కాశ్మీర్‌లో వరద విలయం | Jammu and Kashmir flood tolls climbs up to 160, Rajnath Singh assures help | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌లో వరద విలయం

Published Sun, Sep 7 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

కాశ్మీర్‌లో వరద విలయం

కాశ్మీర్‌లో వరద విలయం

116కు చేరిన మృతుల సంఖ్య
పోటెత్తిన నదులు, వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు
నీటమునిగిన 450 గ్రామాలు
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జితేంద్ర సింగ్ సమీక్ష
శ్రీనగర్: అరవై ఏళ్లలో కనీవినీ ఎరగని వరదలు జమ్మూ కాశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల్లో మృతుల సంఖ్య 116కి చేరింది. జమ్ము డివిజన్‌లో శనివారం మరో 11 మంది మరణించారు. ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం, భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, 450 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. శనివారం పుల్వామా జిల్లాలో సహాయ కార్యక్రమాల  విధుల్లో ఉన్న 9 మంది సైనిక సిబ్బందితో కూడిన బోటు జీలంనది వరదనీటిలో మునిగిపోయింది. వారిలో ఏడుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దక్షిణ కాశ్మీర్‌లో పలు నదులు ప్రమాద స్థాయిని మించడంతో పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాలు సహా పలు ప్రాంతాలు నీటమునిగాయి.పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జితేంద్ర సింగ్ శనివారం శ్రీనగర్, జమ్ము ప్రాంతాల్లో పర్యటించారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలసి వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఏరియల్ సర్వేని రద్దుచేసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినట్టు రాజ్‌నాథ్ చెప్పారు.

సహాయ కార్యక్రమాలకోసం దాదాపు లక్ష మంది సిబ్బందిని సైన్యం సమీకరించినట్టు అధికారులు తెలిపారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం (ఎన్టీఆర్‌ఎఫ్) బృందాలను, వైమానిక దళ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలోనే 9 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా, వైష్ణో దేవీ యాత్రను వరుసగా మూడోరోజూ రద్దుచేశారు. జమ్ము -శ్రీనగర్ జాతీయ రహదారినీ మూసివేశారు.
 
జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కాంగ్రెస్

జమ్ము కాశ్మీర్‌లో వర్షబీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ డిమాండ్ చేశారు. వరదపై ప్రధాని మోడీ అధికారులతో సమీక్షించారు. ఆయన ఆదివారం కాశ్మీర్‌లో ఏరియల్ సర్వే చేయనున్నారు.  
 
పాక్‌లో 160 మంది బలి
పాకిస్థాన్ వర్ష బీభత్సానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం నమోదవుతోంది. శనివారానికి సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 148 మంది గాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పాలంద్రిలో 66.8 సెంటీమీటర్లు, ఇస్లామాబాద్‌లో 31.6 సెంటీమీటర్లు, రావల్పిండిలో 44 సెంటీమీటర్లు, లాహోర్‌లో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement