ఇన్ఫోసిస్ ప్రతినిధులతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందనుందని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటీకీ జీవం పోస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రశంసించారు.
ఎండాడ సమీపంలో ఐటీ సెజ్ హిల్ నంబర్–2లో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు కానున్న నూతన భవనాన్ని బుధవారం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
సమావేశంలో ఇన్ఫోసిస్ సంస్థ మౌలిక సదుపాయాల విభాగం వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ నీలాద్రి ప్రసాద్‌మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ దేశాయ్, మౌలిక సదుపాయాల రీజినల్ హెడ్ కులకర్ణి, సంస్థ ఇతర ప్రతినిధులు జయచంద్రన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ప్రారంభోత్సవ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment