయపడన వారందరికీ వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాల్పుల్లో చనిపోయిన స్మగ్లర్ల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ అనంతరం వారి కుటుంబాలకు అప్పగించాలని సీఎం ఆదేశించారని.. మృతుల ఫోటోలను విడుదల చేసి వారి సంబంధీకులకు వివరాలు తెలియజేయాలని సూచించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. -
బోడోలపై చర్యలకు భూటాన్ సాయం
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ వెల్లడి బోడో నరమేధం జరిగిన సోనిత్పూర్ను సందర్శించిన రాజ్‌నాథ్ అస్సాంలో కొనసాగుతున్న హింస.. 78కి పెరిగిన మృతుల సంఖ్య గువాహటి/సోనిత్పూర్: అస్సాంలో నరమేధానికి పాల్పడిన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (సాంగ్బిజిత్) ఉగ్రవాద సంస్థపై కఠిన చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగుదేశమైన భూటాన్ సరిహద్దులో ఈ సంస్థ స్థావరాలపై చర్యలు చేపట్టేందుకు ఆ దేశాన్ని సంప్రదించనున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆయన గురువారం దిగువ అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాను సందర్శించారు. బోడో ఉగ్రవాదుల నరమేధం, అనంతర పరిస్థితులపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్, ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహించబోదని, నిషిద్ధ బోడో ఉగ్రవాదులపై చర్యల కోసం భూటాన్ సాయం కోరాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరామని చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు చేపడతామని, అయితే అది ఎప్పుడనేది చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. భూటాన్ సరిహద్దులో ఉన్న బోడో ఉగ్రవాదుల స్థావరాలపై సాయుధ బలగాలు చర్యకు దిగినప్పుడల్లా ఉగ్రవాదులు భూటాన్ అడవుల్లోకి పారిపోతున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు బోడోల హింసలో మరణించిన ఆదివాసీల సంఖ్య గురువారానికి 78కి పెరిగింది. ఈ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ ఉన్నప్పటికీ గురువారం కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. గోస్సాయ్‌గావ్ ప్రాంతంలో బోడోలకు చెందిన పలు గృహాలను ఆదివాసీలు దహనం చేశారు. -
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
* మంజూరు చేసిన పాకిస్తాన్ కోర్టు * తీవ్రంగా ఖండించిన భారత్ * బెయిల్ రద్దుకు పాక్ ప్రయత్నించాలన్న రాజ్‌నాథ్ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం. ‘ఈ నిర్ణయాన్ని మేం ఊహించలేదు. బెయిల్ మంజూరు కన్నా ముందే మరిన్ని సాక్ష్యా లను మేం కోర్టుకు హాజరుపరిస్తే బావుండేది’ అని ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధ్రీ అజహర్ అన్నారు. లఖ్వీపై సాక్ష్యాధారాలు బలంగా లేనందువల్ల ఆయనకు బెయిల్ మంజూరైందని లఖ్వీ తరఫు న్యాయవాది రాజా రిజ్వాన్ అబ్బాసీ తెలిపారు. 26/11 కేసుకు సంబంధించిన మరో ఆరుగురు నిందితులకు కూడా బెయిల్ కోరుతూ త్వరలో కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. భద్రతాకారణాల వల్ల ఈ కేసును రావల్పిండిలోని అడియాల జైల్లో రహస్యంగా విచారిస్తున్నారు. 2008లో ముంబైపై దాడి జరగగా, 2009 నవంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ వరుస వాయిదాలు, సాంకేతిక కారణాలతో నత్తనడకన నడుస్తోంది. లఖ్వీకి బెయిల్ మంజూరవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందనడానికి ఇదో మరో రుజువని ఆరోపించింది. బెయిల్ నిర్ణయాన్ని నిరసిస్తూ పాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక కఠిన ప్రతిస్పందనను రూపొందిస్తోంది. లఖ్వీకి బెయిల్ లభించడంపై భారతదేశ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా వ్యవహరించడం వల్లనే లఖ్వీకి లభించిందన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును పాక్ ప్రభుత్వం పై కోర్టులో సవాలు చేసి, బెయిల్‌ను రద్దు చేయిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముంబై దాడి కేసు విచారణను భారత్‌లో తొందరగా ముగించామని, ముఖ్యమైన సాక్ష్యాధారాలన్నింటినీ అందించినప్పటికీ పాక్‌లో మాత్రం విచారణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. లఖ్వీకి బెయిల్ లభించడం 26/11 కేసు విచారణకు పెద్ద దెబ్బ అని భారత్‌లో ఆ కేసును వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. లఖ్వీ బెయిల్‌పై బయట ఉంటే.. వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు సాక్షులు ముందుకు రాలేరన్నారు. హఫీజ్ సయీద్.. మానవత్వానికే శత్రువు ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి ఉంటే.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టైస్టులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను వెంటనే తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వేర్వేరుగా ఈ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న హఫీజ్ సయీద్.. మానవత్వానికే ప్రధాన శత్రువని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. -
కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన సహా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, వివాదాస్పద అంశాలను ఆయనకు వివరించారు. ఢిల్లీలోని అశోకారోడ్డులో రాజ్‌నాథ్ నివాసంలో దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు పట్టుబట్టిన వైనాన్ని గవర్నర్ వివరించారు. అయితే ఈ సమస్య ప్రస్తుతం సమసిపోయిందని, ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్‌ను ఇచ్చుకున్నాయని గవర్నర్ తెలిపారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణపై ఇప్పటి నుంచే వివాదం రేగే అవకాశమున్నట్లు కేంద్రం దృష్టికి తెచ్చారు. ఇక తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థల విభజనతోపాటు నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నిథిమ్, కార్మిక కమిషనర్ కార్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గవర్నర్ వివరించినట్లు తెలిసింది. కాగా, గురు లేదా శుక్రవారాల్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కోరారు. ప్రధాని సమయమిస్తే.. రెండు రాష్ట్రాల మధ్య విద్య, విద్యుత్, జల, ఆర్థిక వివాదాలతోపాటు, ఉమ్మడి సంస్థలపై నెలకొన్న విభేదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. కాగా, శుక్రవారం రాష్ట్రపతి భవన్లో సమావేశ మందిరం ప్రారంభ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పాటు నరసింహన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాలని గవర్నర్ భావిస్తుండగానే బుధవారమే రావాలని కేంద్ర హోం శాఖ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన సాయంత్రం బయలుదేరి వెళ్లారు. -
మావోలు దేశానికి సవాల్
‘సుక్మా’ మృతుల కుటుంబాలకు రూ.38 లక్షల పరిహారం: రాజ్‌నాథ్ రాయ్‌పూర్: ‘మావోయిస్టులు దేశానికి సవాల్. ప్రభుత్వం దాన్ని స్వీకరించింది. వారిపై పోరాడతాం. ఆ సవాల్‌ను సమర్థంగా అధిగమిస్తాం. నక్సల్స్ ముప్పును ఎదుర్కోవడానికి దేశం ఏకతాటిపైకి రావాలి’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నక్సల్స్ దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన నేపథ్యంలో రాజ్‌నాథ్ మంగళవారం రాయ్‌పూర్ చేరుకుని భద్రతను సమీక్షించారు. జ వాన్ల భౌతికకాయాల వద్ద నివాళి అర్పించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్ర జవాన్లను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 38 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 65 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. సుక్మా జిల్లాలో 15 రోజులుగా నక్సల్స్ నిరోధక ఆపరేషన్ జరుగుతోందని, అది చాలా ప్రమాదంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతను సమీక్షించారు. కాగా నక్సల్స్ కాల్పుల్లో గాయపడిన 15 మంది జవాన్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. దోషులను బోనెక్కించాలని రాష్ట్ర గవర్నర్ బీడీ టాండన్‌కు పంపిన సందేశంలో కోరారు. నక్సల్స్ దాడి పిరికిపంద చర్య అని ఆరెస్సెస్ నేత మన్మోహన్ వైద్య దుయ్యబట్టారు. మృతుల్లోని ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దాడి రమణ్‌సింగ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, దాన్ని రద్దు చేయాలని మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్న సభ కొన్ని నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళి అర్పించింది. చెట్లపై నుంచి కాల్పులు జరిపిన నక్సల్స్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలపై మెరుపు దాడి చేసిన నక్సల్స్ చె ట్లపైన తేలికపాటి మెషిన్ గన్(ఎల్జీఎం)లు ఉంచుకుని వాటితో జవాన్లపై గుళ్ల వర్షం కురిపించినట్లు అనుమానిస్తున్నారు. చింతగుహ అటవీ ప్రాంతంలో కసల్పడ గ్రామం గుండా వెళ్తున్న జవాన్లపై వారు ఇలా కాల్పులకు తెగబడ్డారని ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న పోలీసులు, దాడితీరును విశ్లేషించిన అధికారులు తెలిపారు. కాగా, నక్సల్స్ సీఆర్పీఎఫ్ బలగాలకు చెందిన పలు అత్యాధునిక ఆయుధాలను ఘటనాస్థలి నుంచి తీసుకెళ్లారు. వీటిలో ఏకే 47/56 రకానికి చెందిన 10 తుపాకులు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 400 రౌండ్ల తుటాలు ఉన్నాయని భద్రతా బలగాల అంచనా నివేదిక పేర్కొంది. జవాన్ల కాల్పుల్లో 14 మంది నక్సల్స్ చనిపోయారని, మరో 15 మంది గాయపడ్డారని తెలిపింది. నక్సల్స్ కొంతమంది మహిళలు, పిల్లలు సహా పలువురు స్థానిక గ్రామస్తులను మానవ కవచాలుగా వాడుకుని కాల్పులు జరిపారని పేర్కొం ది. దండకారణ్యంలోని స్థానిక నక్సల్స్ నేతలు ఈ దాడికి పథకం వేసి అమలు చేయించారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మృతుల్లో అనంత వాసి నల్లమాడ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ అడవుల్లో సోమవారం నక్సల్స్ జరిపిన దాడిలో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కుంచపు రామమోహన్(25) బలయ్యాడు. ఈమేరకు సంబంధిత అధికారులనుంచి కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. రామమోహన్ 2011లో జవాన్‌గా చేరాడని అతని తల్లిదండ్రులు వెంకటస్వామి, క్రిష్టమ్మలు తెలిపారు. అతని మృతివార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు
జాబితాలో సోనియా గాంధీ, అద్వానీ, రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, నితిన్ గడ్కారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్... వీరంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం 401 వుంది ఎంపీలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాల్సి ఉందని సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు లోక్‌సభ సెక్రటేరియెట్ బదులిచ్చింది. నిబంధనల ప్రకారం ఎంిపీగా ప్రమాణం చేసిన 90 రోజుల్లోగా సభ్యులు తమ ఆస్తుల వివరాలను తెలపాలి. ఆస్తుల వివరాలు తెలియజేయని ఎంపీలలో 209 మంది బీజేపీ వారే. కాంగ్రెస్ నుంచి 31, టీఎంసీ 27, బీజేడీ 18, టీడీపీ 14, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. అక్రమ సంపాదన కాదు: సదానందగౌడ బెంగళూరు: ఎన్నికల తర్వాత తన ఆస్తి భారీగా పెరిగిందని, ఇదంతా అక్రమ సంపాదనే అని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రైల్వే మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. మంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆస్తి విలువ పెరిగినంత మాత్రాన అదంతా అక్రమ సంపాదన అనడం సరికాదన్నారు. ఎన్నికల అనంతరం ఫెడరల్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు అప్పు తీసుకున్నానని, బెంగళూరు న్యూ బీఈఎల్ రోడ్‌లోని తన బహుళ అంతస్తుల భవనంలో కిరాయిదారుల నుంచి రూ.2 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నానని వెల్లడించారు. ఇందువల్ల ఎన్నికల అనంతరం తన ఆస్తి విలువ పెరిగిందే కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. -
కాశ్మీర్లో వరద విలయం
►116కు చేరిన మృతుల సంఖ్య ►పోటెత్తిన నదులు, వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు ►నీటమునిగిన 450 గ్రామాలు ►కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జితేంద్ర సింగ్ సమీక్ష శ్రీనగర్: అరవై ఏళ్లలో కనీవినీ ఎరగని వరదలు జమ్మూ కాశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల్లో మృతుల సంఖ్య 116కి చేరింది. జమ్ము డివిజన్లో శనివారం మరో 11 మంది మరణించారు. ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం, భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, 450 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. శనివారం పుల్వామా జిల్లాలో సహాయ కార్యక్రమాల విధుల్లో ఉన్న 9 మంది సైనిక సిబ్బందితో కూడిన బోటు జీలంనది వరదనీటిలో మునిగిపోయింది. వారిలో ఏడుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్లో పలు నదులు ప్రమాద స్థాయిని మించడంతో పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాలు సహా పలు ప్రాంతాలు నీటమునిగాయి.పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జితేంద్ర సింగ్ శనివారం శ్రీనగర్, జమ్ము ప్రాంతాల్లో పర్యటించారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలసి వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఏరియల్ సర్వేని రద్దుచేసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినట్టు రాజ్‌నాథ్ చెప్పారు. సహాయ కార్యక్రమాలకోసం దాదాపు లక్ష మంది సిబ్బందిని సైన్యం సమీకరించినట్టు అధికారులు తెలిపారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం (ఎన్టీఆర్ఎఫ్) బృందాలను, వైమానిక దళ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలోనే 9 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా, వైష్ణో దేవీ యాత్రను వరుసగా మూడోరోజూ రద్దుచేశారు. జమ్ము -శ్రీనగర్ జాతీయ రహదారినీ మూసివేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కాంగ్రెస్ జమ్ము కాశ్మీర్లో వర్షబీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ డిమాండ్ చేశారు. వరదపై ప్రధాని మోడీ అధికారులతో సమీక్షించారు. ఆయన ఆదివారం కాశ్మీర్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. పాక్‌లో 160 మంది బలి పాకిస్థాన్ వర్ష బీభత్సానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం నమోదవుతోంది. శనివారానికి సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 148 మంది గాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పాలంద్రిలో 66.8 సెంటీమీటర్లు, ఇస్లామాబాద్‌లో 31.6 సెంటీమీటర్లు, రావల్పిండిలో 44 సెంటీమీటర్లు, లాహోర్‌లో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహకరిస్తాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పమన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడులూ.. మోడీ తరపున చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తాయని అన్నారు. ఈ సభలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకం : జగన్
-
అధికారమిస్తే అందరికీ వైద్య బీమా: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు ఖరీదైపోయాయని, గ్రామాలు, గుడిసెల్లో నివసించే వారు వాటిని భరించే స్థితిలో లేరని అన్నారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం లభించి 66 ఏళ్లు గడిచినప్పటికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్థిరత్వం ప్రజలకు కల్పించలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. అవి లేకుండా మనది సంక్షేమ రాజ్యం అని చెప్పలేమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకివన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన వృద్ధి రేటు పెరిగినప్పుడు ప్రపంచం ఎదుట మన జబ్బలు మనమే చరచుకుంటామని అన్నారు. అయితే ప్రజలకు విద్య, వైద్యం, ఆర్థిక స్థిరత్వం ఇవ్వలేని జీడీపీ వృద్ధి వల్ల ఉపయోగమేమిటని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న ఆదాయ అసమానతలు దేశ ఐక్యతకు ముప్పు అని హెచ్చరించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందకపోతే దేశంలో అశాంతి ప్రజ్వరిల్లుతుందన్నారు. ముంబై, అహ్మదాబాద్ నగరాల తరువాత వైద్య కళాశాలను కలిగి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఢిల్లీ నిలవనుంది. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలోని హిందూరావు ఆస్పత్రి ఢిల్లీలోని తొలి మున్సిపల్ మెడికల్ కాలేజీని నిర్వహించనుంది. ఈ కాలేజీలో తొలి బ్యాచ్‌గా 50 మంది వైద్య విద్యార్థులు ఇప్పటికే ప్రవేశం పొందారు. ఈ కాలేజీకి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎన్డీఎంసీ మెడికల్ కాలేజీగా నమకరణం చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది.