
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
* మంజూరు చేసిన పాకిస్తాన్ కోర్టు
* తీవ్రంగా ఖండించిన భారత్
* బెయిల్ రద్దుకు పాక్ ప్రయత్నించాలన్న రాజ్‌నాథ్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం. ‘ఈ నిర్ణయాన్ని మేం ఊహించలేదు. బెయిల్ మంజూరు కన్నా ముందే మరిన్ని సాక్ష్యా లను మేం కోర్టుకు హాజరుపరిస్తే బావుండేది’ అని ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధ్రీ అజహర్ అన్నారు.
లఖ్వీపై సాక్ష్యాధారాలు బలంగా లేనందువల్ల ఆయనకు బెయిల్ మంజూరైందని లఖ్వీ తరఫు న్యాయవాది రాజా రిజ్వాన్ అబ్బాసీ తెలిపారు. 26/11 కేసుకు సంబంధించిన మరో ఆరుగురు నిందితులకు కూడా బెయిల్ కోరుతూ త్వరలో కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. భద్రతాకారణాల వల్ల ఈ కేసును రావల్పిండిలోని అడియాల జైల్లో రహస్యంగా విచారిస్తున్నారు. 2008లో ముంబైపై దాడి జరగగా, 2009 నవంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ వరుస వాయిదాలు, సాంకేతిక కారణాలతో నత్తనడకన నడుస్తోంది. లఖ్వీకి బెయిల్ మంజూరవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందనడానికి ఇదో మరో రుజువని ఆరోపించింది. బెయిల్ నిర్ణయాన్ని నిరసిస్తూ పాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక కఠిన ప్రతిస్పందనను రూపొందిస్తోంది. లఖ్వీకి బెయిల్ లభించడంపై భారతదేశ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా వ్యవహరించడం వల్లనే లఖ్వీకి లభించిందన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును పాక్ ప్రభుత్వం పై కోర్టులో సవాలు చేసి, బెయిల్‌ను రద్దు చేయిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముంబై దాడి కేసు విచారణను భారత్‌లో తొందరగా ముగించామని, ముఖ్యమైన సాక్ష్యాధారాలన్నింటినీ అందించినప్పటికీ పాక్‌లో మాత్రం విచారణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. లఖ్వీకి బెయిల్ లభించడం 26/11 కేసు విచారణకు పెద్ద దెబ్బ అని భారత్‌లో ఆ కేసును వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. లఖ్వీ బెయిల్‌పై బయట ఉంటే.. వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు సాక్షులు ముందుకు రాలేరన్నారు.
హఫీజ్ సయీద్.. మానవత్వానికే శత్రువు
ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి ఉంటే.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టైస్టులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను వెంటనే తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వేర్వేరుగా ఈ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న హఫీజ్ సయీద్.. మానవత్వానికే ప్రధాన శత్రువని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.