అధికారమిస్తే అందరికీ వైద్య బీమా: రాజ్‌నాథ్
Published Fri, Aug 9 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు ఖరీదైపోయాయని, గ్రామాలు, గుడిసెల్లో నివసించే వారు వాటిని భరించే స్థితిలో లేరని అన్నారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం లభించి 66 ఏళ్లు గడిచినప్పటికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్థిరత్వం ప్రజలకు కల్పించలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.
అవి లేకుండా మనది సంక్షేమ రాజ్యం అని చెప్పలేమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకివన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన వృద్ధి రేటు పెరిగినప్పుడు ప్రపంచం ఎదుట మన జబ్బలు మనమే చరచుకుంటామని అన్నారు. అయితే ప్రజలకు విద్య, వైద్యం, ఆర్థిక స్థిరత్వం ఇవ్వలేని జీడీపీ వృద్ధి వల్ల ఉపయోగమేమిటని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న ఆదాయ అసమానతలు దేశ ఐక్యతకు ముప్పు అని హెచ్చరించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందకపోతే దేశంలో అశాంతి ప్రజ్వరిల్లుతుందన్నారు.
ముంబై, అహ్మదాబాద్ నగరాల తరువాత వైద్య కళాశాలను కలిగి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఢిల్లీ నిలవనుంది. ఎన్‌డీఎంసీ ఆధ్వర్యంలోని హిందూరావు ఆస్పత్రి ఢిల్లీలోని తొలి మున్సిపల్ మెడికల్ కాలేజీని నిర్వహించనుంది. ఈ కాలేజీలో తొలి బ్యాచ్‌గా 50 మంది వైద్య విద్యార్థులు ఇప్పటికే ప్రవేశం పొందారు. ఈ కాలేజీకి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎన్‌డీఎంసీ మెడికల్ కాలేజీగా నమకరణం చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది.
Advertisement
Advertisement