
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు.
రాజ్‌నాథ్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై..గత ఆరు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రజకుల సమస్యలను వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, అయితే తెలుగు రాష్ట్రాలతోపాటు 14 రాష్ట్రాల్లో వారిని ఎస్సీ జాబితాలో చేర్చలేదన్నారు. 1985 మే 28న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ పంపిందన్నారు.
అప్పట్లో దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రజకుల్ని ఎస్సీల జాబితాలో చేర్చితేనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయన్నారు. సమాజంలో సామాజిక అన్యాయానికి గురవుతున్న కమ్యూనిటీల్లో రజకులు ఒకరని తెలిపారు. 13 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో వారిని ఆ జాబితాలో చేర్చకపోవడం అధికరణ 14, 15, 16 ప్రకారం వివక్ష చూపడమేగాక రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకొని రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సుబ్బారెడ్డి కోరారు.