మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం | Central and state governments work together and work for Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం

Published Wed, Apr 26 2017 12:39 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం - Sakshi

మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం

8న నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలతో భేటీ
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నివాళి


రాయ్‌పూర్‌/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న మావోయిస్టుల తాజా దాడిని కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పెను సవాలుగా తీసుకున్నాయి. సరికొత్త వ్యూహంతో మావోయిస్టులను గట్టి ఎదురుదెబ్బ తీస్తామని ప్రకటించాయి. మావోయిస్టులపై చేస్తున్న పోరాట వ్యూహాన్ని పునఃసమీక్షిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలించడానికి నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలన్నింటితో వచ్చే నెల 8న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని, ఇందులో వ్యూహాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నాటి మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్లకు ఆయన మంగళవారం మానా క్యాంపులో నివాళి అర్పించారు. రాష్ట్ర గవర్నర్‌ బలరామ్‌జీ టాండన్, ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్, పలువురు పారామిలటరీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మావోయిస్టులు నిరాశా నిస్పృహలతో, పిరికితనంతో పాశవిక దాడికి పాల్పడ్డారని, దీన్ని సవాలుగా స్వీకరిస్తున్నామని రాజ్‌నాథ్‌ విలేకర్లతో పేర్కొన్నారు.

‘మా సాహస జవాన్ల త్యాగాలు వృథాకావు. వామపక్ష తీవ్రవాద సంస్థలు అభివృద్ధికి వ్యతిరేకం. రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడానికి యత్నిస్తున్నాయి.. మావోయిస్టులు బస్తర్‌లో రోడ్ల అభివృద్ధిని సహించలేకపోతున్నారు. గిరిజనులను మానవ రక్షక కవచాలుగా వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో నక్సల్స్‌ నిరోధక ఆపరేషన్లను మరింత పటిష్టంగా, శక్తిమంతంగా నిర్వహిస్తామని రమణ్‌ సింగ్‌ తెలిపారు. ‘సుక్మాలో నక్సల్స్‌పై పోరు దేశంలోనే వామపక్ష తీవ్రవాదంపై పెద్ద పోరాటం.

ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను, నిర్మాణ పనులను విస్తృతం చేస్తాం’ అని చెప్పారు. అనంతరం రాజ్‌నాథ్, సీఎంలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. కాగా, దాడిలో చనిపోయిన తమ రాష్ట్ర జవాన్లకు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షలు, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూ. 5 లక్షలు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.30 లక్షలు, పంజాబ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఇద్దరు హరియాణా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంది.

ఛత్తీస్‌గఢ్‌లోనే ఉండండి
మావోయిస్టు నిరోధక ఆపరేషన్ల సమన్వయం కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఉండాలని సీఆర్‌పీఎఫ్‌ తాత్కాలిక అధిపతి సుదీప్‌ లఖ్‌తాకియా, హోం శాఖలోని సీనియర్‌ సలహాదారు కే.ఆర్‌ విజయ్‌కుమార్‌లను రాజ్‌నాథ్‌ ఆదేశించారు. దాడుల్లో నష్టపోతున్న సీఆర్‌పీఎఫ్‌ పనితీరుపై అసంతృప్తితో ఆయన ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయుధాల కొరత, నిఘా సమాచార లేమి వంటి సమస్యలను అధిగమించాలని ఆయన బలగానికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా దాడిలో పాల్గొన్న మావోయిస్టుల లక్ష్యంగా చేపట్టనున్న భారీ ఆపరేషన్‌ పూర్తయ్యేవరకు ఈ ఇద్దరు అధికారులు రాష్ట్రంలోనే ఉంటారని వెల్లడించాయి.

భేటీకి ఏపీ, తెలంగాణ సీఎంలు
మే నెల 8న ఢిల్లీలో జరిగే నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని కేంద్ర హోం శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పారామిలటరీ దళాల అధిపతులు కూడా భేటీలో పాల్గొంటారని వెల్లడించారు.

నక్సల్స్‌తో రమణ్‌సింగ్‌ ఒప్పందం: దిగ్విజయ్‌
ఛత్తీస్‌ సీఎం రమణ్‌ సింగ్, ఇతర బీజేపీ నేతలకు నక్సల్స్‌తో బేరసారాల ఒప్పందముందని మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ‘రమణ్, బీజేపీ నేతలంతా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల నుంచే ఎన్నికల్లో గెలిచారు. వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి’ అని అన్నారు.

22 ఆయుధాలు అపహరించిన మావోలు
చింతూరు (రంపచోడవరం): ఘటనా స్థలం నుంచి మావోలు మొత్తం 22 అత్యాధునిక ఆయుధాలను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. వీటిలో 12 ఏకే 47లు, 4 ఏకేఎం రైఫిళ్లు , రెండు ఇన్సాస్‌ ఎల్‌ఎంజీలు, మూడు ఇన్సాస్‌ రైఫిళ్లు, 5 వైర్‌లెస్‌ సెట్లు, రెండు బైనాక్యులర్లు, 22 బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఉన్నాయని, వీటితోపాటు 2820 ఏకే47, ఏకేఎం బుల్లెట్లు, 600 ఇన్సాస్‌ బుల్లెట్లు, 62 యూబీజీఎల్‌ బుల్లెట్లను సైతం తీసుకెళ్లారని తెలిపారు.

దాడి చేసిన వారిలో 70 శాతం మహిళలే
సుక్మా జిల్లాలోని కాలాపత్తర్‌లో సోమవారం సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై దాడి చేసిన మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారని ఘటనలో గాయపడిన జవాన్‌ ఒకరు తెలిపారు. దాడి తర్వాత మృతిచెందిన జవాన్ల తుపాకులను మహిళా మావోలే తీసుకెళ్లారని మరో జవాన్‌ చెప్పారు. నల్లదుస్తులు ధరించిన 300 మంది మావోలు దాడికి పాల్పడ్డారని, వారిలో కొందరి వద్ద రాకెట్‌ లాంచర్లు ఉన్నాయన్నారు.

భోజనాలు చేస్తుండగా..: కాలాపత్తర్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు రక్షణ కోసం వెళ్లిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేస్తుండగా మావోలు చుట్టుముట్టి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ‘మావోయిస్టులు స్థానికుల సాయంతో జవాన్ల కదలికలను పసిగట్టారు. ఒక టీంలోని 36 మంది జవాన్లు భోజనాలకు కూర్చోగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు విరుచుకుపడి అధునాతన ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించారు’ అని చెప్పారు. గస్తీ కాస్తున్న జవాన్లు దీటుగా కాల్పులు జరిపి, సమీపంలోని 40 మంది పౌరులు, నిర్మాణ కార్మికుల ప్రాణాలను కాపాడగలిగారు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement