సుక్మా దాడి వెనుక సూత్రధారి ఇతనే!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి వెనుక సూత్రధారి ఎవరు అనే దానిపై పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. 24 ఏళ్ల కరుడుగట్టిన మావోయిస్టు కమాండర్ ఈ ఊచకోతకు సూత్రధారి అని తెలుస్తోంది. 25మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఈ మారణకాండకు సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్ మిలిటరీ బెటాలియన్ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు తెలుస్తున్నదని పోలీసులు బుధవారం తెలిపారు.
దక్షిణ సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కిరాతకమైన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 2010లో సుక్మా పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించారు.
గత మార్చి 11న 12మంది భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న దాడి వెనుక కూడా హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ కారణమని భావిస్తున్నారు. మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన బస్తర్‌లో హిద్మా కరుడుగట్టిన మావోయిస్టుగా పేరొందాడు. దక్షిణ సుక్మాలోని పుర్వతి గ్రామంలో జన్మించిన అతని నాయకత్వ పరిధిలో ప్రస్తుతం దక్షిణ సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. చూడటానికి బక్కపలుచగా కనిపించే హిద్మా అత్యంత కర్కశమైన రెబల్ నాయకుడిగా పేరొందాడని, అతనికి తన ప్రాంతంనిండా చాలా నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.