రాష్ట్రానికి విశాఖే భవిష్యత్‌.. త్వరలోనే వైజాగ్‌ నుంచి పరిపాలన | YV Subbareddy Bhumi Pooja for YSRCP New Party office in Endada | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి విశాఖే భవిష్యత్‌.. త్వరలోనే వైజాగ్‌ నుంచి పరిపాలన

Published Thu, Dec 15 2022 8:47 AM | Last Updated on Thu, Dec 15 2022 8:47 AM

YV Subbareddy Bhumi Pooja for YSRCP New Party office in Endada - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు 

సాక్షి, విశాఖపట్నం: రానున్న రోజుల్లో విశాఖే రాష్ట్రానికి భవిష్యత్‌ కానుందని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. పరిపాలన రాజధాని కానున్న విశాఖలో నిర్మాణం చేయనున్న జిల్లా పార్టీ కార్యాలయం భవిష్యత్‌లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని ఆకాంక్షించారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ఆధ్వర్యంలో మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్‌లతో కలిసి ఆయన ఎండాడలోని పనోరమా హిల్స్‌ వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత విశాఖ నుంచే పరిపాలన ఆరంభం కానుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకుందని, ఇప్పుడేమో తమ పార్టీపై బురద జల్లుతుందని విమర్శించారు.

భూమిపూజ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు తదితరులు

ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఇబ్బందులు తప్ప మరేమీ ఉండదన్నారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతను కార్యకర్తలు, నాయకులు భుజాన వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది నాటికి ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పార్టీ విజయపతాక ఎగరవేయాలని, దీనికి పునాది విశాఖ నుంచి ప్రారంభం కావాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఒక గొప్ప అడుగుగా ఈ కార్యాలయం శంకుస్థాపనను భావిస్తున్నట్లు తెలిపారు.

మనకు గుర్తింపు, పార్టీ పదవులు వచ్చాయంటే.. దానికి కారణం పార్టీ అనేది మరిచిపోకుండా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్ష మేరకు త్వరలో విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమే‹Ùబాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు. కార్యకర్తల్లో నూతన ఉత్తేజంతో పాటు పార్టీ మరింతగా పటిష్టం కానుందని వివరించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధాని చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేశారు.. ఇది జిల్లా కార్యాలయమే కాకుండా రాష్ట్ర కార్యాలయంగా కూడా త్వరలో అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. 8వ వార్డు కార్పొరేటర్‌ లోడగల అప్పారావు మాట్లాడుతూ తన పరిధిలో పార్టీ కార్యాలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తామంతా నిర్మాణ పనుల్లో భాగస్వాములవుతామన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె రాజు, మాజీ మంత్రులు బాలరాజు, దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు, పరిశీలకులు ఎస్‌.ఎ.రహమాన్, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, శరగడం చినఅప్పలనాయుడు, బీసీ కమిషన్‌ సభ్యుడు పక్కి దివాకర్, కార్పొరేషన్‌ చైర్మన్లు బొల్లవరపు జాన్‌వెస్లీ, కోలా గురువులు, కాయల వెంకట్‌ రెడ్డి, మధుసూదన్‌రావు, అక్కరమాని లక్ష్మి, పిల్లా సుజాత, పల్లా చినతల్లి, కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్‌ పర్సన్‌ కొల్లి సింహాచలం, మాధవీవర్మ, ముఖ్యనాయకులు ఐ.హెచ్‌ ఫరూఖీ, రవిరెడ్డి, మొల్లి అప్పారావు, దాడి రత్నాకర్, సతీష్‌ వర్మ, కాశీ విశ్వనాథ్, నడింపల్లి కష్ణంరాజు, ఉడా రవి, మంత్రి రాజశేఖర్, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, శశికళ, అనిల్‌కుమార్‌ రాజు, గుడివాడ అనూష, పీవీ సురేష్, భర్కత్‌ ఆలీ, భరణికాన రామారావు, బెహరా భాస్కరరావు, వి.వి.ఎన్‌ ఎం రాజా,పీఎస్‌ఎన్‌ రాజు, ద్రోణంరాజు శ్రీవత్సవ, కృపాజ్యోతి, షరీఫ్, బోని శివరామకృష్ణ, రామన్నపాత్రుడు, ఆళ్ల శివగణేష్‌, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, పేడాడ రమణకుమారి, రాముయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, చొక్కర శేఖర్, రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమబాబు  తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement