బోడోలపై చర్యలకు భూటాన్ సాయం
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ వెల్లడి
- బోడో నరమేధం జరిగిన సోనిత్‌పూర్‌ను సందర్శించిన రాజ్‌నాథ్
- అస్సాంలో కొనసాగుతున్న హింస.. 78కి పెరిగిన మృతుల సంఖ్య
గువాహటి/సోనిత్‌పూర్: అస్సాంలో నరమేధానికి పాల్పడిన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (సాంగ్బిజిత్) ఉగ్రవాద సంస్థపై కఠిన చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగుదేశమైన భూటాన్ సరిహద్దులో ఈ సంస్థ స్థావరాలపై చర్యలు చేపట్టేందుకు ఆ దేశాన్ని సంప్రదించనున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆయన గురువారం దిగువ అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాను సందర్శించారు.
బోడో ఉగ్రవాదుల నరమేధం, అనంతర పరిస్థితులపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్, ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహించబోదని, నిషిద్ధ బోడో ఉగ్రవాదులపై చర్యల కోసం భూటాన్ సాయం కోరాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరామని చెప్పారు.
ఉగ్రవాదులపై చర్యలు చేపడతామని, అయితే అది ఎప్పుడనేది చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. భూటాన్ సరిహద్దులో ఉన్న బోడో ఉగ్రవాదుల స్థావరాలపై సాయుధ బలగాలు చర్యకు దిగినప్పుడల్లా ఉగ్రవాదులు భూటాన్ అడవుల్లోకి పారిపోతున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు బోడోల హింసలో మరణించిన ఆదివాసీల సంఖ్య గురువారానికి 78కి పెరిగింది. ఈ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ ఉన్నప్పటికీ గురువారం కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. గోస్సాయ్‌గావ్ ప్రాంతంలో బోడోలకు చెందిన పలు గృహాలను ఆదివాసీలు దహనం చేశారు.