నేడు యూపీ సీఎం ఎంపిక
ఆదివారం సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినబడుతున్నా.. తుది ఎంపికపై స్పష్టత రాలేదు. శనివారం లక్నోలో కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. ‘శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం ఎవరో తెలిసిపోతుంది’ అని అన్నారు. మార్చి 19 ఆదివారం పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు.
మీడియా దృష్టిని మళ్లించేందుకేనా?
‘యూపీ కొత్త సీఎం, కేబినెట్ సహచరులతో కలిసి 19 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణం చేయనున్నారు’ అని లక్నోలో గవర్నర్ రామ్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, మీడియా దృష్టిని పక్కదారి పట్టించేందుకే సీఎం ఎంపిక బాధ్యతను మౌర్యకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారని భావిస్తున్నారు. అటు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తను సీఎం రేసులో లేనని ప్రకటించారు. పాలనలో అనుభవం ఉండటంతోపాటు.. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీని ‘మిషన్ 2019’ మోడ్‌లో నడిపే సత్తా కేవలం రాజ్‌నాథ్ ఒక్కరికే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
యూపీ రైతుల రుణాల మాఫీ
ఉత్తరప్రదేశ్‌లో కొలువదీరనున్న బీజేపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఈ అంశాన్ని చేర్చిందని.. దీనికి అనుగుణంగానే రుణమాఫీ జరుగుతుందన్నారు.